కరోనావైరస్: మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య - మహిళల కంటే పురుషులు ఎందుకు మాస్కులు తక్కువగా ధరిస్తున్నారు?

    • రచయిత, ఫెర్నాండో డుర్టే
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఒక చిన్న విషయానికి భర్తతో చాలా వాదోపవాదాలు, ఘర్షణలు పడిన తర్వాత మోనిక ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

ఒక వైపు బ్రెజిల్‌లో కోవిడ్-19 విస్తృతంగా వ్యాపిస్తున్నప్పటికీ ఆమె భర్త ఎడుఆర్డో మాత్రం మాస్క్ ధరించడానికి ఇష్ట పడలేదు. కరోనావైరస్ మరణాలు అత్యధికంగా నమోదైన దేశాలలో బ్రెజిల్ ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.

దీంతో ఆమె నైట్ రోయిలో ఉన్న ఇంటి నుంచి ఏడేళ్ల కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లాలని నిశ్చయించుకుంది. రియో డి జనీరో నగరానికి దగ్గరగా ఉన్న నైట్ రోయి జనాభా 4,80,000.

"నాకు ఆస్తమా ఉంది. దీంతో వైరస్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ, నేను అవసరం కంటే ఎక్కువ భయపడుతున్నానని నా భర్త అనుకుంటున్నారు” అని ఆమె బీబీసీ కి చెప్పారు.

"బయటకు వెళ్ళినప్పుడు మూసి ఉన్న ప్రాంతాలకు వెళ్ళటం లేదు కాబట్టి మాస్క్ ధరించనక్కరలేదని ఆయన తన చర్యలను సమర్ధించుకుంటారు".

"ఆయనతో పాటు నన్ను నా కొడుకును కూడా ముప్పులో పెడుతున్నారని తనకు అర్ధం కావటం లేదు” అని మోనిక అన్నారు.

కరోనావైరస్ బారిన పడి చాలా మంది పురుషులు మరణిస్తున్నారు. కానీ, మాస్కులు ధరించడానికి మాత్రం సుముఖత చూపించడం లేదు.

ప్రపంచంలో మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కానీ, మోనిక, ఎడుఆర్డో కథ మాత్రం మహమ్మారి సమయంలో మాస్కులు ధరించే విషయంలో లింగ బేధానికి అద్దం పడుతోంది.

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అంచనాల ప్రకారం జులై 09 వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి 20 లక్షల మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు.

అధికారిక అంచనాల ప్రకారం, పురుషుల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంది.

కానీ, మాస్కులు, ఫేస్ కవర్ల లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించడానికి పురుషులు ఎక్కువగా విముఖత చూపిస్తున్నారని కొన్ని అధ్యయనాలు, సర్వే లు చెబుతున్నాయి. గతంలో మహమ్మారులు సంభవించినప్పుడు కూడా పురుషుల్లో ఇదే ధోరణి కనిపించింది.

కోవిడ్-19 బారి నుంచి రక్షించుకోవడానికి మాస్కులు ధరించడం ఒక మార్గమని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

వైరస్ గురించి కొత్త శాస్త్రీయ ఆధారాలు లభిస్తున్న కొలదీ, గత కొన్ని నెలల్లో వైద్యులు చేస్తున్న సూచనలు మారుతూ వస్తున్నాయి.

కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ వ్యూహాత్మక చర్యల్లో భాగంగా మాస్కులు ధరించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సమర్ధిస్తోంది. మాస్కుల తయారీలో వాడే వస్త్రం ఎంత వరకు వైరస్‌ల నుంచి కాపాడుతుందనే విషయంపై సందేహాలు ఉన్నప్పటికీ , సామాజిక దూరం పాటించడం సాధ్యం కాని చోట్ల మాస్కుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

చాలా దేశాలు ఈ విధానాన్ని ప్రచారం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో రద్దీగా ఉండే ప్రదేశాలలో ముఖ్యంగా ప్రజా రవాణా సంస్థల్లో, బార్లలో, దుకాణాలలో మాస్కులు వాడటాన్ని నిర్బంధంగా అమలు చేస్తున్నారు.

అహంకారం, పక్షపాతం

మాస్కులు కరోనావైరస్ నుంచి రక్షించగల్గితే పురుషులు ఎందుకు వీటిని ధరించడానికి ఇష్టపడటం లేదు?

మిడిల్ సెక్స్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పని చేస్తున్న వలెరియో కాప్రారో, కెనడా మాథమెటికల్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బెర్కెలీకి చెందిన గణిత నిపుణుడు హెలీన్ బార్సెలో కలిసి పురుషుల ప్రవర్తనపై విశ్లేషణ చేశారు.

వీరి సర్వేలో భాగంగా అమెరికాలో నివసిస్తున్న 2500 మంది ప్రజల దగ్గర నుంచి సమాచారం సేకరించారు. వీరి అధ్యయనంలో పురుషులు మాస్కులు ధరించడానికి ఇష్టపడకపోవడం మాత్రమే కాకుండా మాస్క్ ధరించడాన్ని సిగ్గు పడే పనిగా, బలహీనతకు సంకేతంగా భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ ధోరణి ముఖ్యంగా మాస్కులు ధరించడం తప్పని సరి కాని దేశాల్లో కనిపించింది.

ఈ సర్వేలో పాల్గొన్న సభ్యులను వాళ్ళు సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పుడు, లేదా బయట వ్యక్తులను కలిసినప్పుడు మాస్కులు ధరించడం గురించి వారి అభిప్రాయాలను చెప్పమని అడిగారు.

మాస్కులు కరోనా వైరస్ నుంచి రక్షించగల్గితే పురుషులు ఎందుకు వీటిని ధరించడానికి ఇష్టపడటం లేదు?

మహిళలు మాత్రం తాము ఇంటి బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వే తెలిపింది.

"పురుషులు తమకి ఈ వైరస్ సోకదనే ఉద్దేశ్యంతో మాస్కులు ధరించటం లేదు”.

"కానీ, అధికారిక లెక్కల ప్రకారం ఈ వైరస్ బారిన పురుషులు ఎక్కువగా పడుతున్నారు” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పురుషులు చేతులు శుభ్రపర్చుకునే విషయంలో కూడా నియమాలు పాటించడం లేదని మరో సర్వే తెలిపింది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే లో 65 శాతం మంది మహిళలు చేతులు తరచుగా కడుక్కుంటుంటే, 52 శాతం మంది పురుషులు మాత్రమే చేతులు తరచుగా కడుక్కుంటున్నారని తెలిసింది.

రాజకీయాల్లో కూడా కనిపిస్తున్న వ్యత్యాసం

కాప్రారో, బార్సెలో తమ పరిశోధనను అమెరికాలో నిర్వహించారు.

ఈ దేశంలో ఉన్న రాజకీయ ఆసక్తులు కూడా మహమ్మారి సమయంలో స్త్రీలు, పురుషులు ప్రవర్తించే విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడైంది.

డెమొక్రాట్ మద్దతుదారుల కంటే ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి మద్దతిచ్చేవారు మాస్కులు ధరించడానికి, భౌతిక దూరం పాటించడానికి తక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు చాలా సర్వే లు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో కూడా ప్రజల ప్రవర్తనను నిర్వచించడంలో జెండర్ చాలా గట్టి పాత్ర పోషిస్తోంది.

రిపబ్లిక్ పార్టీకి మద్దతిచ్చే 68 శాతం మంది మహిళలు ఇంటి బయట కూడా మాస్క్ ధరించినట్లు జూన్ లో నిర్వహించిన ఒక పోల్ వెల్లడి చేసింది.

కేవలం 49 శాతం మంది పురుషులు మాత్రమే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరిస్తున్నారు.

ఎక్కువ మాస్కులు, తక్కువ మరణాలు

గాలి నుంచి కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందనే ఆధారాలు నిర్ధరితమవుతున్న తరుణంలో ఫేస్ మాస్కుల ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉంది.

22 దేశాలలో మరణాల రేటుకి, ఫేస్ మాస్కులు వాడకానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉందని జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రచురణ కాని అధ్యయనం పేర్కొంటోంది.

ఫేస్ మాస్కులు ఎక్కువగా ధరించిన దేశాలలో ప్రతి పది లక్షల మందిలో తక్కువ మరణాలు నమోదు అయినట్లు ఈ అధ్యయనంలో తెలిపారు.

మరణాల రేటు అధికంగా ఉన్న యూకే లాంటి దేశాలలో కూడా పురుషులు తక్కువ సంఖ్యలో మాస్కులు ధరిస్తున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.

పురుషులు ఎక్కువ ధీమాతో ప్రవర్తిస్తున్నారా?

మాస్కులు ధరించడంలో ఉన్న ఈ లింగ బేధం గురించి కోపెన్ హాగెన్ యూనివర్సిటీలో మానసిక శాస్త్రవేత్తగా పని చేస్తున్న క్రిస్టినా గ్రావెర్ట్ అంతగా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు.

"పురుషులు, స్త్రీలు ఒక ముప్పుని చూసే విధానంలో చాలా తేడాలుంటాయని” అనేక అధ్యయనాలు తెలిపాయని ఆమె చెప్పారు.

కానీ, మహిళలు కోవిడ్ 19 నియంత్రణ చర్యలు పాటించడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో కూడా గమనించినట్లు చెప్పారు.

"ఇక్కడ చాలా నడక మార్గాలను ఒకరి కొకరు ఎదురు కాకుండా వన్-వే గా మార్చారు. అయితే, మహిళల కంటే పురుషులే తప్పు దారిలో వెళ్లారని” ఆమె గమనించినట్లు చెప్పారు.

గతంలో మహామ్మరులు సంభవించినప్పుడు కూడా లింగ బేధాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.

2009 లో మెక్సికోలో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు , పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మాస్కులు ధరించినట్లు వెల్లడైంది.

రెండు వారాల పాటు మెట్రో సర్వీసులు వాడే ప్రజల ప్రవర్తనను పరిశోధకులు గమనించారు.

ఆసియా దేశాలలో కూడా మాస్కులు ధరించే విషయంలో లింగ బేధాలు ఉన్నట్లు గుర్తించారు.

హాంగ్ కాంగ్ లో 2002-03 లో సార్స్ వ్యాధి తలెత్తినప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడంలో గాని, మాస్కులు ధరించటంలో గాని, పురుషుల కంటే మహిళలే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు గమనించారు.

ముఖాన్ని కప్పుకోవడంలో పురుషులు తక్కువగా ఉన్నారని తమ డేటా చూపిస్తోందని యు గవ్ (YouGov) సంస్థలో లీడ్ డేటా జర్నలిస్ట్ గా పని చేస్తున్న మాథ్యు స్మిత్ చెప్పారు.

1918 లో సంభవించిన ఫ్లూ సమయంలో కూడా ప్రజా ఆరోగ్య అధికారులకు ఫేస్ మాస్కులు ధరించమని ఎక్కువగా పురుషులకు, అబ్బాయిలకు చెప్పవలసి వచ్చింది.

పురుషులు నిజంగానే అజాగ్రత్తగా ఉంటున్నారా?

క్రిస్టినా గ్రావెర్ట్ అధ్యయనంతో పాటు, ఈ వాదనను సమర్ధించడానికి నిజ జీవితంలో ఎదురవుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా పురుషులే ఉండటంతో కార్ ఇన్సూరెన్స్ యజమానులు మహిళల దగ్గర నుంచి తక్కువ మొత్తంలో ప్రీమియం తీసుకుంటున్నారు. కానీ, కారు నడిపేవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటారనే వాదన కూడా ఉంది.

కాప్రారో కూడా మాస్క్ ధరించడానికి అంతగా సుముఖత చూపించరు.

"నేను ఇటలీకి వెళ్ళినప్పుడే అక్కడ మాస్క్ వేసుకోవడం చాలా చోట్ల తప్పని సరి అవడంతో మాస్క్ వేసుకోవడం మొదలు పెట్టాను”.

“నేను చాలా జాగ్రత్తగా ఉంటూ భౌతిక దూరాన్ని పాటించాను. మాస్క్ వేసుకోకపోవడానికి అదొక సాకుగా తీసుకున్నాను."

మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తేనే పురుషులు ఈ సలహా పాటిస్తారని ఆమె చెప్పారు.

ఫేస్ మాస్క్ ధరించడం తప్పని సరి అయిన చోట లింగ బేధాలు పెద్దగా కనిపించవని అధ్యయనాలు చెబుతున్నాయి.

పురుషులు ఎక్కువ ధీమాతో ఉంటే, ఒక సారి మహిళల కంటే ఎక్కువ పురుషులే ఇబ్బంది పడుతున్నారని లెక్కలతో చూపించడం అవసరమని కాప్రారో అన్నారు.

ఒక వేళ సగటున పురుషులు స్వార్ధంతో ఉంటే, ఇతరులను రక్షించేందుకు తక్కువ దృష్టి పెట్టి తమని తాము రక్షించుకునేందుకు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సుఖాంతమైన కథ

ఒక్కొక్కసారి పక్క వారి నుంచి వచ్చే ఒత్తిడి కూడా పని చేస్తుందని మోనిక దంపతుల కథ చెబుతోంది.

తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని ప్రభుత్వాధికారులు చెప్పడం, అలా ధరించని పక్షంలో కేసులు నమోదు చేస్తుండటంతో.. భర్తలో వచ్చిన మార్పుని మోనిక గమనించారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె భర్త కూడా మాస్క్ ధరించడం మొదలు పెట్టారు.

"ఆరోగ్యంగా ఉన్న తనలాంటి వారికి ఏమి కాదనే ఇప్పటికీ ఆయన అనుకుంటారు” అని మోనిక చెప్పారు.

కానీ, అతను తీసుకునే చర్యలు అతని కుటుంబాన్ని రక్షిస్తాయని అతనికి అర్ధం అయింది.

ఇందులో భార్యా భర్తల పేర్లను వారి గోప్యత దృష్ట్యా మార్చడమైనది

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)