BBC 100 Women 2020: సనా మారిన్ అనాథాశ్రమంలో పెరిగి, 34 ఏళ్లకే ఫిన్లాండ్‌కు ప్రధాని అయ్యారు

    • రచయిత, మేఘా మోహన్, యూసఫ్ ఎల్డిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల పేర్లతో బీబీసీ ‘100 వుమెన్’ జాబితాను ప్రకటించింది.

ప్రపంచమంతా ఒడిదొడుకులు నెలకొన్న ఈ సమయంలో మార్పుకు దారి చూపుతూ ముందుకు సాగుతున్న మహిళలకు ప్రాధాన్యమిస్తూ ఈ జాబితాను రూపొందించింది బీబీసీ.

ఈ జాబితాలో ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్ కూడా చోటు దక్కించుకున్నారు.

మహిళల నేతృత్వంలో అక్కడ ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన ఎలా సాగిస్తుందా అన్నదానిపై అందరి దృష్టీ ఉంది. కరోనావైరస్ సంక్షోభ సమయంలో దేశాన్ని నడిపించిన తీరుపై సనా ప్రభుత్వం ప్రశంసలు అందుకున్నారు.

సంప్రదాయానికి భిన్నమైన నేపథ్యమున్న సనా మారిన్ ప్రభుత్వంతో కొన్ని ‘వెనకబాటు’ చట్టాలు మారతాయని ఆ దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలు ఆశిస్తున్నాయి.

ప్రధాని కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోని హౌస్ ఎస్టేట్స్‌లో సనా మారిన్ తమ ప్రభుత్వంలోని నేతలతో కీలకమైన ‘సమానత్వ కార్యక్రమం’ గురించి సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ఆగస్టులో కరోనా సంక్షోభం కొనసాగుతున్న సమయంలోనే ఆమె వివాహం జరిగింది. ఈ విషయం ఎక్కువమందికి తెలియదు. హనీమూన్‌కు వెళ్లి వచ్చి వారంలోనే ఆమె మళ్లీ పనిలో పడ్డారు.

పెళ్లి తర్వాత ఆమె చిన్న విరామం తీసుకున్నారు. ఓ రహస్య ప్రాంతానికి హనీమూన్‌కు వెళ్లారు. సనా మారిన్‌కు రెండేళ్ల పాప కూడా ఉంది.

సనా మారిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వివాహ దుస్తులతో ఉన్న ఆమె ఫొటో చూసి చాలామంది ఆశ్చర్య పోయారు. ఆమె పెళ్లి వార్త చాలామందికి తెలియదు.

సనా మారిన్ భర్త పేరు మార్క్స్ రోకోనెన్. ఆయన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు. 16 ఏళ్లుగా సనా, మార్క్స్ కలిసి ఉంటున్నారు.

యువతరానికి నేతృత్వం

అధికార కూటమి సమావేశం జరుగుతున్న మౌస్ ఆఫ్ ఎస్టేస్ట్స్‌ బయట సనా మారిన్‌ను ప్రశ్నలు అడిగేందుకు పదుల సంఖ్యలో విలేఖరులు ఎదురు చూస్తూ ఉన్నారు.

‘‘వాళ్లతో ఏం చెప్పాలనేది నేను ఆలోచించుకోలేదు. ఏది అడిగినా నిజాయితీగా బదులు చెబుతా?’’ అని సనా అన్నారు.

“ వాళ్లు మీ వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రశ్నలు అడగవచ్చు కదా?’ అన్నప్పుడు...‘‘లేదు. వాళ్లు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటారు. మన చుట్టూ చాలా జరుగుతున్నాయి. నా వ్యక్తిగత జీవితం గురించి చివర్లో కొన్ని ప్రశ్నలు అడిగితే అడగవచ్చు’’ అని సనా బదులిచ్చారు.

నాలుగు గంటలపాటు ఈ సమావేశం నడిచింది. ఈ మీటింగ్‌కు అందరికన్నా ముందుగా వచ్చింది, సమావేశం నుంచి ఆఖరిగా బయటకు వచ్చింది కూడా సనానే. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు.

ఆమె అన్నట్లుగానే అక్కడి విలేఖరులు ముఖ్యమైన విషయాల గురించే ప్రశ్నలు అడిగారు.

2019 డిసెంబర్‌లో మొదటిసారి సనా మారిన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఫిన్లాండ్ ప్రధాని పదవి చేపట్టింది అప్పుడే. 34 ఏళ్ల వయసులోనే ఆమె ఫిన్లాండ్‌కు ప్రధాని అయ్యారు.

ఐదు పార్టీలు కలిసి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆమె కేబినెట్‌లో ఎక్కువమంది మహిళలే.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రోజు ఆమె తన కేబినెట్ సభ్యులతో కలిసి వేదికపైకి వచ్చి మాట్లాడారు. ఆ రోజు ఆమెతో ఉన్న నేతలంతా మహిళలే.

‘‘ మేం యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఫిన్లాండ్‌ వాసులు ఎవరన్నది ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఇది’’ అని అన్నారు.

“ ఫిన్లాండ్‌లో ఫెమినిజం పరిపక్వతకు వచ్చింది’’ “ఫిన్లాండ్ పార్లమెంటు: లింగ సమానత్వం విషయంలో అగ్రగామి’’, “మహిళల రాజ్యం: మనం ఇన్నాళ్లూ ఎదురుచూస్తుంది దీని కోసమే’...ఇవీ ఆ తర్వాతి రోజు పత్రికల్లో వచ్చిన హెడ్‌లైన్‌లు.

బీబీసీ 100 మంది మహిళలు

ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల పేర్లతో బీబీసీ ‘100 వుమెన్’ 2020 జాబితాను ప్రకటించింది. అందులో సనా మారిన్ ఒకరు. పూర్తి జాబితా ఇక్కడ చూడండి..

లింగ సమానత్వం

ఫిన్లాండ్‌ 1906లోనే మహిళలకు పూర్తి ఓటు హక్కును, పార్లమెంటరీ హక్కులను కల్పించింది. ఇలా చేసిన మొదటి దేశం ఫిన్లాండే. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు చాలా పశ్చిమ దేశాలు ఈ పని చేయలేక పోయాయి.

ఆ మరుసటి ఏడాది ఫిన్లాండ్ పార్లమెంటుకు 19మంది మహిళలు ఎన్నికయ్యారు. 2000లో ఫిన్లాండ్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్యా హలోనేన్ ఎన్నికయ్యారు. 2003లో తొలి మహిళా ప్రధానిగా అనేలీ యెటెనమకీ ఎన్నికయ్యారు.

2019లో సెంటర్ లెఫ్ట్ డెమొక్రటిక్ పార్టీ సనా మారిన్‌ను ప్రధానిగా ఎన్నుకుంది.

కోవిడ్-19పై పోరాటం

కోవిడ్-19 వ్యాప్తి మొదలైన మూడు నెలల తర్వాత మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించింది. కానీ, సనా మారిన్ ప్రభుత్వం ఆరంభంలోనే వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంది.

మార్చి 16 నాటికే ఫిన్లాండ్‌లో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చేసింది. ఎమర్జెన్సీ చట్టాన్ని కూడా అక్కడి ప్రభుత్వం ప్రయోగించింది. ఫిన్లాండ్‌లో చివరగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఈ చట్టం ద్వారా జీతభత్యాలు, కార్మిక శక్తిని నియంత్రించే అధికారాలు ప్రభుత్వానికి లభిస్తాయి.

ఎమర్జెన్సీ చట్టాన్ని ప్రయోగించడంపై మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే, ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినట్లు ఆ సమయంలో జరిగిన పోల్స్ తేల్చి చెప్పాయి.

వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని, లక్షణాలు ఏమాత్రం కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

పరిస్థితిని సమన్వయం చేసుకునేందుకు ల్యాబ్‌లు, వైద్యులు, ఆసుపత్రులతో క్రమం తప్పకుండా ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహించింది.

సనా మారిన్‌తో పాటు ఆమె కేబినెట్‌లోని ఉన్నత పదవుల్లో ఉన్న మరో నలుగురు మహిళా నేతలు ప్రతి వారం మీడియా ముందుకు వచ్చి, తాజా పరిణామాలను వివరించేవారు. ఒకరైతే చిన్నపిల్లల సందేహాలకు బదులు ఇచ్చే బాధ్యతను తీసుకున్నారు.

తైవాన్, జర్మనీ, న్యూజీలాండ్ దేశాలకు నేతృత్వం వహిస్తున్న మహిళా నేతలతోపాటు సనా మారిన్‌కు కూడా కరోనా వైరస్ సంక్షోభ సమయంలో చూపించిన పాలనా దక్షతకు ప్రశంసలు దక్కాయి.

“ పురుషుల నాయకత్వంలో ఉన్న దేశాలలో కూడా కరోనా మీద చర్యలు బాగానే ఉన్నాయి’’ అన్నారు సనా మారిన్‌. “ ఇది పురుషుడా, స్త్రీయా అన్న తేడాకు సంబంధించిన విషయం కాదు. ఇతర దేశాల నుంచి మంచి విషయాలు తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యం’’ అన్నారామె.

ఫిన్లాండ్‌లో సుమారు 55 లక్షలమంది జనాభా ఉండగా, 370మంది కోవిడ్‌ కారణంగా మరణించారు. ప్రతి 10 లక్షలమందిలో 60మంది ఈ వైరస్‌ కారణంగా చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఆ రేటు పదింతలు ఎక్కువగా ఉంది.

“ మేం నిపుణులు ఏం చెబుతున్నారో శ్రద్ధగా విన్నాం. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాలు చిన్న విషయం కాదు’’ అన్నారు సనా మారిన్‌

“ ప్రజల్లో ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వం మీదా నమ్మకం ఉంది’’ అన్నారామె.

సంకీర్ణంలో సంక్షోభం

సరిగ్గా సంక్షోభ సమయంలోనే సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. నిధుల దుర్వినియోగం అభియోగంపై సంకీర్ణ కూటమిలోని భాగస్వామ్య పార్టీకి చెందిన కత్రి కులుమ్ని ఉప ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్‌లో ఆమె స్థానంలో అన్నిక సారిక్కో అనే మరో మహిళా నేత ఆ బాధ్యతలు చేపట్టారు.

ఫిన్లాండ్‌ సంకీర్ణ కూటమి ఐక్యంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం వారిలో భిన్నాభిప్రాయాలున్నాయి.

“ ఇక్కడ ఎవరూ తమ సొంత అభిప్రాయం మీద ముందుకు సాగలేరు’’ అన్నారు ఆ దేశ విద్యాశాఖామంత్రి, వామపక్ష పార్టీ నేత 33 ఏళ్ల లీ ఆండర్సన్‌.

భవిష్యత్తులో తాను ఏ స్థాయిలో ఉంటానో మారిన్‌ కనీసం ఊహించలేదు. కెసరాంట ప్రాంతంలో ఆమె తన భర్త, కూతురు ఎమ్మాతో కలిసి జీవించారు. “ రాజకీయాలు, రాజకీయ నాయకులు నాకు చాలా దూరంగా ఉండేవారు. నేను భిన్నమైన ప్రపంచంలో ఉండేదాన్ని” అన్నారు సనా.

“ చాలామంది ఫిన్లాండ్‌ వాసుల జీవితాలలో మాదిరిగానే నా జీవితంలో కూడా విషాదముంది’’ అని 2016లో ఆమె ఒక బ్లాగులో రాశారు.

స్వతంత్ర వ్యక్తిత్వం

ఫిన్లాండ్‌ నైరుతి ప్రాంతంలో ఉండే పిర్కాలా అనే చిన్నపట్టణంలో పుట్టి పెరిగారు మారిన్‌. తల్లి, ఆమె గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సనా మారిన్‌ నివసించేవారు. అదో అందమైన హరివిల్లులాంటి కుటుంబమని చెప్పారామే. కానీ ఆర్థికంగా కష్టాలు వెంటాడేవి.

తల్లి చనిపోయాక, తాగుబోతు తండ్రిని వదిలేసి అనాథాశ్రమంలో పెరిగారు సనా. అక్కడ లభించే సౌకర్యాలను వినియోగించుకున్నారు. చాలా చిన్న వయసు నుంచే ఆమె అనేక ఉద్యోగాలు చేశారు.

అయితే ఆమె పెద్దగా తెలివైన విద్యార్ధిని కూడా కాదు. “ఓ సాదాసీదా స్టూడెంట్‌’’ అన్నారు పిర్కాలాలో ఆమెకు చదువు చెప్పిన టీచర్‌ పాసి కెర్వినెన్‌.

20వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి ఆమెలో రాజకీయాలలో ప్రవేశించాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. తనతోపాటు తన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా మెరుగుపరచాలన్నది ఆమె ఆలోచన.

సమానత్వం విషయంలో మారిన్‌ ప్రభుత్వం చేపట్టిన అనేక పాలసీలకు ఈ ఆలోచనే మూలం.

గృహహింసను కఠినంగా అణచివేయడం, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరినీ భాగస్వాములను చేయడం, స్త్రీ పురుషుల జీతాలలో తేడాలను తగ్గించడం, పేదలు, విదేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వారికి విద్యను అందించే విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఇందులో కొన్ని.

లింగ నిర్ధారణ విషయంలో ప్రస్తుత చట్టాలలో ఉన్న లోపాలను తొలగించి వాటిని సంస్కరించాలని ఆమె భావిస్తున్నారు. “ ప్రతి ఒక్కరికి తమ గుర్తింపును చెప్పుకునే అవకాశం కల్పించాలి. మేం దానికోసం ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారామె.

లింగమార్పిడి చేసుకున్న వారిని మహిళలుగా గుర్తిస్తారా?

“ మనుషులకు గుర్తింపునివ్వడం నా పని కాదు’’ అని తేల్చి చెప్పారామె. “ఎవరికి వారు తమ గుర్తింపు ఏంటో వాళ్లే నిర్ణయించుకోవాలి ’’ అన్నారు మారిన్‌. లింగ ప్రకటన విషయంలో ఇలాంటి ప్రకటన చేసిన తొలి నేత సనా మారిన్‌.

పాతబడిన లింగ మార్పిడి చట్టాన్ని సవరించాలంటూ ఉద్యమాకారులు చాలారోజుల నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా మారుస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.

గత ప్రభుత్వాలు వీటిని మార్చాలని ప్రయత్నించినా సంప్రదాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గాయని ఈ ఉద్యమంలో చురుకుగా పనిచేస్తూ, ప్రభుత్వ సలహాదారులలో ఒకరుగా ఉన్న కాస్పర్‌ కివిస్టో అన్నారు.

“ దేశాన్ని ఇప్పుడు అత్యంత యువనేతలు ఏలుతున్నారు. అయితే ఇది ఒక ఆశాజనకమైన స్థితి మాత్రమే’’ అన్నారు కాస్పర్‌ కివిస్టో. ప్రభుత్వం చేపట్టబోయే అన్ని సంస్కరణలకు తనవంతు సాయం అందిస్తానని ఆయన అంటున్నారు.

సంకీర్ణంలోని ఐదు పార్టీలు ఈ సంస్కరణలకు సిద్ధంగా ఉన్నాయని, ఈ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు వస్తుందని కివిస్టో తెలిపారు. “ ఫిన్లాండ్‌లో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంది. అన్ని పార్టీలు, సిద్ధాంతాల మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని మారిన్‌ అన్నారు.

ఏప్రిల్ నెల నుంచి కరోనా మహమ్మారిపై పోరాటంలో బిజీగా ఉన్నారు సనా మారిన్‌. ఆమెకు దేశంలో 85శాతంమంది నుంచి మద్దతు లభించింది.

అదే సమయంలో అమెరికాలో జరుగుతున్న ‘బ్లాక్‌లైవ్స్‌’ మ్యాటర్‌ ఉద్యమ ప్రభావం ఫిన్లాండ్‌లో కూడా కనిపించింది. సమానత్వ చట్టాల గురించి ఫిన్లాండ్‌లో నివసిస్తున్న నల్లజాతి ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు.

శరీర వర్ణాన్నిబట్టి తాము వివక్షను ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు.

ఫిన్లాండ్‌లో ఉంటున్న ఆఫ్రికన్‌ సంతతికి చెందిన జనాభాలో 63శాతంమంది తాము తీవ్రమైన వర్ణవివక్షను ఎదుర్కొంటున్నామని తెలిపినట్లు 2019లో విడుదలైన ఒక నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం బెల్లా ఫోర్స్‌గ్రెన్‌ అనే యువతి నల్లజాతి తరఫున ఏకైక పార్లమెంటు సభ్యురాలిగా నిలిచారు.

“ప్రజా జీవితంలో వైవిధ్యాల మధ్య రాజీ కుదర్చడానికి ప్రభుత్వం మరింత ప్రయత్నం చేయాలి’’ అన్నారు ఫిన్లాండ్‌ గ్రీన్‌ లీగ్‌కు చెందిన మారియా ఒహిసాలో. “ చదువుకున్న ఐదుగురు తెల్లజాతి మహిళలు పాలిస్తున్నామని చెప్పుకోవడం ఒక్కటే సరిపోదు. ఇక్కడ కూడా సమానత్వం పాటించాల్సిన అవసరం ఉంది’’ అన్నారామె.

“ ఈ అసమానతలను సరిచేయడం నా ఒక్కదాని బాధ్యత కాదు. ఫిన్లాండ్‌ ప్రజలంతా ఈ అసమానత్వాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాలి’’ అన్నారామె.

తాము తీసుకురాబోయ సమానత్వ చట్టం వివక్షను ఎదుర్కొంటున్న వర్గాల స్థితిగతులను మెరుగు పరచగలదని సనా మారిన్‌ ఆశాభావంతో ఉన్నారు.

“ఈ చట్టం వాస్తవ రూపం దాల్చేలా ప్రయత్నిస్తున్నాం. ప్రధానిగా నా ముందున్న పెద్ద బాధ్యత ఇదే ’’ అన్నారు సనా మారిన్‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)