You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్ట్రేలియాలో చిన్నారులపై లైంగిక దాడులు: బాధితులకు క్షమాపణ చెప్తామన్న ప్రభుత్వం
లైంగిక దాడులకు గురైన చిన్నారి బాధితులకు దేశం తరఫున క్షమాపణ చెప్పనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలోని పలు సంస్థల్లో వేలాది మంది చిన్నారులు లైంగిక దాడులకు గురయ్యారని నాలుగేళ్ల పాటు కొనసాగిన దర్యాప్తు నిర్ధారించిన నేపథ్యంలో టర్న్‌బుల్ ఈ ప్రకటన చేశారు.
చర్చిలు, స్కూళ్లు, స్పోర్ట్స్ క్లబ్బుల్లో దశాబ్దాలుగా ఈ నేరాలు జరిగాయి.
ఈ ఏడాదిలోనే ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తామని టర్న్‌బుల్ పేర్కొన్నారు.
’’ఒక దేశంగా ఈ సందర్భాన్ని బాధితుల ఆకాంక్షలను ప్రతిఫలించేలా గుర్తించాలి. వారు చిన్నారులుగా ఉన్నపుడు వారికి దక్కాల్సిన గౌరవాన్ని.. వారి సంరక్షణ బాధ్యతలు చూడాల్సిన వారే ఉల్లంఘించారు.. ఆ గౌరవాన్ని తిరిగి అందించేలా ఈ సందర్భం ఉండాలి’’ అని ఆయన గురువారం పార్లమెంటులో పేర్కొన్నారు.
డిసెంబర్‌లో ముగిసిన రాయల్ కమిషన్ విచారణ.. 400 పైగా సిఫారసులు చేసింది. క్యాథలిక్ చర్చిలో బ్రహ్మచర్య నిబంధనలను పున:సమీక్షించాలన్నది అందులో ఒకటి.
‘‘ఇది ఏదో కొందరు ’అనైతిక మనుషుల’ ఉదంతం కాదు. సమాజంలోని ప్రధాన సంస్థలు దారుణంగా విఫలమయ్యాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
బాధితుల నుంచి లేఖలు
జాతీయ క్షమాపణలో ఏమేం చేర్చాలనే అంశం మీద తమ ప్రభుత్వం బాధితులను సంప్రదిస్తుందని టర్న్‌బుల్ చెప్పారు.
బాధితుల కోసం జాతీయ పరిహార పథకంలో భాగమవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘ఈ తరుణంలో బాధితుల పట్ల మనం నిర్లక్ష్యం వహించకుండా ఉండాల్సిన బాధ్యత మనకుంది’’ అని పేర్కొన్నారు.
ఈ పథకానికి 300 కోట్ల ఆస్ట్రేలియా డాలర్ల (సుమారు 15,000 కోట్ల రూపాయలు) నిధులను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. దీనికింద బాధితులు ఒక్కొక్కరికి 1,50,000 ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. 75 లక్షలు) చొప్పున చెల్లిస్తారు.
విచారణలో 8,000 మందికి పైగా బాధితుల వాంగ్మూలాలను ఆలకించారు. అయితే వాస్తవ బాధితుల సంఖ్య ఎన్నటికీ తెలియకపోవచ్చునని విచారణ కమిషన్ పేర్కొంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)