కరోనావైరస్: బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో ఏది సురక్షితం

    • రచయిత, రేచల్ శ్రేయర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాక్‌డౌన్‌ సడలింపుతోపాటు రైళ్లు, బస్సులు, విమానాలవంటి ప్రజారవాణా సౌకర్యాలను ఉపయోగించుకునేటప్పుడు కరోనావైరస్ బారినపడే ప్రమాదం గురించి అంతా ఆందోళన చెందుతున్నారు.

ప్రయాణించే సమయంలో వ్యాధివ్యాప్తి ప్రమాదం ఎంత అనే దానిపై నిర్దిష్ట పరిశోధనలు లేవు. కానీ కరోనా వ్యాపిస్తున్న తీరును గమనించాక, దీన్ని మనం అంచనా వేయవచ్చు.

రైళ్లు, బస్సులు ఎంత సురక్షితం?

వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, వైరస్‌ గాలిలోకి వెళ్లి అది ఇతరుల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కళ్ళు, ముక్కు, నోటి ద్వారా నేరుగా, లేదంటే చేతికి అంటుకున్న కణాలు ముఖం మీద చేతులు పెట్టుకున్నప్పుడు లోపలికి ప్రవేశించవచ్చు.

గాలి బయటికి వెళ్లకుండా ఉండే ప్రదేశాలలో ఈ వ్యాధి సంక్రమణకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిటికి తెరవడానికి వీలున్న ప్రజారవాణా సౌకర్యాలలో ప్రయాణం కొంత వరకు సురక్షితం.

రైళ్లు, బస్సుల ద్వారా వచ్చే ప్రమాదం ఎంత అన్నది ఆయా బస్సులు, రైళ్లు, స్టేషన్లలో ఉండే రద్దీ మీద ఆధారపడి ఉంటుంది.

ఇంతకు ముందున్న ఆంక్షలను వదిలేసి, ఎవరైనా ప్రజా రవాణా సదుపాయాలను వాడుకోవచ్చని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. అక్కడ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇల్లు దాటారంటే ప్రతి ఒక్కరు ఒక మీటరు దూరం నిబంధన పాటించాలి.

మూసి వేసినట్లుండే ప్రజా రవాణా వ్యవస్థల్లో ఉపరితలంపై వైరస్‌ ఉండిపోతుంది. అయితే ఇది వ్యాప్తికి ఎంత వరకు కారణమవుతుందో కచ్చితంగా తెలియదు.

రైలు ప్రయాణంలో ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు, పరిశోధనలు జరిగాయి. కాని సరైన సమాధానం దొరకలేదు. లండన్‌లోని భూగర్భ రవాణా సాధనాల వల్ల శ్వాసకోశ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని గతంలో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.

లండన్‌ భూగర్భ రవాణా సాధానలలో ప్రయాణించేవారిలో ఫ్లూ లక్షణాలు కలిగే అవకాశం ఉందని 2018లో ప్రచురించిన ఒక పరిశోధనలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ సంస్థకు చెందిన డాక్టర్‌ లారా గోస్కే వెల్లడించారు.

మనుషులకు దూరంగా ఉండటం, మాస్కులు ధరించడం, ఉపరితలాలను చేతులతో తాకకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ తాకినా వెంటనే చేతులు కడుక్కుంటే వ్యాధిబారిన పడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

ప్రయాణికులు ఏం చేయాలి?

ప్రయాణాలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం తమ దేశ ప్రజలకు ఇచ్చిన సలహాలు ఇతర దేశాలకు కూడా మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. ప్రజారవాణాను ఉపయోగించే ముందు ప్రజలు మిగతా అన్ని ఆప్షన్లను పరిశీలించాలని అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాలి నడకన, సైకిల్‌ మీద వెళ్లలేని వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

  • రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణాలు మానుకోవడం మంచిది.
  • తక్కువ బిజీగా ఉన్న మార్గాన్ని ఎంచుకోవాలి. తరచు వాహనాన్ని మార్చకుండా చూసుకోవాలి.
  • వాహనం ఎక్కే ముందు అందులోని వారు పూర్తిగా దిగే వరకు వేచి ఉండాలి.
  • ఇతరుల నుంచి కనీసం ఒక మీటర్ దూరంలో ఉండాలి.
  • ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తరువాత కనీసం 20 సెకన్లపాటు చేతులను సబ్బుతో కడుక్కోవాలి.

ఇది కాకుండా మాస్కు ధరించడం తప్పనిసరి.

విమానంలో ఎంత ప్రమాదం?

విమానంలో గాలి బిగించినట్లు ఉంటుంది కాబట్టి అనారోగ్యంపాలు కావడానికి అవకాశం ఎక్కువ అని చాలామంది నమ్మకం. కానీ ఒక ఆఫీసులోకంటే నాణ్యమైన గాలిని విమానంలో పొందవచ్చు. రైలు, బస్సులతో పోల్చితే అక్కడ ఖచ్చితంగా శుభ్రమైన గాలి లభిస్తుంది.

ఒక విమానంలో ప్రతి రెండు-మూడు నిమిషాలకు గాలి మారుతుందని ఇండియానాలోని పెర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్వింగ్యాన్ చెన్ అంచనా వేశారు. అదే ఒక ఎయిర్ కండిషన్డ్ భవనంలో దీనికి 10 నుండి 12 నిమిషాలు పడుతుంది.

చాలా విమానాలలో 'హెపా' అని పిలిచే అధిక నాణ్యత గల ఎయిర్ ఫిల్టర్ వ్యవస్థ ఉంటుంది.

ఇది సాధారణ ఎయిర్ కండీషనర్‌ పీల్చే కణాలకంటే చిన్నకణాలను కూడా పీల్చగలదు. వీటిలో వైరస్‌ కణాలు కూడా ఉండవచ్చు.

అంతేకాదు ఇది బయట నుండి తాజా గాలిని క్యాబిన్‌లోకి పంపడంలో కూడ సహాయ పడుతుంది. అయితే చాలా ఎయిర్ కండిషనర్లు శక్తిని ఆదా చేయడానికి గదిలోని గాలినే మళ్లీ మళ్లీ తిప్పుతుంటాయి.

విమానంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఇతర ప్రయాణికుల నుంచి దూరంగా ఉండటం కష్టం. ఇది వ్యాధివ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుంది.

ప్రయాణానికి ఏ వాహనం మంచిది, ఏది ప్రమాదకరం అని తేల్చడం కష్టం. ఎందుకంటే ఇందులో వివిధ అంశాలు ఇమిడి ఉంటాయి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)