కరోనావైరస్-ఉత్తర కొరియా: పసుపు సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన వ్యక్తే కరోనాను వెంట తెచ్చాడా?

ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ రోగిగా అనుమానిస్తున్న వ్యక్తికి ఆ ఇన్ఫెక్షన్ లేదని దక్షిణ కొరియా అంటోంది.

ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు గత వారమే పారిపోయినట్లు భావిస్తున్నారు.

నిజానికి ఆయనది ఉత్తర కొరియానే.

మూడేళ్ల క్రితం అక్కడి నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చారు.

మళ్లీ వారం క్రితం స్వదేశానికి పారిపోయారు.

దక్షిణ కొరియాలోని గాంగ్వా ద్వీపం నుంచి ఈదుకుంటూ స్వదేశానికి ఆయన పారిపోయినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.

ఎలా చేరుకున్నారు?

సరిహద్దుకు సమీపంలోని గాంగ్వా ద్వీపానికి మొదట ఆ వ్యక్తి చేరుకున్నారని దక్షిణ కొరియా సైన్యం సోమవారం వెల్లడించింది.

గాంగ్వా ద్వీపం నుంచి యెల్లో సీ వరకు వెళ్లే ఓ డ్రైనేజీ పైపు ఉంది.

అందులో తీగల కంచె ఉన్నా, దాని కింద నుంచి ఆ వ్యక్తి పాక్కుంటూ వెళ్లినట్లు భావిస్తున్నారు.

ఆ తర్వాత యెల్లో సీలో ఓ మైలు దూరం ఈదుకుంటూ ఉత్తర కొరియాకు ఆయన చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు.

‘‘ఆ వ్యక్తి ఎక్కడి నుంచి పారిపోయాడో, ఆ ప్రాంతాన్ని మేం గుర్తించాం. అక్కడ ఓ బ్యాగు దొరికింది. అది ఆ వ్యక్తిదే అయ్యుండొచ్చని అనుమానిస్తున్నాం’’ అని కల్నల్ కిమ్ జన్ రక్ వెల్లడించినట్లు యోన్హాప్ వార్తా సంస్థ తెలిపింది.

దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఆ వ్యక్తి, మూడేళ్ల క్రితం తమ దేశం నుంచి పారిపోయే అక్కడకు వెళ్లారని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కూడా అంగీకరించింది.

ఆ వ్యక్తికి కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయని ఉత్తర కొరియా వార్తా ఏజెన్సీ కేసీఎన్ఏ ఇటీవల ప్రకటించింది.

జులై 19న అక్రమంగా సరిహద్దు దాటి, ఆ వ్యక్తి కేసాంగ్ నగరానికి చేరుకున్నట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించడానికి గరిష్ట స్థాయిలో అత్యవసర వ్యవస్థ ఏర్పాటు చేయాలని కిమ్ శనివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

దక్షిణ కొరియా ఏమందంటే?

‘‘ఆ వ్యక్తి కోవిడ్-19 రోగిగా నమోదు కాలేదు. కోవిడ్ రోగులను కలిసిన వ్యక్తిగా కూడా నమోదు కాలేదు’’ అని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి వెల్లడించినట్లు యోన్హాప్ వార్తాసంస్థ పేర్కొంది.

దక్షిణ కొరియాలో ఆ వ్యక్తికి సన్నిహితంగా మెదిలిన ఇద్దరు వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారికి ఫలితం నెగటివ్ వచ్చింది.

చైనా తర్వాత మొదటగా కోవిడ్ కేసులు వచ్చిన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అయితే, అక్కడ వైరస్ వ్యాప్తి చాలా వరకూ నియంత్రణలోకి వచ్చింది.

ఐదు కోట్ల జనాభా ఉన్న ఆ దేశంలో రోజుకు సగటున 50 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. వారిలో చాలా వరకూ వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారే ఉంటున్నారు. ప్రభుత్వం వారిని క్వారంటైన్‌లో పెడుతోంది.

ఉత్తర కొరియాలో కోవిడ్-19 కేసు ఇంతవరకూ నమోదు కాలేదు. నమోదయ్యే అవకాశాలు కూడా తక్కువని విశ్లేషకులు అంటున్నారు.

ఉత్తర కొరియాకు తిరిగి కూడా వెళ్తారా?

ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు చేరుకున్నవారు మళ్లీ ఆ దేశానికి వెళ్లడం చాలా అరుదు.

రికార్డుల ప్రకారం ఇదివరకు ఇలా 11 మంది వెళ్లారని, చివరగా 2017లో అలా జరిగిందని దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రిత్వశాఖ బీబీసీకి తెలిపింది.

గాంగ్వా నుంచి తాజాగా ఆ వ్యక్తి వెళ్లింది నిజమని నిర్ధారణైతే, ఈ జాబితాలో ఆయన 12వ వ్యక్తి అవుతారు.

విశ్లేషణ

- సబిన్ కిమ్, బీబీసీ న్యూస్, సియోల్

ఉత్తర కొరియాకు తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనావైరస్ లక్షణాలున్నట్లు మాత్రమే అనుమానిస్తున్నారు.

కానీ, ఉత్తర కొరియా కావాలనే దీన్ని బయటి ప్రపంచానికి పెద్దది చేసే చూపేందుకు ప్రయత్నిస్తోంది.

మహమ్మారి వ్యాపించకుండా తాము తీసుకుంటున్న చర్యలకు దక్షిణ కొరియా విఘాతం కలిగిస్తోందని నిందించడం దీని ఉద్దేశం కావొచ్చు.

కేసాంగ్ చేరుకున్న ఆ వ్యక్తికి నిజంగా కోవిడ్-19 ఉందని నిర్ధరణైతే కాలేదు.

దక్షిణ కొరియా అధికారులు దీన్ని తోసిపుచ్చారు.

ఉత్తర కొరియాకు పరీక్షించే సామర్థ్యం కూడా లేదు.

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిపుణులు అంటున్నారు.

చైనాతో సరిహద్దు వాణిజ్యం మార్గం మూసేయడం సహా వైరస్ నివారణకు ఉత్తర కొరియా తీసుకున్న కఠిన చర్యలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తున్నట్లు అర్థమవుతోంది.

దక్షిణ కొరియా నుంచి ఔషధాలు, ఆహారాన్ని సాయంగా పంపమని డిమాండ్ చేసేందుకు ఉత్తర కొరియా ఈ వ్యవహారాన్ని ఓ సాకుగా వాడుకోవచ్చు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)