You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సాంకేతికత: చెరకు తోటల్లో ‘డ్రోనా’చార్యుడు
ఎల్ సాల్వడోర్ దేశ పంటపొలాలపై ఓ చిత్రం కనిపిస్తోంది. చెరకు, మొదలైన తోటలపై డ్రోన్లు ఎగురుతున్నాయి. ఆ డ్రోన్లు 20 లీటర్ల ట్యాంకులతో పంటలపై ఎరువులు, మందులను పిచికారీ చేస్తున్నాయి.
ఇది.. పాత వ్యవసాయ సామాగ్రి స్థానంలో వచ్చిన కొత్త సాంకేతికత కాకపోయినా, ఈ పొలాలపై ఇలాంటి డ్రోన్లు ఎగరడం ఇదే మొదటిసారి.
ట్రాక్టర్లు, ప్లేన్‌లు పిచికారీ చేయలేని ప్రాంతాల్లో సైతం ఈ డ్రోన్ల సాయంతో ఎరువులను, మందులను పిచికారీ చేయగలుగుతున్నామని ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన హైలియో సంస్థ ప్రతినిధి నిక్ నవ్రతిల్ అన్నారు. ఈ విధానంతో పంటల దిగుబడి కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.
''ఇంతవరకూ పిచికారీ చేయలేని ప్రాంతాల్లో మా డ్రోన్లు ఎరువులను, మందులను చల్లుతున్నాయి'' అని నవ్రతిల్ అన్నారు.
ప్రస్తుతం ఎల్ సాల్వడోర్‌లో చాలా చోట్ల ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. తాము ఒక పూటలో దాదాపు 40 హెక్టార్ల పొలానికి పిచికారీ చేయగలుగుతున్నామని తెలిపారు.
ఈ విధానం ద్వారా ఎరువులను పిచికారీ చేశాక, గతంలో కంటే చెరకు గడ ఎత్తుగా పెరగడం తాను గమనించానని ఆయన అన్నారు.
ఈ డ్రోన్లు జీపీఎస్ సహాయంతో నిర్దేశించిన మార్గాల్లో ఎగురుతూ పంటలపై ఎరువులు, పురుగుల మందులను సమానంగా పిచికారీ చేస్తాయి.
ఈ విధానం వల్ల గతంలోకంటే దాదాపు 30% పురుగు మందులు ఆదా అయ్యాయని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక మహిళా రైతు వివరించారు.
పంటలకు అధిక మోతాదులో పురుగుల మందులు వాడటం వలన పర్యావరణంపై ప్రభావం పడుతోందని, జీవావరణం దెబ్బతింటోందన్న ఆందోళనలు ఉండేవి.
వర్షాలు పడినపుడు పొలాల్లో చల్లిన మందులు వర్షపు నీటితోపాటు నదుల్లో కలిసిపోతాయన్న భయాలు ఉండేవి. ఈ ఆందోళనల నుంచి సరికొత్త విధానం కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈ విధానం తప్పక ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు గత మే నెలలో భారత్‌లోని పత్తి పంటలపై కూడా ఈ విధానాన్ని అమలు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఫిలిప్పీన్స్ కూడా.. తమ దేశంలోని 5వేల హెక్టార్ల పంటలపై ఈ డ్రోన్ల సాయంతో ఎరువులను, మందులను ప్రయోగాత్మకంగా పిచికారీ చేశామని తెలిపింది.
2017 నాటికి వ్యవసాయం, అటవీ రంగాల కోసం ఇలాంటి డ్రోన్ల అమ్మకాలు దాదాపు 4 లక్షలకు చేరుకుంటాయని కొన్నేళ్ల క్రితమే 'ఐ.హెచ్.ఎస్.మార్కిట్'కు చెందిన నిపుణులు అంచనా వేశారు.
''మా సర్వే ప్రకారం, వ్యవసాయ డ్రోన్ల రంగంలో.. గతంలోని మా అంచనాలకు దగ్గరగానే గణాంకాలు ఉన్నాయి'' అని వారు అన్నారు.
తమ కంపెనీ డ్రోన్లను వాడితే రైతులకు దిగుబడి పెరుగుతుందని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. అలాంటి కంపెనీల్లో అమెరికాకు చెందిన ‘ప్రెసిషన్ హాక్’, ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎయిర్‌నోవ్’ కంపెనీలున్నాయి.
ఎయిర్‌నోవ్ కంపెనీకి చెందిన డ్రోన్లకు కెమెరాలు అమర్చి ఉంటాయి. ఈ కెమెరాల సాయంతో మొక్కల పెరుగుదల సమయంలో వాటికి నైట్రోజన్ ఏ స్థాయిలో అందుతోందో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి, పంటకు ఏ సమయంలో ఎరువులు వాడాలి? పంటలో ఏ ప్రాంతలో ఎరువులు ఎక్కువ అవసరం? లాంటి విషయాలు తెలుసుకోవడం సులభమవుతుంది.
ఈ విధానం ద్వారా.. ఎరువులు, మందులు వృధా అవ్వవు. ఖర్చు కూడా తగ్గుతుంది.
ఈ విధానం వల్ల తమకు 10% అధిక దిగుబడి వచ్చిందని ఫ్రాన్స్‌లో పెద్ద ఎత్తున వ్యవసాయం చేసే కోఆపరేటివ్ సంస్థ ‘ఒసీలియా’ పేర్కొంది.
వీటికి అమర్చిన మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్‌లు కంటికి కనపడని ఇన్ఫ్రారెడ్, రేడియేషన్, అల్ట్రావయొలెట్ కిరణాలను కూడా రికార్డు చేయగలవు. ఈ సౌకర్యంతో పంటలకు పోషకాల లోపం, పురుగు పట్టడం, నీరు సరిగా అందకపోవడం లాంటి పరిస్థితులను ఇట్టే గుర్తించవచ్చు.
ఇవి మానవ రహిత డ్రోన్లు అయినప్పటికీ వీటిని ఆపరేట్ చేయడానికి, సర్వీస్ చేయడానికి మనిషి అవసరం. దీంతో ఖర్చు కూడా పెరుగుతుంది. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూలి రేటు తక్కువగా ఉన్నచోట అంత ఖర్చు ఉండదు. అలాంటి దేశాల్లో ఈ డ్రోన్లు మరింత సౌకర్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
''అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలతో పోలిస్తే కూలి రేటు తక్కువగా ఉన్న దేశాల్లో ఈ డ్రోన్ల వాడకం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది'' అని డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఫోటోలను పొందే సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసే 'సిమాక్టివ్' కంపెనీకి చెందిన ఫిలిప్ సిమార్డ్ అన్నారు.
''ఈ డ్రోన్లను ఆపరేట్ చేయడానికి అమెరికన్లు లేరు. అందుకే మేం స్థానికులకు తర్ఫీదు ఇస్తున్నాం. వారే ఈ డ్రోన్లతో పని చేస్తున్నారు'' అని హైలియో సంస్థ ప్రతినిధి నవ్రతిల్ అన్నారు.
సిమార్డ్స్ కంపెనీ.. డ్రోన్ల నుంచి సేకరించిన ఫోటోలను 3డీ మ్యాప్‌లుగా మార్చి, పొలంలో నీటి ప్రవాహ గతి ఏవిధంగా ఉంటుందో రైతులకు వివరిస్తున్నారు. వరదల సమయంలో నేల, పంటలపై వరదల ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవచ్చు.
తాజాగా బ్రెజిల్‌లో చేపట్టిన ప్రాజెక్టులో పురుగు సోకిన మొక్కలను గుర్తించే విధానాన్ని వాడారు. పురుగు సోకి, పంటలో ఏ భాగం దెబ్బతిన్నదో గుర్తించారు.
కానీ వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం మరెన్నో విషయాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఇండియానాలోని పర్ద్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రూస్ ఎరిక్సన్ అన్నారు.
''ఫోటోలపై కనిపించే విషయాలను డబ్బులోకి మార్చడం చాలా కష్టమైన పని'' అని బ్రూస్ అన్నారు.
ఈ రైతులకు తమ పొలం, నేల, వాతావరణ పరిస్థితుల గురించి కొన్ని సంవత్సరాల అనుభవం ఉంటుంది. పెద్ద మొత్తంలో వ్యవసాయం చేస్తూ, డ్రోన్ల సాయంతో అధిక దిగుబడి సాధించడం అన్నది ఇంకా భవిష్యత్తులోని అంశమేనని ఆయన అన్నారు.
ఈ డ్రోన్ల ధరలు, ఇందులోని సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు.
''భవిష్యత్తులో ఈ విధానం వల్ల ఉపయోగం ఉండదు అనేవారు ఎవరూ ఉండరు'' అని బ్రూస్ అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)