You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'లైంగిక దాడుల బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారనే' కథనంపై స్పందించిన భారత క్యాథలిక్ చర్చి
బీబీసీ రిపోర్ట్ చేసిన లైంగిక అకృత్యాల ఆరోపణల విషయంలో తాను వ్యవహరించిన తీరును భారత క్యాథలిక్ చర్చి సమర్థించుకుంది.
"కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్: లైంగిక దాడుల బాధితులను ఆదుకోని భారత క్రైస్తవ మత గురువు" అనే కథనాన్ని బీబీసీ గత గురువారం ప్రచురించింది.
ఆ కథనంలో బీబీసీ రెండు అంశాలను ప్రస్తావించింది. ఒకటి, కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్ తన దృష్టికి వచ్చిన లైంగిక దాడుల ఆరోపణల విషయంలో తగురీతిలో స్పందించడంలో విఫలమైనట్లు ఒప్పుకున్నారు. రెండోది, ముంబయ్ ఆర్చిబిషప్ అయిన కార్డినల్ గ్రేసియస్ కాబోయే పోప్ అని చెబుతున్నారని.
లైంగిక దాడులు జరిగాయనే ఆరోపణలను దృష్టికి తెచ్చినప్పుడు కార్డినల్ గ్రేసియస్ వాటిని తీవ్రంగా పరిగణించలేదని బాధితులు, వారి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
ముంబయ్ ఆర్చిడియోసెస్ బీబీసీకి ఒక ప్రకటన పంపించారు. 2015లో ఒక బాలుడు ముంబయ్ లోని పారిష్ ప్రీస్ట్ తన మీద అత్యాచారం చేశారని ఆరోపించినప్పుడు, కార్డినల్ వారి కోరిక మేరకు ఆ బాలుడిని, అతడి కుటుంబ సభ్యులను కలిశారని ఆ ప్రకటనలో తెలిపారు.
"ఆ తల్లితండ్రులను కార్డినల్ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆరోజు రాత్రే కార్డినల్ రోమ్‌కు బయలుదేరాల్సి ఉండింది. ఫిర్యాదుదారులు వెళ్ళిపోయిన తరువాత కార్డినల్, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న మతగురువుకు ఫోన్ చేసి ఆయన మీద వచ్చిన ఆరోపణల గురించి చెప్పారు."
ఆ మతగురువు ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. అయినప్పటికీ, "కార్డినల్ ఆయనను తక్షణమే ఆ స్థానం నుంచి తొలగించారు. అంతేకాదు, ఆ మరునాటి ఉదయం ప్రార్థనలో పాల్గొనేందుకు కూడా ఆయనను అనుమతించలేదు" అని ఆ ప్రకటనలో వెల్లడించారు.
ఆ తరువాత కార్డినల్, "ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉండాలని, దీని మీద విచారణ చేయాలని" బిషప్‌కు చెప్పారు. ఆ తరువాతే ఆయన రోమ్‌కు పయనమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రోమ్ నగరానికి చేరుకున్న తరువాత కూడా బిషప్‌కు కార్డినల్ ఫోన్ చేశారు. ఆ కుటుంబ సభ్యులు తమకు తాముగా పోలీసులకు సమాచారం తెలియజేశారని బిషప్ ఆయనకు చెప్పారు.
ఈ వారం వాటికన్‌లో బాలలపై అకృత్యాలను రూపుమాపడం కోసం ఉద్దేశించిన భారీ సదస్సును నిర్వహించిన నలుగురిలో కార్డినల్ గ్రేసియస్ ఒకరు.
చర్చిలోనే లైంగిక అకృత్యాలు జరిగినట్లు ఆరోపణలు రావడమన్నది ఆధునిక కాలంలో వాటికన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం. ఈ సదస్సులో వెలుగు చూసే ఫలితాల మీదే క్యాథలిక్ చర్చి ప్రతిష్ఠ కూడా ఆధారపడిందని చెప్పవచ్చు.
గత ఏడాదిలో, ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చిలు చాలా వాటిల్లో ఈ రకమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగు చూశాయి.
లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు ఉత్తర, దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో పతాక శీర్షికలుగా మారాయి. కానీ, ఆసియా దేశాలలో ఇవి చాలా వరకు అంతగా వెలుగులోకి రాలేదు. ముఖ్యంగా, భారత్ వంటి దేశాల్లో ఇలాంటి వాటి గురించి మాట్లాడడమే ఒక సాంఘిక అపరాధమనే భావన కొనసాగుతోంది.
క్యాథలిక్ చర్చిలలో మతగురువులు లైంగిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలపై భారతదేశంలో మౌనం, భయం రాజ్యమేలుతున్నాయని భారత క్యాథలిక్కులు చెబుతున్నారు. ఇక్కడ అలాంటి విషయాలు మాట్లాడితే చాలా కష్టాలు ఎదుర్కోక తప్పదనే భయాలున్నాయి.
ఇవి కూడా చదవండి.
- కాంగ్రెస్ భరోసా సభ: ‘ఏపీ ప్రత్యేక హోదాను ఏ శక్తి అడ్డుకోలేదు’ -రాహుల్‌గాంధీ
- క్యాథలిక్ చర్చిల్లో మతాచార్యుల ఆధిపత్యం: ‘వాళ్లు చెప్పినదానిని గొర్రెల్లా అనుసరించాలి.. అంతే’
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- ఆమె చిన్న పిల్ల కాదు.. అన్ని రోజులు వేధిస్తుంటే చూస్తూ ఎలా ఉంటారు? నన్ను కావాలనే ఇరికిస్తున్నారు : బిషప్ ఫ్రాంకో
- నన్ రేప్ కేసు: కేరళలో చర్చిలపై విశ్వాసం తగ్గుతోందా?
- చర్చిలో లైంగిక వేధింపులు: కన్ఫెషన్స్పై ప్రశ్నలు
- #WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)