క‌రోనావైర‌స్: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ అభివృద్ధిలో ముంద‌డుగు, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను పోరాటానికి సిద్ధం చేస్తున్న‌ టీకా

    • రచయిత, జేమ్స్ గళ్లఘెర్
    • హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి

బ్రిట‌న్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ త‌యారుచేసిన వ్యాక్సీన్‌.. వైర‌స్‌పై పోరాడేలా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇది సుర‌క్షిత‌మ‌ని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాక్సీన్ 1077 మందికి ఎక్కించారు. వారిలో యాంటీబాడీలు, తెల్ల‌ర‌క్త క‌ణాలకు.. క‌రోనావైర‌స్‌తో పోరాడే సామ‌ర్థ్యం వ‌చ్చిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

ఈ ఫ‌లితాలు ప్ర‌పంచ దేశాల్లో ఆశ‌లు నింపుతున్నాయి. అయితే త‌గిన ర‌క్ష‌ణ క‌ల్పించ‌గ‌ల‌వా? అని పూర్తిగా తెలుసుకునేందుకు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంది.

ఇప్ప‌టికే ఇలాంటి 100 మిలియ‌న్ డోసుల వ్యాక్సీన్ త‌యారుచేయాల‌ని బ్రిట‌న్ ఆదేశించింది.

ఈ వ్యాక్సీన్ ఎలా ప‌ని చేస్తుంది?

సీహెచ్ఏడీఓఎక్స్‌1 ఎన్‌సీవోవీ-19గా పిలుస్తున్న వ్యాక్సీన్‌ను మెరుపు వేగంతో అభివృద్ధి చేశారు.

చింపాంజీల్లో జలుబుకు కార‌ణ‌మ‌య్యే వైర‌స్‌లో జ‌న్యు మార్పులుచేసి దీన్ని త‌యారుచేశారు.

ఈ వైర‌స్‌లో చాలా మార్పులు చేశారు. అందుకే ఇది మ‌నుషుల్లో ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్‌కూ కార‌ణం కాదు. అదే స‌మ‌యంలో ఇది క‌రోనావైర‌స్‌లా క‌నిపిస్తుంది.

క‌రోనావైర‌స్‌తో మ‌న శ‌రీరంలోని క‌ణాల‌పై దాడిచేసేందుకు ఉప‌యోగించే ప్రోటీన్‌(స్పైక్ ప్రోటీన్‌)కి సంబంధించిన‌ జ‌న్యుప‌ర‌మైన సంకేతాల‌ను ఈ వైర‌స్‌లోకి చొప్పించారు.

అంటే ఈ వ్యాక్సీన్ కరోనావైర‌స్‌కు డ‌మ్మీ లాంటిది. ఇది క‌రోనావైర‌స్‌తో ఎలా పోరాడాలో మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు నేర్పిస్తుంది.

యాంటీబాడీలు, టీ-క‌ణాలు అంటే?

క‌రోనావైర‌స్‌పై జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో చాలావ‌ర‌కు యాంటీబాడీల‌పైనే దృష్టి కేంద్రీక‌రించారు. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌లో ఇవి ఒక భాగం మాత్ర‌మే.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ త‌యారుచేసే చిన్న ప్రోటీన్లే యాంటీబాడీలు. ఇవి వైర‌స్ ఉప‌రితలంపై అతుక్కుంటాయి.

ఈ యాంటీబాడీల‌కు వైర‌స్‌ల‌ను హ‌త‌మార్చే సామ‌ర్థ్యం ఉంటుంది.

టీ-క‌ణాలు.. ఒక ర‌క‌మైన తెల్ల‌ర‌క్త‌క‌ణాలు. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స‌మ‌న్వ‌యంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. శ‌రీరంలో ఏ క‌ణం ఇన్ఫెక్ష‌న్‌కు గురైందో గుర్తించ‌డం, దాన్ని నాశ‌నం చేయ‌డంలో ఇవి పాలుపంచుకుంటాయి.

దాదాపు అన్ని శ‌క్తిమంత‌మైన వ్యాక్సీన్లూ.. యాంటీబాడీలు, టీ-క‌ణాల‌ను క్రియాశీలం చేస్తాయి.

వ్యాక్సీన్ వేసుకున్న 14 రోజుల త‌ర్వాత టీ-క‌ణాల స్థాయిలు ప‌తాక స్థాయికి చేరుకుంటాయి. యాంటీబాడీలు 28 రోజుల త‌ర్వాత ఈ స్థాయికి వెళ్తాయి. అయితే ఈ వ్యాక్సీన్‌తో దీర్ఘ‌కాలంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుందో అంచ‌నావేసే స్థాయిలో ఈ అధ్య‌య‌నం జ‌ర‌గ‌లేదు.

ఇది సుర‌క్షిత‌మేనా?

అవును, అయితే కొన్ని దుష్ప్ర‌భావాలు ఉంటాయి.

అయితే ఈ దుష్ప్ర‌భావాలు అంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి కాదు. ఈ వ్యాక్సీన్ తీసుకున్న 70 శాతం మందిలో జ్వ‌రం, త‌ల‌నొప్పి లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.

ఇవి పారాసెట‌మాల్‌తో త‌గ్గిపోతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

కోవిడ్‌-19పై పోరాటంలో ఈ వ్యాక్సీన్‌ సాయం చేస్తుంద‌ని ధ్రువీక‌రించేందుకు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే తాజా ఫ‌లితాలు చాలా ఆశాజ‌న‌కంగా ఉన్నాయి అని యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ సారా గిల్‌బ‌ర్ట్ వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)