క‌రోనావైర‌స్ వ్యాక్సీన్: మ‌నుషుల‌పై కొత్త వ్యాక్సీన్ ప్ర‌యోగాలు ప్రారంభం.. 2021 ప్ర‌థ‌మార్థం క‌ల్లా అందుబాటులోకి కోవిడ్-19 టీకా

బ్రిట‌న్‌లో క‌రోనావైర‌స్ కొత్త వ్యాక్సీన్‌ను వాలంటీర్ల‌కు ఎక్కించ‌డం మొద‌లుపెట్టారు.

ప్ర‌యోగంలో భాగంగా దాదాపు 300 మందికి ఈ వ్యాక్సీన్ ఇస్తున్నామ‌ని ఇంపీరియ‌ల్ కాలేజీ లండ‌న్‌లో ఈ ప్ర‌యోగానికి నేతృత్వం వ‌హిస్తున్న ప్రొఫెస‌ర్ రాబిన్ ష‌టాక్‌, ఆయ‌న స‌హ‌చ‌రులు వెల్ల‌డించారు.

జంతువుల‌పై ఇప్ప‌టికే ఈ వ్యాక్సీన్‌ను ప్ర‌యోగించారు. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ఇది మెరుగు ప‌రచ‌డంతోపాటు ఎలాంటి హానీ చేయ‌డం లేద‌ని రుజువైంది.‌

మ‌రోవైపు ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ప‌రిశోధ‌కులు మ‌నుషుల‌పై ప్ర‌యోగాన్ని ఇప్ప‌టికే మొద‌లుపెట్టారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 120 వ్యాక్సీన్ల ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి.

"క‌రోనావైర‌స్‌పై పోరాటానికి స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చా"

ఇంపీరియ‌ల్ కాలేజీలో జ‌రుగుతున్న టీకా ప్ర‌యోగంలో పాల్గొన్న తొలి బ్యాచ్ వాలంటీర్ల‌లో ఆర్థిక రంగ నిపుణురాలైన 39ఏళ్ల క్యాతి ఒక‌రు.

క‌రోనావైర‌స్‌పై పోరాటంలో తానూ పాలుపంచుకొనేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని ఆమె వివ‌రించారు.

"సాయం చేసేందుకు ఏం చేయాలో మొద‌ట్లో అస‌లు అర్థం కాలేదు. ఇప్పుడైతే ఏం చేయ‌గ‌ల‌నో స్ప‌ష్ట‌త వ‌చ్చింది."

"టీకా వ‌చ్చేవ‌ర‌కూ ప‌రిస్థితులు మునుప‌టికి రావ‌ని అర్థ‌మైంది. అందుకే ఈ ప్ర‌యోగంలో భాగ‌స్వామ్యం కావాల‌ని నిర్ణ‌యించుకున్నా."

ఈ మొద‌టి ద‌శ టీకా ప్ర‌యోగాల అనంత‌రం.. అక్టోబ‌రులో 6000 మందిపై రెండో ద‌శ వ్యాక్సీన్ ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తారు.

బ్రిట‌న్‌తోపాటు విదేశాల్లోనూ 2021 ప్ర‌థ‌మార్థం క‌ల్లా ఈ టీకా అందుబాటులోకి వ‌స్తుంద‌ని ప‌రిశోధ‌కులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన చ‌ర్చిల్ హాస్పిట‌ల్‌లో జ‌రుగుతున్న టీకా ప్ర‌యోగాల్లో పాలుపంచుకున్న వాలంటీర్ల‌ను డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్, ప్రిన్స్ విలియ‌మ్స్ క‌లిసారు.

"మీరు అత్యంత కీల‌క‌మైన‌ ప్ర‌యోగంలో పాలుపంచుకుంటున్నారు. ఇది నిజంగా ఓ అద్భుతం లాంటిది." అని వాలంటీర్ల‌తో ప్రిన్స్ చెప్పారు.

కొత్త విధానం

వైర‌స్‌ను బ‌ల‌హీన ప‌రిచ‌డం లేదా వైర‌స్‌లో మార్పులు చేయ‌డం లాంటి ప‌ద్ధ‌తుల్లో సంప్ర‌దాయ వ్యాక్సీన్ ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తారు. అయితే ఇంపీరియ‌ల్ కాలేజీ ప్ర‌స్తుతం కొత్త విధానంలో ముందుకు వెళ్తోంది. అచ్చం వైర‌స్‌లానే న‌డుచుకొనే వైర‌స్ ఆర్‌ఎన్ఏ ఆధారంగా ప్ర‌యోగం నిర్వ‌హిస్తోంది.

దీన్ని ఒక‌సారి కండ‌రాల్లోకి ప్ర‌వేశ‌పెడితే.. ఆర్‌ఎన్ఏ త‌న‌లాంటి జ‌న్యువుల‌ను మ‌రిన్ని ఉత్ప‌త్తి చేస్తుంది. అంతేకాదు వైర‌స్‌కు వెలుపల క‌నిపించే ఓ ప్రొటీన్‌ను ఉత్ప‌త్తి చేసేలా శ‌రీరంలోని క‌ణాల‌నూ ప్రేరేపిస్తుంది.

కోవిడ్‌-19 రాకుండా చూడ‌టంతోపాటు క‌రోనావైర‌స్‌పై పోరాడేలా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ఇది సిద్ధంచేస్తుంది.

టీకాల తయారీ మొదలు

ఫర్గ్యుస్ వాల్ష్‌, బీబీసీ వైద్య ప్ర‌తినిధి, విశ్లేష‌ణ‌

చాలా స్వ‌ల్పంగా జ‌న్యు ప‌దార్థాన్ని ఉప‌యోగించ‌డంతో ఇంపీరియ‌ల్ కాలేజీ వ్యాక్సీన్ ప్ర‌యోగానికి కొంచెం ఎక్కువ స‌మ‌యం ప‌డుతోంది. కేవ‌లం ఒక లీట‌రు కృత్రిమ జ‌న్యు పదార్థంతో దాదాపు రెండు మిలియ‌న్ల టీకాలు త‌యారుచేయొచ్చ‌ని ఇక్క‌డి ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

ఈ టీకాల‌ను ఇప్ప‌టికే అమెరికాలో త‌యారుచేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ ఏడాది చివ‌ర్లో యూకేలోనూ త‌యారీ మొద‌లవుతుంది. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీగా ఉత్ప‌త్తి చేయొచ్చు.

ఆరోగ్య ప‌ర‌మైన ముప్పులు త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌నుషుల‌పై ఈ ప్ర‌యోగాలు జాగ్ర‌త్త‌గా, నెమ్మ‌దిగా నిర్వ‌హిస్తున్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్‌లో అయితే ఏప్రిల్‌లోనే టీకా ప్ర‌యోగాలు మొద‌ల‌య్యాయి. అక్క‌డ మొద‌ట‌గా ఇద్ద‌రికి టీకా ఎక్కించారు. వారం త‌ర్వాత.. రోజుకు వంద మందికి టీకా ఇవ్వ‌డం ప్రారంభించారు.

ఇంపీరియ‌ల్ కాలేజీలో మాత్రం తొలి రోజు ఒక‌రికే వ్యాక్సీన్ ఇచ్చారు. త‌ర్వాత ప్ర‌తి 48 గంట‌ల‌కు ముగ్గురు చొప్పున వాలంటీర్లు ఈ ప్ర‌యోగంలో పాలుపంచుకుంటారు. వారం త‌ర్వాత ఈ సంఖ్య క్ర‌మంగా పెరుగుతుంది.

అక్స్‌ఫ‌ర్డ్‌లో వాలంటీర్ల‌కు ఒక ‌డోసు మాత్ర‌మే వ్యాక్సీన్ ఇస్తున్నారు. ఇక్క‌డ మాత్రం రెండు డోసులు ఎక్కిస్తున్నారు.

తాజా టీకా ప్ర‌యోగంపై ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదని ప్రొఫెస‌ర్ షెటాక్ బృందం చెబుతోంది. ఈ ప్ర‌యోగం కొత్త విధానంలో చేప‌డుతుండ‌టంతో అత్యంత అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌హ‌రిస్తున్నట్లు వివ‌రించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా 120కుపైగా టీకా ప్ర‌యోగాలు తొలి ద‌శ‌ల్లో ఉన్నాయి. వీటిలో చాలా వ్యాక్సీన్లు ప్ర‌యోగశాల‌ల‌కే ప‌రిమితం అవుతాయి.

మ‌రోవైపు చైనాలో ఐదు, అమెరికాలో మూడు, యూకే రెండు, ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ, ర‌ష్యాల్లో ఒక్కో ప్ర‌యోగం మ‌నుషులపై వ్యాక్సీన్ ప్ర‌యోగించే ద‌శ‌కు చేరుకున్నాయి.

తాము వ్యాక్సీన్ ప్ర‌యోగం రేసులో పాలుపంచుకోవ‌డం లేద‌ని, వైర‌స్‌పై పోరాటం చేస్తున్నామ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ప్ర‌పంచం మొత్తానికీ స‌రిప‌డే స్థాయిలో వ్యాక్సీన్ల‌ను త‌యారుచేయాలంటే.. భిన్న విధాల్లో విజ‌య‌వంతంగా వ్యాక్సీన్ త‌యారు చేయాల్సి ఉంటుంది.

"వైర‌స్ జ‌న్యు ప‌దార్థంతో టీకాను త‌యారుచేయ‌గ‌లిగాం. కొన్ని నెల‌ల్లోనే ఈ ప్ర‌యోగాన్ని మ‌నుషుల‌పై ప్ర‌యోగించే ద‌శ‌కు తీసుకెళ్లాం." అని ప్రొఫెస‌ర్ షెటాక్ వివ‌రించారు.

"ఈ విధానం విజ‌య‌వంత‌మైతే.. కోవిడ్‌-19పై పోరాడే శ‌క్తిమంత‌మైన అస్త్రం మ‌న‌చేతికి వ‌స్తుంది. అంతేకాదు భ‌విష్య‌త్తులో విరుచుకుప‌డే మ‌హ‌మ్మారుల‌పై చేసే పోరాట విధానంలోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయి."

"మా వాలంటీర్ల‌లో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ క‌చ్చితంగా మెరుగుప‌డుతుంద‌నే న‌మ్మ‌కం లేక‌పోయుంటే ఈ ప్ర‌యోగంలో నేను భాగ‌స్వామిని అయ్యుండేదాన్ని కాదు." అని ప్ర‌ధాన ప‌రిశోధ‌కురాలు డాక్ట‌ర్ క‌త్రినా పొలాక్ వివ‌రించారు.

"మ‌నుషుల‌పై కంటే ముందు నిర్వ‌హించిన ప్ర‌యోగాల్లో అద్భుత‌మైన ఫ‌లితాలు క‌నిపించాయి. ఇన్ఫెక్ష‌న్‌పై పోరాడే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ఠంగా మార‌డాన్ని మేం గ‌మ‌నించాం. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సీన్ చేతికి వ‌చ్చేందుకు.. ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంది."

ఈ ప‌రిశోధన‌కు యూకే ప్ర‌భుత్వం 41 మిలియ‌న్ పౌండ్ల ఆర్థిక సాయం అందించింది. మ‌రో 5 మిలియ‌న్ పౌండ్లు విరాళాలు వ‌చ్చాయి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)