You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పొలంలో తిరుగుతూ మొక్కల్ని పరిశీలించే రోబోలను తయారు చేసిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్
ఇంట్లో పనులన్నీ చేసిపెట్టే రోబోలు వస్తున్న ఈ రోజుల్లోనే పంటలను పరిశీలించి జాగ్రత్తలు చెప్పేందుకు కూడా కొత్తతరం రోబోలు సిద్ధమవుతున్నాయి.
ఒక్కొక్క మొక్క పరిస్థితిని పరిశీలించి దాని మంచి చెడులను గుర్తించి చెప్పగల ప్రొటో టైప్ రోబోలను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తయారు చేసింది. రైతులు పంట దిగుబడి పెంచుకోవడంలో ఇది ఎంతగానో సహాయకారిగా ఉంటుందని ఆ కంపెనీ చెబుతోంది.
ఎత్తుగా పిల్లర్ల మీద నిలబడినట్లుంటే ఈ యంత్రాలు మొక్కలను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా పొలమంతా తిరుగుతాయి. ఇలా తిరుగుతూ తిరుగుతూ మొక్కలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తాయి.
ప్రాజెక్ట్ మినరల్ పేరుతో ఆల్ఫాబెట్‌కు చెందిన ఎక్స్ అనే కంపెనీ ఈ రోబోలను తయారు చేసింది. ప్రపంచాన్ని మార్చే విప్లవాత్మక సాంకేతిక పరిజ్జానాన్ని తయారు చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా వీటిని సిద్ధం చేశారు.
“వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని మేం భావిస్తున్నాం’’ అని ప్రాజెక్ట్ లీడ్ ఇలియట్ గ్రాంట్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు సహకరిస్తుందని కంపెనీ గట్టిగా నమ్ముతోంది.
ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?
ఇప్పటి వరకు ఉన్న ఏ టెక్నాలజీ కూడా ఈ రోబోలు ఇచ్చే సమాచారాన్ని ఇవ్వలేవని ప్రాజెక్ట్ బృందం చెబుతోంది. “ ప్రతి మొక్కకు ఏమేం పోషకాలు కావాలో ఈ రోబోలు చెప్పగలుగుతాయి’’ అని ఇలియట్ ఈ బ్లాగులో రాసుకొచ్చారు.
రైతుల దగ్గర వాతావరణం, భూమిలో పోషకాల సమాచారం ఉంటే ఉండొచ్చు. కానీ ఈ రోబోలు మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, వాతావరణ పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నాయి అన్న విషయాన్ని చక్కగా గుర్తిస్తాయని కంపెనీ చెబుతోంది.
“ఈ యంత్రాలతో ఇల్లినాయిస్, కాలిఫోర్నియాలలోని సోయాబీన్, స్ట్రాబెర్రీ తోటల్లో గత కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నాం. స్ట్రాబెర్రీ ప్రతి మొక్క, ప్రతి ఆకు, ప్రతి పండు వివరాలను ఈ రోబోలు సేకరిస్తున్నాయి’’ అని కంపెనీ వెల్లడించింది.
సోయాబీన్ మొక్కలకు కాసిన కాయల్లో గింజలు ఎన్నో కూడా ఈ యంత్రాలు చెప్పగలుగుతాయి. ఒక్కొక్క మొక్క ఎత్తు, ఆకుల వెడల్పు, పండు సైజు ఎంతో కూడా రికార్డు చేస్తాయి. ఈ సమాచారమంతా మెషిన్ లెర్నింగ్ సిస్టమ్‌లో నమోదవుతుంది. దీని ద్వారా పంటల తీరుతెన్నులను రైతులు తెలుసుకోగలుగుతారు.
“పొలాల్లో రోబోట్లతో పని చేయించుకోవడం ఒక తెలివైన ప్రయోగం’’ అని టెక్నాలజీ నిపుణుడు ఇయాన్ డ్రూ వ్యాఖ్యానించారు. దీని ద్వారా కీటకాలను గుర్తించడం, పంటలు ఎప్పుడు కోతకు వస్తాయో తెలుసుకోవడం, కలుపు ఎప్పుడు తీయాలన్నది గుర్తించడం ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని ఇయాన్ అన్నారు.
“వ్యవసాయంలో రోబోల సహకారం కచ్చితంగా ప్రభావవంతంగా ఉంటుంది. అది పెద్ద మొత్తంలో కాకపోవచ్చు. 1%, 2%, 5% ఇలా ఏ కాస్త మెరుగుదల కనిపించినా అది రైతులకు ప్రయోజనకరమే. కాకపోతే దీనిలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి” అని ఇయాన్ వ్యాఖ్యానించారు.
జాతీయ ప్రయోజనాలు
డేటా సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమన్నారు ఇయాన్. ఎవరైనా మీ పంటకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించవచ్చు, లేదంటే హైజాక్ చేయవచ్చని ఇయాన్ అన్నారు. ఈ డేటా ఎవరి చేతుల్లో ఉంటుందన్నది కూడా కీలకమేనంటారాయన.
“ప్రభుత్వం ఈ సమాచారం కావాలని కావాలని అడగవచ్చు, లేదా దానిని ఎలా ఉపయోగిస్తున్నారని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది ’’ అని ఇయాన్ వ్యాఖ్యానించారు.
అమెరికాతోపాటు బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా రైతులతో కలిసి ప్రయోగాలు చేస్తున్నామని ప్రాజెక్ట్ మినరల్ తెలిపింది. అయితే కమర్షియల్‌గా ఈ యంత్రాలను మార్కెట్‌లోకి ఎప్పుడు విడుదల చేయాలన్నదానిపై ఇంకా ఆలోచించలేదని కంపెనీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని పార్టీ బీజేపీ: పి.సాయినాథ్
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు.. అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- రాయలసీమలో ‘రత్నాల’ వేట
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- BBC Click ఎపిసోడ్ 5: డ్రైవర్ రహిత ట్రాక్టర్లు ఎలా పని చేస్తాయ్
- ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)