You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంగ్లికన్ చర్చిలో అత్యాచారాలు.. ఆర్చ్ బిషప్ ఇంటి గేటుపై అండర్‌వేర్‌లు ఆరేసిన బాధితులు
- రచయిత, ఎస్తేర్ అకెలో ఒగోలా
- హోదా, ఉమెన్స్ అఫైర్స్ జర్నలిస్ట్, బీబీసీ ఆఫ్రికా
రెవరెండ్ జూన్ మేజర్... దక్షిణాఫ్రికాలో తన సాటి క్రైస్తవ మత గురువే తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ 18 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
తన కేసు, తనలాంటి మరికొందరు బాధితులకు సంబంధించిన కేసులపై దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చ్ దర్యాప్తు ప్రారంభించాలని కోరుతూ ఆమె నిరసనలూ చేపట్టారు.
దక్షిణాఫ్రికాలో మహిళా దినోత్సవమైన 2020 ఆగస్టు 9న రెవరెండ్ జూన్ మేజర్, మరికొందరు మహిళలు అసాధారణ రీతిలో నిరసన తెలిపారు.
దక్షిణాఫ్రికా ఆర్చ్ బిషప్ థాబో మగోబా ఇంటి చుట్టూ ఉన్న కంచెపై రెవరెండ్ జాన్ మేజర్, మిగతా మహిళలు, యాక్టివిస్ట్‌లు లోదుస్తులను ఆరవేశారు.
రెవరెండ్ మేజర్ ఆరోపిస్తున్న మత గురువు సహా ఇతర దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చ్ మత గురువుల లైంగిక దుష్ప్రవర్తన, వేధింపులపై ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ వారు నిరసన తెలుపుతున్నారు.
''నా పోరాటం చర్చికి వ్యతిరేకంగా కాదు. మహిళలను నోరెత్తనివ్వకుండా చేస్తున్న చర్చ్ పెద్దరికం, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మమ్మల్ని నోరెత్తొద్దని చెబుతున్నారు.. మా తప్పులను వెతుకుతున్నారు.. మాపై అకృత్యాలకు పాల్పడుతున్నవారిని మాత్రం ఆ దారుణాలు కొనసాగించుకునేలా వదిలేస్తున్నారు'' అని మీడియాతో చెప్పారు రెవరెండ్ మేజర్.
మత గురువుల లైంగిక వైధింపులపై చర్చ్ మౌనాన్ని వ్యతిరేకిస్తూ రెవరెండ్ మేజర్ నిరసన తెలపడం ఇదే మొదటిసారి కాదు.
'ఇక్కడే ప్రాణాలర్పిస్తా'
2016లో రెవరెండ్ మేజర్ తొలిసారి నిరాహార దీక్ష చేశారు. నాలుగేళ్ల తరువాత ఈ ఏడాది జులైలో మరోసారి ఆమె నిరాహార దీక్షకు దిగారు. ఈసారి ఆర్చ్ బిషప్ మగోబా అధికారిక నివాసం కేప్‌టౌన్‌లోని 20 బిషప్‌కోర్ట్ పక్కన నిరసన తెలిపారు.
''ఈ ఇంటిపక్కన పేవ్‌మెంటు మీద నేను చనిపోవాలనుకుంటున్నాను. నా కోసం కాదు.. న్యాయ నిరాకరణకు గురైన ప్రతి మహిళ, చిన్నారి కోసం నేను ప్రాణాలర్పించాలనుకుంటున్నాను'' అని 'బీబీసీ'తో చెప్పారామె.
రెవరెండ్ మేజర్ చెబుతున్న ప్రకారం.. 2002లో ఒక మత శిక్షణ సంస్థ(సెమినరీ)ను సందర్శంచేందుకు వెళ్లినప్పుడు ఆమెపై లైంగికదాడి జరిగింది.
సెమినరీలోని ఒక కుటుంబం వారికి ఆతిథ్యం ఇవ్వగా అక్కడ తాను ఉన్న గదిలోకి మత గురువు వచ్చి దాడిచేసినట్లు ఆరోపిస్తున్నారామె.
''నేను తప్పించుకోవడానికి చాలాసేపు పోరాడాను. చివరకు నా గొంతు పట్టుకున్నాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో నేను కేకలు వేయలేదు. అత్యాచారం చేసిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు''
''ఆ ఘటన తరువాత నేను భయంతో వణికిపోయాను. చచ్చిపోవాలనిపించింది. ఇంకో స్నేహితుడిని పిలిచి ఏం జరిగిందో చెప్పాను'' అన్నారామె.
తనపై అత్యాచారం చేసిన మత గురువు ఆ తరువాత కూడా ఇంకోసారి వచ్చాడని.. అయితే, గతంలో ఏం జరిగిందో తన స్నేహితుడికి చెప్పానని చెప్పడంతో వెళ్లిపోయాడని రెవరెండ్ మేజర్ చెప్పారు.
జీవితాన్ని భయం, నిశ్శబ్దం ఆవరించాయి
18 ఏళ్ల కిందట ఆ అత్యాచారం జరిగినప్పటి నుంచి తనను ఆ బాధ వీడలేదని రెవరెండ్ మేజర్ చెప్పారు.
''ఇది మన మధ్యే ఉండనీ అని ఒక ఫ్రెండ్ చెప్పడం.. మళ్లీ ఇంకెప్పుడూ అలా చేయనని తనపై అత్యాచారం చేసిన మత గురువు మాటివ్వడం.. ఆ తరువాత ఇద్దరం వేర్వేరు నగరాల్లో నివసించడంతో కొన్నాళ్లు నేను బయటపెట్టలేదు''
కానీ, అక్కడికి రెండేళ్ల తరువాత దీనిపై విచారణ చేపట్టాలని చర్చిని అడగాలని ఆమె నిర్ణయించుకున్నారు.
''ఈసారీ నన్ను నోరెత్తొద్దన్నారు.. చర్చి పరువుపోతుందనడంతో మళ్లీ ఆగాను. కానీ, నిత్యం పీడకలలు వస్తుండడం.. గదిలో ఒంటరిగా ఉండేందుకు ధైర్యం చాలకపోవడంతో విచారణ కోరాలని నిర్ణయించుకున్నాను'' అన్నారు.
తనలాంటి ఎంతోమంది బాధితులకు ధైర్యం కలగి, వారు కూడా ఫిర్యాదు చేయాలన్న ఆలోచనతో చివరకు విషయం బయటపెట్టాను.
తొలుత ఆమె పోలీసులను ఆశ్రయించి నేర విచారణ ప్రారంభించాలని కోరారు.. కానీ, పోలీసులు కేసు తీసుకోలేదు.
ఆ తరువాత చర్చిలో ఫిర్యాదుచేశారు.. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. దాంతో 2016లో ఆమె నిరాహార దీక్షకు దిగారు.. దీక్ష ఏడో రోజున , విచారణ చేస్తామని చర్చి చెప్పడంతో ఆమె దీక్ష విరమించారు. కానీ, చర్చి ఇంతవరకు మాట నిలుపుకోలేదని ఆమె ఆరోపించారు.
అయితే, దీనిపై పోలీసులనే దర్యాప్తు చేయమని కోరాలని ఆమెకు సూచించామని చర్చి చెబుతోంది.
చర్చి మాట తప్పడంతో మళ్లీ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు రెవరెండ్ మేజర్ చెప్పారు.
జీతం ఆపేశారు
''2016లో తొలిసారి నిరాహార దీక్ష చేసిన తరువాత మతగురువుగా నాకు ఇవ్వాల్సిన జీతం ఆపేశారు. దాంతో జీతం లేకుండా పనిచేయలేక ఆస్ట్రేలియాలో కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి రాజీనామా చేశాను. ఆస్ట్రేలియాలో మళ్లీ మత గురువుగా పనిచేయడానికి ఇక్కడి నుంచి సిఫారసు లేఖ కావాలి.. మొదట సిఫారసు లేఖ ఇస్తామన్నారు కానీ మళ్లీ మాట తప్పారు. దీంతో అప్పటి నుంచి నేను మళ్లీ మతగురువుగా పనిచేయలేకపోయాను'' అన్నారు రెవరెండ్ మేజర్.
దాంతో తన ఆదాయం పోగొట్టినందుకు చర్చిపై కోర్టుకెళ్లారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది.
''ఆర్చ్ బిషప్ లైంగిక హింసకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు కానీ, వాటికి బలైపోయిన నా విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు'' అన్నారామె.
మొదటిసారి ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తరువాత ఆర్చ్ బిషప్ మగోబాతో సమావేశమయ్యేందుకు ఆమెను పిలిచారు. ఆమె డిమాండ్లేమిటో ఈమెయిల్ చేయమని సూచించారు. ఆ తరువాత ఆమె దీక్ష విరమించారు.
''ఆర్చ్ బిషప్ స్పందించి క్రమశిక్షణా విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అత్యాచారం కేసును తిరిగి విచారణ జరపాలని ప్రాసిక్యూటర్‌ను కోరుతామని చెప్పారు. అందుకే నేను దీక్ష విరమించాను'' అన్నారామె.
విషయ తీవ్రతను అనుసరించి పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈమెయిల్ పంపించారు చర్చి పెద్దలు.
దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చి దీనిపై తన వెబ్‌సైట్‌లోనూ వివరాలు వెల్లడించింది. చర్చిలో సురక్షిత పరిస్థితులు ఏర్పరచడానికి 2018లో ఒక విధానం రూపొందించారు.
కానీ, తన కేసులో ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఆర్చ్ బిషప్ ఇంటి గేటు, కంచెపై రెవరెండ్ మేజర్, ఇతర ఉద్యమకారులు అండర్‌వేర్‌లు ఆరేశారు.
గతంలోనూ..
దక్షిణాఫ్రికా ఆంగ్లికన్ చర్చి మత గురువులపై గతంలోనూ ఇలాంటి లైంగిక వేధింపుల, అత్యాచారాల కేసులు ఉన్నాయి.
2018లో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ రచయిత ఇస్తియాక్ షుక్రీ ఒక బహిరంగ లేఖ రాశారు. తన చిన్నప్పుడు ఆంగ్లికన్ చర్చి మతగురువులు చేతిలో తాను ఎంతోకాలం లైంగిక వేధింపులకు గురయ్యానని ఆయన ఆరోపించారు.
దీనిపై ఆర్చ్ బిషప్ మగోబా ఆయనకు చర్చి తరఫున క్షమాపణలు చెప్పారు.
ఆ తరువాత మరికొందరు ఇలాగే ముందుకొచ్చి ఆరోపణలు చేశారు. ఆ కేసులనూ విచారిస్తున్నట్లు చర్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- బిహార్ ఎన్నికలు: కుల సమీకరణలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి? బలం ఎటువైపుంది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో భూకంప కేంద్రం, 9 నెలల్లో 1,545 సార్లు భూ ప్రకంపనలు
- అంతర్వేది ఆలయం: అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)