You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనాలో వీగర్ ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ
వీగర్ తెగ ముస్లిం జనాభాను గణనీయంగా తగ్గించేందుకు చైన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. షిన్‌జియాంగ్ ప్రాంతంలోని ఆ మతానికి చెందిన మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని, లేదంటే సంతాన నిరోధక పరికరాలు వాడాలని చైనా ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు ఈ పరిశోధన బైటపెట్టింది.
చైనాకు చెందిన రీసెర్చ్ స్కాలర్ అడ్రియాన్ జెంజ్ చేసిన ఈ పరిశోధనలో బైటపడ్డ నిజాలు అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని, చైనాపై విచారణకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. వీటికి ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది.
వీగర్ ముస్లింలను క్యాంపుల్లో నిర్బంధిస్తున్నారని ఇప్పటికే చైనా ప్రభుత్వంపై అనేక ఆరోపణలున్నాయి. చదువు,విజ్జానాన్ని పెంపొందించాలనే పేరుతో దాదాపు 10లక్షలమంది వీగర్ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందన్న ఆరోపణలున్నాయి.
అయితే, చైనా మొదట్లో ఈ క్యాంపుల అంశాన్ని ఖండించినా, తీవ్రవాదాన్ని, షిన్‌జియాంగ్ ప్రాంతంలో వేర్పాటువాదాన్ని నిర్మూలించేందుకు తీసుకుంటున్న చర్యలుగా తర్వాత వీటిని సమర్ధించుకుంది.
ఇలాంటి దుర్మార్గపు పనులను వెంటనే నిలిపేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనాను డిమాండ్ చేశారు. ఈ అమానవీయ చర్యలను ఖండించడంలో "అన్ని దేశాలు అమెరికాతో గళం కలపాలి'' అయిన ఆయన కోరారు.
గత కొన్నేళ్లుగా వీగర్ ముస్లింల విషయంలో చైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. షిన్‌జియాంగ్ ప్రాంతంలో చాలామంది వీగర్ ముస్లిం చిన్నారులను ఒక పద్దతి ప్రకారం తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారని, ముస్లిం సమాజానికి దూరంగా ఉంచుతున్నారని 2019లో బీబీసీ నిర్వహించిన ఒక ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.
తాజా పరిశోధనలో ఏముంది ?
జెంజ్ అనే స్కాలర్ చేసిన ఈ రీసెర్చ్ రిపోర్ట్ అక్కడి అధికారిక సమాచారం, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వీగర్ ముస్లిం మహిళలతో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందింది. అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువమంది పిల్లలను కనాలనుకునే వారిని అబార్షన్లకు ఒత్తిడి చేస్తున్నారని, ఒప్పుకొకపోతే డిటెన్షన్ క్యాంపులకు తరలిస్తామని బెదిరిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. "వీగర్ ముస్లిం మహిళలను అత్యంత అమానవీయ పద్దతిలో కుటుంబ నియంత్రణకు ఒత్తిడి చేస్తున్నారు'' అని జెంజ్ ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఇద్దరికన్నా తక్కువ సంతానం ఉన్న మహిళలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ పరికరాలను(ఇంట్రా-యుటిరిన్ డివైస్-ఐయూడీ) అమర్చుతున్నారని, మరికొందరికి కుటుంబ నియంత్ర ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని నివేదిక పేర్కొంటోంది.
''2016 సంవత్సరం నుంచి షిన్‌జియాంగ్ ప్రాంతపు ప్రజల సంతానోత్పత్తి నిర్ణయాలలో ప్రభుత్వం బలవంతంగా కల్పించుకుంటోంది. క్రూరమైన విధానాల ద్వారా వారి జనాభా ఉత్పత్తిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది'' అని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
జెంజ్ నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి, జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గింది. 2015 నుంచి 2018 మధ్యకాలంలో జనాభా పెరుగుదల 84శాతానికి పడిపోయిందని, 2019లో అది ఇంకా తక్కువ ఉండొచ్చని రిపోర్టు వెల్లడించింది. "ఈ స్థాయిలో జనాభా వృద్ధి పడిపోవడం అనూహ్యం. అక్కడ కఠినమైన విధానాలు అమలవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది'' అని జెంజ్ వ్యాఖ్యానించారు." వీగర్ తెగ ముస్లిం జనాభాను కంట్రోల్ చేసేందుకు ఇది ఒక విధానం'' అని ఆయన అన్నారు.
షిన్‌జియాంగ్ ప్రాంతంలో చైనా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపుల్లో పాల్గొని వచ్చిన ముస్లిం మహిళలు కొందరు, క్యాంపుల్లో తమకు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. దీనివల్ల తమ రుతుక్రమం ఆగిపోయిందని కొందరు చెప్పగా, సంతాన నిరోధక టీకాల వల్ల తమకు అధిక రక్తస్రావం అయ్యిందని మరికొందరు మహిళలు పేర్కొన్నారు. "ముగ్గురుకంటే ఎక్కువమంది పిల్లలను కనకుండా షిన్‌జియాంగ్ అధికారులు సామూహిక కుటుంబ నియంత్రణ పద్దతులను బలవంతంగా అమలు చేసినట్లు కనిపిస్తోంది'' అని జెంజ్ నివేదిక పేర్కొంది.
విచారణకు పెరుగుతున్న డిమాండ్
"షిన్‌జియాంగ్ ప్రాంతంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలపై నిష్పాక్షిక, అంతర్జాతీయ స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి'' అని చైనాపై ఏర్పాటైన ఇంటర్ పార్లమెంటరీ అలయన్స్ (ఐపీఏసి) ఒక ప్రకటనలో ఐక్యరాజ్య సమితిని సోమవారంనాడు డిమాండ్ చేసింది. "అక్కడ జరుగుతున్న అరాచకాలకు ఆధారాలు ఉన్నాయి.సామూహిక జైలుశిక్షలు, కొనసాగుతున్నాయి. సమాధులతో సహా వీగర్ మతస్థుల సాంస్కృతిక కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారు. అనేక రూపాలలో వీగర్‌లను వేధిస్తున్నారు'' అని ఆ ప్రకటనలో ఐపీఏసీ ఆరోపించింది. " బైటకు తెలియకుండా సాగుతున్న ఈ నిర్బంధాలపై ప్రపంచం మౌనంగా ఉండబోదు. ఒక జాతిని, మతాన్ని, తెగను ఇబ్బంది పెట్టి, వారి అస్థిత్వాన్ని అంతం చేసే చర్యలను ఏ విధంగానూ అంగీకరించేది లేదు'' అని ఆ సంస్థ స్పష్టం చేసింది.
షిన్‌జియాంగ్ ప్రాంతంలో మహిళలు పిల్లల్నికనే నియమాలను పాటించాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని, భారీ జరిమానాలు విధిస్తున్నారని, డిటెన్షన్ క్యాంపులకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ సోమవారంనాడు ప్రచురించిన ఒక రిపోర్ట్‌లో పేర్కొంది.
గుల్నార్ ఒమిర్జాఖ్ అనే చైనాలో పుట్టిన కజకిస్తాన్ సంతతి మహిళ మూడో సంతానాన్ని కనగానే ఆమె శరీరంలో ఐయూడీని అమర్చుకోవాలని ఆదేశాలు అందినట్లు అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది. "2018 జనవరిలో ఒకరోజు ఒమిర్జాఖ్ ఇంటికి కొందరు సైనికులు వచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానాన్ని కన్నందుకు 17,5000 ఆర్‌ఎంబీ (చైనా కరెన్సీ)లు చెల్లించాలంటూ ఆమెను మూడు రోజులపాటు నిర్బంధంలో ఉంచారు. కూరగాయలు అమ్ముకునే ఆమె భర్త అప్పటికే డిటెన్షన్ క్యాంపులో ఉన్నారు'' అని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. జరిమానా చెల్లించకపోతే నిన్ను కూడా నీ భర్త ఉండే డిటెన్షన్ క్యాంపులో చేరుస్తామని బెదిరించినట్లు ఒమిర్జాఖ్ వెల్లడించారు. " పిల్లల్ని ఆ దేవుడు ప్రసాదిస్తాడు. అలాంటిది పిల్లల్ని కనకుండా అడ్డుకోవడం పాపం'' అని ఒమిర్జాఖ్ అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. " మనుషులుగా మమ్మల్ని నిర్మూలించాలని చూస్తున్నారు'' అని ఒమిర్జాఖ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా క్యాప్షన్: తమ పిల్లలను మాయం చేశారంటున్న చైనా వీగర్ ముస్లిం తల్లిదండ్రులను బీబీసీ కలుసుకుంది.
అసోసియేటెడ్ ప్రెస్‌లో వచ్చిన వార్తలను చైనా విదేశాంగ శాఖ ఖండించింది."ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు. వీటి వెనక ఎవరో ఉన్నారు'' ఆ శాఖ వ్యాఖ్యానించింది.
"షిన్‌జియాంగ్ నుంచి వస్తున్న తప్పుడు సమాచారం ఆధారంగా మీడియాలో కథనాలు వండుతున్నారు'' అని చైనా విదేశాంగశాఖ ప్రతిని జావో లిజియన్ ఆరోపించారు.
చైనాలో దశాబ్దాలపాటు వన్ చైల్డ్ పాలసీ అమలులో ఉన్నప్పటికీ, పట్టణప్రాంతాలలోని మైనారిటీలు ఇద్దరిని, గ్రామీణ ప్రాంతాలలోని మైనారిటీలు ముగ్గురిని కనేందుకు అవకాశం ఉండేది. అయితే 2017లో షిజిన్‌పింగ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మైనారిటీలకే ఉన్న ఈ హక్కును చైనీయులకు కూడా వర్తింపజేసింది. మైనారిటీల మాదిరిగానే చైనీయులకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారిగా సంతాన నిబంధనలు వర్తిస్తాయి.
అయితే అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం చైనీయులకు అబార్షన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఐయూడీ పరికరాల అమరికపై ఒత్తిళ్లులేవు. మైనారిటీలు ముఖ్యంగా వీగర్ తెగ ముస్లింలపై ఈ నిర్బంధాలు కొనసాగుతున్నాయి.
షిన్‌జియాంగ్ ప్రాంతంలో జరుగుతున్న జనాభా నియంత్రణ విధానాలు అక్కడ వీగర్ ముస్లింలకు వ్యతిరేకంగా, వారిని అంతమొందించేదుకు సాగుతున్న ప్రయత్నంగా జెంజ్ రిపోర్ట్‌ను అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. "ఈ పరిశోధనలో బైటపడ్డ నిజాలు షిన్‌జియాంగ్ ప్రాంతంలో చైనా ప్రభుత్వపు జనహనన విధానాలకు సంపూర్ణ ఆధారాలు. ఇవి ఐక్యరాజ్య సమితి జనహనన నిరోధక శిక్షాస్మృతి తీర్మానం కింద విచారించదగినవి'' అని జెంజ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
- పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా.. ఎలాంటి నేరం చేయలేదు.. ఎలాంటి విచారణ లేదు
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
- చైనాతో పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందా లేక ముఖం చాటేస్తుందా?
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- భారత్, చైనా చర్చలు: బలగాల ఉపసంహరణకు అంగీకారం
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ వినీ వినీ చెవులు పగిలిపోయాయి' - చైనాలో భారత యుద్ధ ఖైదీ
- భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)