కరోనావైరస్: ఇన్‌హేల్డ్ వ్యాక్సీన్ పరీక్షలను ప్రారంభించనున్న బ్రిటన్

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

ఇన్‌హేల్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్లు - అంటే నోటి ద్వారా పీల్చుకునే కరోనావైరస్ వ్యాక్సీన్ల ప్రయోగాత్మక పరీక్షలను బ్రిటన్ పరిశోధకులు ప్రారంభించనున్నారు.

సంప్రదాయ ఇంజక్షన్ టీకాల కన్నా వ్యాక్సీన్‌ను నేరుగా ఊపిరితిత్తులకు అందించటం వల్ల మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందన లభించవచ్చునని వారు చెబుతున్నారు.

ఇందుకోసం.. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న వ్యాక్సీన్లలో ముందు వరుసలో ఉన్న రెండు వ్యాక్సీన్లను ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధక బృందం ఉపయోగించుకుంటుంది.

అందులో ఒకటి ఇటీవల మనుషులపై పరీక్షలను ఆపివేసిన ఆక్స్‌ఫర్డ్ టీకా. రెండోది.. ఇంపీరియల్ కాలేజీ తయారు చేసిన వ్యాక్సీన్. దీనిని కూడా జూన్‌లో మనుషుల మీద పరీక్షించటం మొదలుపెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 180 వ్యాక్సీన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. వాటిలో ఏదీ కూడా ఇప్పటవరకూ తుది లక్ష్యాన్ని చేరుకోలేదు.

ఇన్‌హేల్డ్ వ్యాక్సీన్ ప్రయోగాత్మక పరీక్షల్లో భాగంగా.. దాదాపు 30 మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లకు ఈ వ్యాక్సీన్లను - ఆస్తమా మందులను నెబ్యులైజర్‌ మెషీన్‌తో అందించిన విధంగానే అందిస్తారు. ఇందుకోసం మాస్కును లేదా మౌత్‌పీస్‌ ఉపయోగిస్తారు.

సీజనల్ ఫ్లూ వ్యాక్సీన్‌ను కూడా ఇంజక్షన్ లాగా కాకుండా నాసల్ స్ప్రే రూపంలోనూ ఇవ్వవచ్చు.

శ్వాసకోశ వైరస్ కారణంగా వ్యాపించిన ప్రస్తుత మహమ్మారి.. ప్రాధమికంగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల గోడల్లోని కణాలకు సోకుతుందని.. పరిశోధనకు సారథ్యం వహిస్తున్న డాక్టర్ క్రిస్ చియూ చెప్పారు.

''ఈ ఉపరితలాలు ప్రత్యేకమైనవి. మిగతా శరీరానికి భిన్నమైన రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కండరాలకు ఇంజెక్ట్ చేసే వ్యాక్సీన్ కన్నా.. ఈ శ్వాసమార్గాలను నేరుగా లక్ష్యం చేసుకోవటం వల్ల సమర్థవంతమైన ప్రతిస్పందన లభిస్తుందా అనేది పరిశీలించటం కీలకం'' అని ఆయన వివరించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

ఇంపీరియల్ వ్యాక్సీన్ పరిశోధనకు సారథ్యం వహిస్తున్న ప్రొఫెసర్ రాబిన్ షాటాక్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు బృందాలు కోవిడ్-19 వ్యాక్సీన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని ప్రస్తావించారు.

ఈ వ్యాక్సీన్లు వైరస్‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేయగలవా అనేది ఈ పరీక్షల్లో వెల్లడవుతుందన్నారు.

''అయితే.. ఈ వైరస్ ప్రాథమికంగా దాడి చేసే ముక్కు, గొంతు, శ్వాస మార్గాల్లో స్థానిక ప్రతిస్పందన గురించి ఈ ట్రయల్స్ ద్వారా మనకు ఏమీ తెలియదు'' అని ఆయన పేర్కొన్నారు.

''ఒక బృందం సరైన వ్యాక్సీన్ తయారు చేసినా.. దానిని శరీరానికి అందించే పద్ధతి తప్పయ్యే అవకాశం కూడా ఉండొచ్చు'' అని వ్యాఖ్యానించారు.

''ఇటువంటి ఇన్హేల్డ్ వ్యాక్సీన్ పరీక్షల ద్వారానే మనకు ఆ విషయం తెలిసే అవకాశం ఉంటుంది'' అని వివరించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)