You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్-నేపాల్: లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలు తమవంటూ నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంటులో ఆమోదం
- రచయిత, సురేంద్ర ఫుయాల్
- హోదా, కాఠ్‌మాండూ నుంచి, బీబీసీ కోసం
లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశంలో అంతర్భాగాలుగా చూపుతూ నేపాల్ రూపొందించిన మ్యాప్‌ను ఆ దేశ పార్లమెంటులోని ప్రతినిధుల సభ ఆమోదించింది.
దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు.
మ్యాప్ నవీకరణకు రాజ్యాంగ సవరణ, కొత్త జాతీయ చిహ్నం రూపొందించడంపై శనివారం అక్కడ నిర్వహించిన చర్చ అనంతరం ఓటింగ్ చేపట్టగా 258 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు.
ఒక్కరు కూడా దీనికి వ్యతిరేకంగా ఓటేయలేదు.
పార్లమెంటు ఎగువ సభ నేషనల్ అసెంబ్లీలోనూ దీనికి ఆమోదం దక్కితే ఆ తరువాత దేశాధ్యక్షురాలు ఆమోదించాల్సి ఉంటుంది.
కాగా నేపాల్ పార్లమెంటు ఈ కొత్త మ్యాప్‌ను ఆమోదించిన విషయం తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై ఇప్పటికే తమ విధానం స్పష్టం చేశామని భారత విదేశీ వ్యవహరాల శాఖ పేర్కొంది.
‘‘చారిత్రక వాస్తవాలు లేదా ఆధారాలతో సంబంధం లేకుండా నేపాల్ తన భౌగోళిక ప్రాంతాన్ని విస్తరిస్తూ మ్యాప్ రూపొందించింది. ఇది సరైంది కాదు’’ అంటూ భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇప్పటికే భారత్ అభ్యంతరం
జమ్మూకశ్మీర్ విభజనం తరువాత భారత ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో కొత్త దేశపటాన్ని విడుదల చేసినప్పుడు అందులో కాలాపానీ ప్రాంతాన్ని చూసిన నేపాల్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో నేపాల్ ప్రభుత్వం ముందుకు వచ్చి భారత్ విడుదల చేసిన మ్యాప్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.
కొద్దిరోజుల కిందట నేపాల్ తన దేశ పటాన్ని విడుదల చేసింది. అందులో లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ భూభాగాలు తన దేశంలో ఉన్నట్లుగా చూపించింది. అది భారత్‌కు ఆగ్రహం కలిగించింది. ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ ప్రచండ లాగే ఓలీ కూడా భారత్, చైనాలతో ‘సమదూర సంబంధాల’ను కోరుకుంటున్నారు. 2008లో ప్రచండ నేపాల్ ప్రధానిగా ఉన్నప్పుడు, సంప్రదాయం ప్రకారం తొలి పర్యటన భారత్‌లో కాకుండా చైనాలో చేసి షాక్ ఇచ్చారు. ‘నేపాల్ మైక్రో మేనేజ్‌మెంట్’కు భారత్ ముగింపు పలకాలని ఓలీ, ప్రచండ అభ్యర్థిస్తూ వస్తున్నారు.
లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా వంటి వివాదాస్పద ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ అధికారికంగా కొత్త రాజకీయ మ్యాపును గత వారం విడుదల చేసింది. ఓలీ చాలా గట్టిగా నిలబడ్డట్లుగా నేపాల్‌లో చాలా మంది దీన్ని చూశారు. అయితే ఓలీ విమర్శకులు మాత్రం కోవిడ్-19 విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంగా దీన్ని వర్ణించారు.
ఈ వివాదాస్పద ప్రాంతాలను భారత్ ఉత్తరాఖండ్‌లోని భూభాగాలుగా చెబుతోంది. నేపాల్ మాత్రం 1816-సుగాలీ ఒప్పందం ప్రకారం తమ ప్రావిన్సు సుదూర్ పశ్చిమ్‌లోని భాగాలని అంటోంది. ఈ ఒప్పందం ప్రకారం మహాకాళీ (శారద) నదికి తూర్పున ఉన్న ప్రాంతాలు నేపాల్‌కు చెందుతాయి.
మహాకాలి, సుస్త (నారాయణి/గండక్ నది వెంబడి ఉన్న నవల్పరాసి) వంటి భారత్-నేపాల్ సరిహద్దు వివాదాల విషయంలో నేపాల్‌లో ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకులు కూడా ప్రభుత్వం కనబరుస్తున్న వైఖరితోనే ఉన్నారు. అన్ని పార్టీలూ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నట్లు కనబడుతోంది.
2015లోనూ ఓలీ భారత్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటానికి ఇది కూడా ఓ కారణం. (అప్పటికి నేపాల్‌లో తీవ్ర భూకంపం వచ్చి నాలుగు నెలలైంది) దక్షిణ నేపాల్‌లోని తరాయి పక్షాలు సవరణల కోసం డిమాండ్లు చేస్తున్నా పట్టించుకోకుండా, నేపాల్ కొత్త రాజ్యాంగం ప్రకటించుకోవడంపై భారత్ అప్పుడు అభ్యంతరం తెలిపింది.
తరాయి నాయకులు, ఉద్యమకారులు అప్పుడు భారత్-నేపాల్ సరిహద్దును తూర్పు నుంచి పడమర వరకు దిగ్బంధం చేశారు. అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌ను, ఇతర నాయకులను కలిశారు. భారత్ కూడా వారికి మద్దతుగా నిలబడింది. సరిహద్దులను భారతే మూసివేసిందని నేపాల్ ఆరోపించింది. భారత్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
ఆరు నెలల పాటు సరిహద్దులు మూసుకుపోవడంతో పెట్రోలియం, ఎల్పీజీ లాంటి వాటి సరఫరా కూడా నిలిచిపోయింది. ఓలీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అప్పుడు వెనక్కితగ్గలేదు. భారత్ ప్రభుత్వానికి ఎదురుగా బలంగా నిల్చుంది. పెట్రోలియం, ఇతర నిత్యావసరాల సరఫరా కోసం చైనాను ఆశ్రయించింది.
ఇంధనం, వంట గ్యాస్ కొరత వల్ల నేపాల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేపాల్ ప్రభుత్వం చైనాతో కొత్త వాణిజ్య-రవాణా ఒప్పందం చేసుకుంది. చివరికి తరాయి కార్యకర్తలు సరిహద్దు దిగ్బంధాన్ని విరమించుకోవడంతో భారత్ కూడా నిత్యావసరాల సరఫరా మొదలుపెట్టింది.
సమస్య మూలం ఏదైనప్పటికీ, 2015లో సరిహద్దులు మూసుకుపోవడం 1989-90లో భారత్ 21 సరిహద్దు పాయింట్లలో 19 పాయింట్లను మూసివేసిన సందర్భాన్ని గుర్తు చేసింది. వాణిజ్యం, రవాణాలకు సంబంధించి విడివిడిగా ఒప్పందాలు చేసుకోవాలన్న నేపాల్ ప్రతిపాదనను భారత్ తిరస్కరిస్తూ ఈ చర్యలు తీసుకుంది.
చైనా నుంచి యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌ను నేపాల్‌లోని అప్పటి రాచరిక ప్రభుత్వం కొనుగోలు చేయడం, తరాయి జిల్లాల్లో ఉంటున్న వేల మందికి పౌరసత్వం ఇచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం ముందుకురాకపోవడం పట్ల కూడా భారత్ ప్రభుత్వం అప్పుడు అసంతృప్తితో ఉంది.
బీరేంద్ర రాజు అయ్యాక పరిస్థితులు సర్దుకున్నాయి. 1990లో నేపాల్ తొలి ప్రజా ఉద్యమం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలపై 30 ఏళ్లుగా ఉన్న నిషేధం తొలిగింది. ఆ తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది.
భారత్ ముందు ఉన్న అవకాశాలు ఏంటి?
30 ఏళ్ల తర్వాత, తరాయిల విషయంలో విభేదాలు సమసి ఐదేళ్లయ్యాక... మళ్లీ భారత్, నేపాల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
భారత్, నేపాల్ ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరస్పరం ఉన్నత స్థాయి పర్యటనల తర్వాత బలపడుతున్న స్నేహ బంధానికి లిపులేఖ్ వివాదం ఆటంకంగా మారింది.
భారత్, నేపాల్ సత్వరం దౌత్య చర్చల ప్రక్రియ మొదలుపెట్టాలన్నది ఇప్పుడు రెండు దేశాల్లోని రాజకీయ పండితుల మాట.
కోవిడ్-19 సంక్షోభం కారణంగా భారత్ ఇంకా ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే, పెద్ద దేశమైన భారతే ఈ విషయంలో ముందడుగు వేయాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.
తాజా పరిణామాల పట్ల కొందరు మాజీ దౌత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు ఎవరూ దిగకూడదని, సమస్య పరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గమని అన్నారు.
‘‘భారత్, నేపాల్ మధ్య సంబంధాలు చాలా పురాతనమైనవి, చాలా బలమైనవి. పరస్పర నమ్మకంతో ఈ రెండు దేశాలూ పరిష్కరించుకోలేని సమస్యలంటూ ఏవీ లేవు. ద్వైపాక్షిక చర్చలకు అనవసరపు వ్యాఖ్యలతో విఘాతం కలగకుండా రెండు దేశాలూ జాగ్రత్త వహించాలి’’ అని నేపాల్‌లో భారత రాయబారిగా పనిచేసిన అనుభవమున్న కేవీ రాజన్ నేపాల్‌లోని కాంతిపుర్ డెయిలీతో అన్నారు.
నేపాల్ కూడా సిద్ధంగా ఉన్నట్లే కనబడుతోంది. నదీపరమైన సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ అన్నారు.
‘‘గతంలో (2019 నవంబర్‌లో భారత్ కొత్త మ్యాపు విడుదల చేసినప్పుడు) నేపాల్ అభ్యర్థనలను భారత్ మన్నించి ఉంటే, ఇప్పుడు పరిస్థితులు ఎంతో బాగుండేవి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
కోవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్ ముగిసిన తర్వాత లేదా సడలించిన తర్వాత సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చల ప్రక్రియలు మొదలవుతాయని భారత్ ఇటీవల వ్యాఖ్యానించింది.
వీలైనంత త్వరగా విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ద్వైపాక్షిక వీడియో కాన్ఫరెన్స్ చేపట్టినా, పరిస్థితులు మెరుగవుతాయని... రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకం, అవగాహనను పెంచినట్లవుతుందని నిపుణులు అంటున్నారు.
‘రెండు దేశాలకూ లాభం’
నేపాల్, భారత్‌ల మధ్య పురాతనమైన సంబంధాల వల్ల రెండు దేశాలూ లాభం పొందాయని నిపుణులు చెబుతున్నారు. వీసా అవసరం లేకుండా జనాల రాకపోకలను అనుమతించడం వల్ల కొన్ని లాభాలూ, కొన్ని నష్టాలూ ఉన్నాయి. లాభాల విషయానికి వస్తే రెండు దేశాలకు చెందిన భక్తులు, పర్యాటకులు, వలస కార్మికులు దీని ద్వారా ప్రయోజనం పొందారు.
విదేశాలకు వెళ్లిన పౌరులు పంపుతున్న డబ్బు అత్యధికంగా పొందుతున్న దేశాల్లో భారత్, నేపాల్ కూడా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు చెబుతోంది. రెండు దేశాల జీడీపీ వృద్ధికి ఇది తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొంది.
లక్షల సంఖ్యలో నేపాలీలు భారత్‌లో పనిచేస్తుంటారు. స్వదేశంలో ఉన్నవారికి డబ్బు పంపుతుంటారు. భారత్ నుంచి ఇలా డబ్బు ఎక్కువగా వెళ్లే దేశాల జాబితాలో నేపాల్ పైస్థానాల్లో ఉంటుంది. లక్షల మంది భారతీయులు కూడా నేపాల్‌లో చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్నారు. కార్మికులుగా పనిచేస్తున్నారు. వారు కూడా అక్కడి నుంచి భారత్‌లోని తమవారికి డబ్బు పంపుతుంటారు.
కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఇప్పుడు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వలస కార్మికులు తాము ఉంటున్న చోట్లకే పరిమితమయ్యారు. ఓలీ, మోదీల మధ్య ఇటీవల టెలిఫోన్ సంభాషణ జరిగిన తర్వాత భారత్-నేపాల్ సరిహద్దుకు ఇరువైపులా తాత్కాలిక క్వారంటైన్ కేంద్రాలు తెరుచుకున్నాయి.
అధికారులు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించలేకపోతున్నారు. పరిస్థితులు ఎప్పుడు కుదటపడుతాయో కూడా వారు చెప్పలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో దౌత్య చర్చలు చేపట్టాలన్న ఒత్తిడి రెండు దేశాలపైనా పెరుగుతోంది. మొదట భారత్, ఇప్పుడు నేపాల్ వివాదాస్పద ప్రాంతాలు తమవంటే తమవని మ్యాపులు విడుదల చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది.
భారత్, నేపాల్ ఈ వివాదాలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే, రెండు దేశాలకూ, రెండు దేశాల్లోని అల్పాదాయ వర్గ ప్రజలకు అంత మేలు జరుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.
‘‘భారత్, నేపాల్‌ల మధ్య గొప్ప బంధం ఉంది. ఇది చాలా ప్రత్యేకం. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలను అర్థం చేసుకోవడం ఒకింత కష్టమే. అయితే, అసాధ్యమైతే కాదు. వాటిని పరిష్కరించుకుని, రెండు దేశాల మధ్య బంధం మరింత మెరుగుపడాలని మేం ఆశిస్తున్నాం’’ అని నేపాల్ పార్లమెంటులోని దిగువ సభలో ఓలీ అన్నారు.
కానీ, మోదీ ప్రభుత్వం, ఓలీ ప్రభుత్వం ఇందుకు నిజంగానే సిద్ధంగా ఉన్నాయా? అన్నది అసలు ప్రశ్న. ఒక వేళ సిద్ధంగానే ఉంటే, ఈ దౌత్య చర్చలు ఎప్పుడు మొదలవుతాయి?
ఇవి కూడా చదవండి:
- 'కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది... రుణాలపై ఆగస్ట్ 31 వరకూ మారటోరియం' - ఆర్బీఐ గవర్నర్
- దిల్లీ - హైదరాబాద్/వైజాగ్ విమాన ప్రయాణం ఛార్జీ కనిష్ఠం రూ.3,500, గరిష్ఠం రూ.10 వేలు
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- కరోనా లాక్‌డౌన్: 200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే
- వీడియో, ఇండియా లాక్‌డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)