ప్లాస్మా థెరపీ: బ్లాక్ మార్కెట్‌లో ప్లాస్మా విక్రయం.. ఒక్కో యూనిట్‌ కోసం రూ. 25,000 పైనే చెల్లిస్తున్న కరోనావైరస్ రోగులు

    • రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్పత్రులకు, బ్లడ్ బాంకులకు, బంధువులకు వరసగా ఫోన్లు చేసిన వైభవ్, ఆయన భార్యకు వేళ్లు నొప్పులు పుడుతున్నాయి. నిద్ర లేక కళ్లు మూతలు పడుతున్నాయి. అలసటగా ఉంది. అయినా, ఆ ఇంటి పెద్ద వికాస్ చంద్ అగ్రవాల్ కోసం ఏబీ పాజిటివ్ గ్రూప్ ప్లాస్మా సంపాదించాలని మూడు రోజులుగా వాళ్లు చేసిన ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది.

ఆగ్రాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న 62 ఏళ్ల వికాస్ చంద్ర అగ్రవాల్ ఆరోగ్యం అంతకంతకూ దిగజారుతుంటే, ఆయన కొడుకు వైభవ్‌లో ప్లాస్మా దొరకలేదనే ఆందోళన తీవ్రంగా పెరిగిపోతోంది. ప్లాస్మా కోసం ఆయన దేనికైనా సిద్ధంగా ఉన్నారు.

ప్లాస్మా కోసం ఇంత ఇబ్బంది పడుతోంది వైభవ్ ఒక్కరే కారు. గురువారం ప్లాస్మా కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న ఇద్దరు మాకు ఫోన్ చేసారు. ప్లాస్మా మాచ్ ఫిక్సింగ్ అంటే డోనర్-రిసీవర్‌ను కలిపే సంస్థ ‘ఢూండ్’ వెబ్‌సైట్‌లో రోజూ పదుల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్నారు.

కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తుల నుంచి తీసిన ప్లాస్మాను కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు చాలాసార్లు గమనించారు.

“మా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న వారిలో రిసీవర్స్ అంటే ప్లాస్మా అవసరమైన వారి సంఖ్య, డోనర్స్ కంటే ఎక్కువగా ఉంది” అని లండన్‌లో ఉంటున్న సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్, ‘డూండ్’ పార్టనర్ ముకుల్ పాహ్వా చెప్పారు.

ఎప్పటిలాగే ప్లాస్మాకు అయ్యే మొత్తం ఖర్చును అవసరమైనవారి నుంచి వసూలు చేస్తున్నారు. ఒక యూనిట్ (525 ఎంఎల్) ప్లాస్మాకు 25 వేల నుంచి 30 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ లావాదేవీలకు డార్క్-వెబ్ సాయం కూడా తీసుకోవడంపై కూడా చర్చ జరుగుతోంది.

కొందరు ప్లాస్మా డోనర్లకు డబ్బు ఇవ్వడంతో పాటు, వారు వచ్చిపోయేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కొన్ని వార్తా పత్రికలు రాశాయి. ఇంత చేస్తున్నా ప్లాస్మా దొరకడం ఇప్పటికీ చాలా కష్టంగా ఉంది.

కొంతమంది ప్లాస్మా పేరుతో మోసం చేస్తున్నారని, చాలా మంది దగ్గర దానికోసం ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కొన్ని రోజుల క్రితం ప్రజలను అప్రమత్తం చేశారు.

“ప్లాస్మా థెరపీ కోవిడ్-19కు చికిత్స కాదు. కానీ, దానివల్ల రోగుల పరిస్థితి కొంత మెరుగుపడుతోంది. అందుకే దాని డిమాండ్ పెరిగింది” అని ఆయన మీడియాతో అన్నారు.

“ప్లాస్మా డోనర్లకు ఐదు వేల రూపాయల ప్రోత్సాహక మొత్తం ఇస్తాం” అని కర్ణాటక వైద్యవిద్యా మంత్రి కొన్ని రోజుల క్రితం తన డైలీ ప్రెస్ బ్రీఫింగ్‌లో ప్రకటించడానికి కూడా ఇదే కారణం.

ప్లాస్మా కొరత ఎందుకు ఉంది?

రక్తం, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా లాంటి వాటికి సంబంధించిన అంశాలను ‘నేషనల్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ కౌన్సిల్’ పర్యవేక్షిస్తుంది. దాని ప్రకారం ప్లాజ్మా కోసం ఒక యూనిట్‌కు 400 రూపాయలు తీసుకోవచ్చు.

“ప్లాస్మా కొరతకు ఒక పెద్ద కారణం పాథాలజీ లాబ్స్, కలెక్షన్-ప్రిజర్వేషన్ లాంటి సౌకర్యాల లోటు భారీగా ఉండడమే. రక్తం, శరీర అవయవాలు లాంటివి దానం చేయడం గురించి ప్రజల్లో అవగాహనా లోపం, భ్రమలు కూడా ఉన్నాయి” అని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్, కమ్యూనిటీ మెడిసిన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నఫీజ్ ఫైజీ అన్నారు.

“ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి ప్రభుత్వాన్ని దోషిగా చూడలేం. ప్లాస్మా దానం చేయవచ్చు. కానీ, నాకు మళ్లీ కరోనా వస్తే ఏమవుతుందో అనే భయం వారిలో ఉంటుంది” అని ఆరోగ్య కార్యకర్తల స్వచ్ఛంద సంస్థ, ప్రజారోగ్య ప్రచారానికి సంబంధించిన డాక్టర్ గార్గేయ తెల్కపల్లి తెలిపారు.

అయితే ప్లాస్మా థెరపీ గురించి ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి వెల్లడైన ఫలితాలనే ఫైనల్ అని భావించలేం. కానీ, కోవిడ్-19 వైరస్ వల్ల మన శరీరంలో వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తి (యాంటీ బాడీస్) మూడు నెలల్లో అంతం అవుతుందని కొన్ని ప్రముఖ విదేశీ వార్తా పత్రికలు రాశాయి.

చాలా ప్రాంతాల్లో కోవిడ్-19 బాధితులు కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ ప్లాస్మా థెరపీలో కరోనా వచ్చి కోలుకున్న సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను కోవిడ్-19కు గురైన మరో రోగి శరీరంలోకి ఎక్కించవచ్చు. ఈ చికిత్సా పద్ధతిని ‘కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ’ అంటారు.

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి తీసుకున్న ప్లాస్మా వల్ల మరో రోగి రక్తంలో ఉన్న వైరస్‌ను అంతం చేయవచ్చు అనే ఆలోచన ఆధారంగా ఈ థెరపీని ఉపయోగిస్తున్నారు.

కోవిడ్-19కు ముందు సార్స్, మెర్స్, హెచ్1ఎన్1 లాంటి మహమ్మారిలకు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించారు.

ప్రయోగశాలలు, బ్లడ్ బ్యాంకులు, అవసరమైన మందులు అందుబాటులో ఉంటుంటే, అన్ని పెద్ద ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్సపై దృష్టి పెట్టి ఉంటే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవి కావని ఆరోగ్య రంగంలోని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.

వేగంగా పెరుగుతున్న ప్లాస్మా డిమాండ్

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మెడికల్ కాలేజీలోనే ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని సౌకర్యాలూ అందుబాటులో లేవు. ముందు ముందు వాటిని ప్రారంభించనున్నారు.

కొన్ని రిపోర్టుల ప్రకారం బనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఈ చికత్సను గతవారమే ప్రారంభించారు. లఖ్‌నవూ కేజీఎంయూలో ఈ సౌకర్యం ఉంది. కానీ ఎస్‌జీపీజీఐకి డోనర్లు దొరకడం లేదు.

దేశ రాజధాని దిల్లీలో గత వారం లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో రెండో ప్లాస్మా బ్యాంక్‌ ప్రారంభించారు. వసంత్ కుంజ్‌లో ఉన్న మొదటి బ్యాంక్ ఐఎల్‌బీఎస్‌లో గత నెల నుంచీ పనిచేస్తోంది.

“మనం దానం చేస్తున్న రక్తం, ప్లాస్మా తీవ్ర అనారోగ్యానికి గురైనవారికి, చావుబతుకుల్లో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చనే విషయాన్ని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దానికి తుది ఫలితం ఎలా ఉంటుందనేదానిపై వారికి అవగాహన ఉండాలి. కానీ, మన ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులనే మనం సరిగా నడపలేనప్పుడు, ప్రభుత్వాలు ఆరోగ్యంపై నామమాత్రం వ్యయం చేస్తున్నప్పుడు అది కష్టం” అని గార్గేయ తెల్కపల్లి అభిప్రాయపడ్డారు.

ప్లాస్మా దానం చేసేలా కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులను ప్రోత్సహించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత వారం ఆస్పత్రులకు సూచించారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ప్లాస్మా డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు.

ఇప్పటివరకూ కోవిడ్-19కు మెరైగున చికిత్సగా కనిపించిన నాలుగైదు వైద్యాల్లో ప్లాస్మా థెరపీ ఒకటి. అలాంటప్పుడు దానికి డిమాండ్ పెరగడం అనేది సహజమే.

ఇలాంటి పరిస్థితుల్లో తనకు ప్లాస్మా అవసరమైనప్పుడు కొంతమంది దానికి బదులు తనను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం అద్వితీయ మల్ గుర్తించారు.

అందుకే అద్వితీయ మల్ తన స్నేహితుడు ముకుల్ పాహ్వాతో కలిసి ‘ఢూండ్’ అనే పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించారు. ఇది ప్లాస్మా పొందడానికి ప్రజలకు సాయం చేస్తోంది.

ప్లాస్మా కొరతతో బ్లాక్ మార్కెట్ జోరు

“దేశం నలు మూలల నుంచి జనం పెద్ద సంఖ్యలో మా వెబ్‌సైట్‌లో నమోదవుతున్నారు. మేం ఈ ప్రయత్నాన్ని నెల క్రితమే చేశాం. జనం ప్లాస్మా కోసం మొదట్లో వాట్సప్ ద్వారా మెసేజిలు పంపించేవారు” అని ముకుల్ పాహ్వా చెప్పారు.

“ప్లాస్మా అవసరమైన వారు కనుచూపు మేరలో కనిపిస్తున్నప్పడు, వారితో ఎలాంటి లావాదేవీలైనా జరపవచ్చనే విషయం దానం చేసేవారికి తెలిసిపోతుంది. కానీ, మేం డోనర్-రిసీవర్‌ కలిసి మాట్లాడుకునేలా మాత్రమే చేస్తాం” అని ముకుల్ పాహ్వా స్పష్టం చేశారు.

తర్వాత చర్చ వారిద్దరి మధ్యే నడుస్తుందని. తన సంస్థ వాటన్నిటికీ దూరంగా ఉంటుందని తెలిపారు.

రెండు రోజుల క్రితం మహారాష్ట్ర కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యులు డాక్టర్ ఓం శ్రీవాస్తవ్ నుంచి కూడా ‘ప్రాణ్’ పేరుతో ఇలాంటి ప్రయత్నమే మొదలైంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుకు చెందిన ప్రొటోకాల్, మిగతా కోణాలపై పనులు జరుగుతున్నాయని ఆయన సహచర డాక్టర్ మారియా నిగమ్ చెప్పారు.

“ఇలాంటి కొత్త థెరపీలు ఎప్పుడు వెలుగులోకి వచ్చినా, వాటి ధర, ఇలాంటి లావాదేవీల గురించి వార్తలు వస్తుంటాయి. వాటిని అదుపు చేయగల సంస్థలు బలహీనంగా ఉన్నప్పుడు, ఇలాంటివాటికి కళ్లెం వేయడం కష్టంగా కనిపిస్తుంది” అని డాక్టర్ నఫీస్ ఫైజీ అంటారు.

“ఆరోగ్య రంగంలో బ్లాక్ మార్కెట్ లేకుండా ఏది దొరుకుతోంది? ఇక కరోనా వచ్చినవారు ఎంత షాక్‌లో ఉంటారంటే, వారు తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయడానికి కూడా సిద్ధపడతారు” అని వాలంటరీ హెల్త్ వర్కర్ ఆశా మిశ్రా తెలిపారు.

గత కొన్ని రోజులుగా ప్లాస్మా చికిత్సకు సంబంధించిన రిమెడిసివిర్ లాంటి మందులను మూడు నాలుగు రెట్ల ధరకు అమ్మతున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స కోసం భారీగా వసూలు చేస్తున్నారనే వార్తలు రావడంతో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దానిపై ఒక రేట్-లిస్ట్ జారీ చేసింది. కానీ దానికి పూర్తిగా తెరపడలేదని చెబుతున్నారు.

'జాతీయ బ్లడ్ పాలసీ' ప్రకారం రక్తాన్ని డ్రగ్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ 1940 కింద ఔషధాల శ్రేణిలో ఉంచారు. దానిని అక్రమంగా అమ్మడం, కొనడం చేస్తే వారికి రెండేళ్ల శిక్ష విధించవచ్చు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)