‘కరోనావైరస్‌ను ఎదుర్కోవటానికి 20 ఏళ్లుగా ఎలా సిద్ధమయ్యానంటే’

జీవితమంతా సూక్షజీవుల భయంతో బతుకుతుండటం వల్ల కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉన్నారు పీటర్ గోఫిన్.

పరిశుభ్రత పాటించటం ఎలాగో ఆయనకు తెలుసు. ఆందోళనలు అదుపుతప్పకుండా చూసుకునే నైపుణ్యాలూ ఉన్నాయి.

కిచెన్‌లో సెరియల్ బ్యాగ్‌ను డిసిన్ఫెక్టెంట్‌తో తుడిచి శుభ్రం చేస్తున్నపుడు నాకు ఒక విషయం తెలిసొచ్చింది: ఈ కరోనావైరస్ మహమ్మారి కోసం గత 20 ­­ఏళ్లుగా అభ్యాసం చేస్తున్నాను.

నేను టీనేజిలో అడుగుపెట్టినపుడు నాకు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) ఉందని నిర్ధారణ అయింది. నా జీవితంలో మూడొంతుల భాగం సూక్ష్మజీవుల విషయంలో చాలా వేదనకు గురయ్యాను. అవి ఎలా సంక్రమిస్తాయి, వాటిని దూరంగా ఉంచటం ఎలా అనే దానిమీదే దృష్టి ఉండేది.

అదే ఇప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో నన్ను మిగతావారి కన్నా ముందుండేలా చేసింది.

ఇంటి బయట జనాన్ని తాకకుండా ఉండటం, వేరేవాళ్లు ముట్టుకున్న దేనినైనా తాకినపుడు వెంటనే చేతులు కడుక్కోవటం, సూపర్‌మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకున్నాక వాటిని శుభ్రంగా తుడుచుకోవటం – ఇవన్నీ నేను చాలా ఏళ్లుగా చేస్తూనే ఉన్నా. నైపుణ్యం సాధించా.

నా అలవాట్లు ఇప్పుడు కొత్త ప్రపంచ సంస్కృతిలో కనిపిస్తున్నాయి. ఇన్‌ఫెక్షన్ నుంచి మనకు రక్షణ లేదన్న నిరంతర భయాందోళనలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ప్రపంచంలో లక్షలాది మంది తమను తామే ఇలా ప్రశ్నించుకుంటున్నారు:

‘‘షాపులో ఆ వ్యక్తి నాకు మరీ దగ్గరగా వచ్చాడా?’’

‘‘నేను చూతులు శుభ్రంగా కడుక్కున్నానా?’’

‘‘ఈ సోపుతో సూక్ష్మక్రిములు చచ్చిపోతాయా?’’

పంతొమ్మిదో శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ వైద్యులు ఓసీడీ అధ్యయనాలు రాస్తూ.. దానిని ‘ఫోలీ డ్యు డోట్’ అని అభివర్ణించారు. అంటే.. అనుమానపు పిచ్చి అని అర్థం. అది నిజమేనని నాకు అనిపించింది. ఇప్పుడు మహమ్మారి కారణంగా మనలో చాలా మందికి ఇటువంటి అనుభవాలే ఎదురవుతున్నట్టు కనిపిస్తోంది.

మనం దూరం పాటిస్తూ, చేతులు కడుక్కుంటూ, లాక్‌డౌన్ నిబంధనలను అనుసరిస్తుంటే మనల్ని మనం రక్షించుకోవచ్చునని బలంగా నమ్మినా.. కొంత అనిశ్చితి, అనుమానం, ఆందోళన ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి.

ఇవి సహజంగా చెడ్డ ఆలోచనలు కాదు. తక్కువ మోతాదులో ఉంటే అవే మనల్ని అప్రమత్తంగా ఉంచుతాయి.

సమస్య ఏమిటంటే.. అవి అదుపుతప్పి విపరీతంగా పెరిగిపోగలవు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ‘నేను పరిశుభ్రంగా ఉన్నానా?’ అనే అనుమానంతో ఇది మొదలవుతుంది.

‘అసలు మళ్లీ మామూలు జీవితం గడపగలగనా?’ అనే దాకా పోతుంది.

కెనడాలో నా చిన్నప్పుడు – బహుశా ఐదారేళ్ల వయసులో – ఆందోళన, భయాలను నియంత్రించుకోవటంలో సమస్యలు ఉండేవి. నాకు 12 ఏళ్ల వయసు వచ్చేసరికి వాటి పరిధి తగ్గింది. పరిశుభ్రత, కలుషితమవటం గురించిన భయాలుగా మారాయి. ముఖ్యంగా ఇతరులు మాట్లాడినపుడు వెలువడే ఉమ్ము తుపంర్లు, వారు టాయిలెట్‌కు వెళ్లాక చేతులు శుభ్రంగా కడుక్కోనపుడు వ్యాపించే సూక్ష్మక్రిములు, నా చుట్టూ సంచరిస్తున్నట్లు నాకు అనిపించే బ్యాక్టీరియా.. వీటి ద్వారా కలుషితమవుతామనే భయంగా మారింది.

చివరికి.. డోరా నాబ్స్, లైట్ స్విచెస్ వంటి వాటిని ముట్టుకోకుండా ఉండటం, చేతులు ఎర్రగా కందిపోయేలా కడుక్కోవటం నా తల్లిదండ్రులు గమనించారు.

ఈ గందరగోళ పరిస్థితుల్లో నన్ను అర్థంచేసుకుని, ఓపిగా విని, సానుభూతిగా మాట్లాడి, ముందుకు సాగటానికి సాయపడే తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టం. నేను థెరపీ మొదలుపెట్టాను. ఆందోళన తగ్గించే మందులు రాశారు. వాటిని ఇప్పటికీ వాడుతున్నాను.

ఈ చికిత్సలు, ఈ ఓసీడీ కూడా నా సాధారణ జీవితంలో భాగంగా మారాయి. కానీ టీనేజీ వయసులో, ఇరవయ్యోపడి ఆరంభంలో నన్ను బాగా కలతపెట్టాయి. స్కూలు, కాలేజీల్లో క్లాసులు ముగించుకుని ఇంటికొచ్చిన తర్వాత చదువు కంటే శుభ్రం చేసుకోవటం మీదే ఎక్కువ దృష్టి ఉండేది. రాత్రిళ్లు మూడోసారి స్నానం చేస్తూ, మరోసారి బట్టలు ఉతుకుతూ గడిపేవాడిని.

నా ఫ్రెండ్స్‌ని కూడా దూరంగా ఉంచాను. వాళ్ల వల్ల ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకుతుందని భయం ఒకటైతే, నా భయం గురించి వారికి తెలిసిపోతుందనేది మరో భయం.

ఓ ఐదేళ్లుగా నా ఓసీడీ ఆందోళనలు దాదాపుగా అదుపులో ఉన్నాయి. నా భయాలను ఎదుర్కోవటంలో, వాటిని అణచుకోవటంలో మరింత మెరుగయ్యాను. అర్థంచేసుకునే భాగస్వామి ఉండటం నాకు బాగా ఉపయోగపడింది.

చిత్రమైన విషయం ఏమిటంటే.. సూక్ష్మక్రిముల విషయంలో ముందు నుంచే ఆందోళన ఉన్నవారికి ఈ మహమ్మారి సమయంలో గతం కన్నా ఆందోళన తగ్గింది. బహుశా మిగతా వాళ్లు కూడా వీరిలాగానే ఆలోచించటమో, వీరిలాగానే ముందు జాగ్రత్తలు తీసుకోవటమో ఇందుకు కారణం కావచ్చు.

నా విషయంలో కూడా కొంతవరకూ ఇలాగే ఉంది. కానీ ఈ మహమ్మారి నాకు కొన్ని కొత్త సవాళ్లను విసిరింది. కొన్ని పాత భయాలను మళ్లీ తెచ్చిపెట్టింది.

సూక్ష్మక్రిములు మనిషి నుంచి మనిషికి సులభంగా సోకుతాయని.. రోడ్డు మీద పక్కగా నడిచి వెళ్లినా కూడా అంటుకుంటాయనే నిజాన్ని ప్రజారోగ్య హెచ్చరికలు పునరుద్ఘాటించాయి.

చేతులను శుభ్రం చేసుకునే మార్గదర్శకాలతో.. నా సింక్‌ను శుభ్రం చేయకుండా ఎన్నిసార్లు వదిలేశానో గుర్తుచేశాయి. ఇక సరుకులు అనేవి నా జీవితంలో మళ్లీ ముందుకొచ్చిన అతి పెద్ద సమస్యల్లో ఒకటి.

బయట ఉండి, వేరే వాళ్లు చేతులతో తాకిన సరుకులు కాకుండా.. ప్యాకెట్లలో పెట్టిన ఆహార సరుకులనే నేను ఎక్కువగా కొనేవాడిని. అంతకుమించి ఎక్కువగా పట్టించుకునే వాడిని కాదు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా.. పదేళ్ల కిందట నా మానసిక సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు తీవ్ర జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి మళ్లీ వచ్చింది.

ఇప్పుడు షాపు నుంచి సరుకులు తెచ్చిన వెంటనే ఇంట్లో పెద్దగా వాడని మూలకు తీసుకెళ్లి పెడతాను. చేతులు కడుక్కుంటాను. ఆ తర్వాత సరకులు ప్యాకెట్లను ఒక్కోదాన్ని డిసిన్ఫెక్టెంట్ కానీ, సోప్ వాటర్‌తో కానీ కడుగుతాను. అవి శుభ్రమయ్యాయనే నమ్మకం కలిగిన తర్వాత వేరే వరుసలో పెడతాను. మళ్లీ చేతులు కడుక్కుని ఆ సరుకులను కప్‌బోర్డులో కానీ ఫ్రిజ్‌లో కానీ పెడతాను. ఇవేవీ కొత్త అలవాట్లు కాదు. కానీ ఒకప్పుడు నేను శాశ్వతంగా పాతేయాలని అనుకున్న అలవాట్లు.

ఇప్పుడు కొత్త, తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నది నేను ఒక్కడినే కాదు.

మహమ్మారి మొదలైనప్పటి నుంచీ ప్రపంచమంతటా సంక్షోభాల్లో కౌన్సెలింగ్ కోసం ఫోన్ కాల్స్ విపరీతంగా పెరిగాయి. అమెరికాలో అయితే.. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవటానికి మానసిక ఆరోగ్య చికిత్స వ్యవస్థ సామర్థ్యం సరిపోదని కొందరు నిపుణులు హెచ్చరించారు. ఇక మానసిక ఆరోగ్య వ్యవస్థలు అంతగా అభివృద్ధి చెందని దేశాల గురించి అయితే ఏమీ చెప్పలేం.

కరోనావైరస్ విషయంలో చర్చ లాక్‌డౌన్లను సడలించటం మీదకు మరింత ఎక్కువగా మళ్లుతోంటో.. ఆందోళనకు గురికాకుండా శాంతంగా ఉండటం మరింత కష్టంగా ఉండొచ్చు.

షాపులు, ఆఫీసులు, స్కూళ్లు ఎప్పుడు తెరిచినా గానీ.. కోవిడ్-19 భూతం, దానివల్ల భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని నెలలు కొనసాగుతాయి.

అయితే ఇన్నేళ్ల నా అనుభవంలో.. ఆందోళనను నియంత్రించుకోగలమని నేను తెలుసుకున్నాను.

నాకు నమ్మకం ఉన్న మనుషులతో నా ఆలోచనల గురించి నెమ్మదిగా, స్వేచ్ఛగా మాట్లాడటం చాలా ఉపయోగపడింది.

టీనేజర్‌గా కెనడాలో, పెద్దయ్యాక బ్రిటన్‌లో.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనే చికిత్స కూడా తీసుకున్నాను. హేతుబద్ధతకు మించిపోయి ప్రమాదకర దశలోకి పెరిగిన ఆలోచనలు, చర్యలను గుర్తించి, వాటిని మార్చుకోవటానికి సాయపడే నైపుణ్యాలు ఈ కౌన్సెలింగ్ ద్వారా అందిస్తారు.

ప్రొఫెషనల్ కౌన్సిలర్ ద్వారా సీబీటీ నేర్చుకోవటం ఉత్తమం. ఎవరికైనా ఉపయోగపడే సొంతంగా ప్రయత్నించగల అంశాలూ కొన్ని ఉన్నాయి.

ఉదాహణకు.. మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే విషయాలన్నిటి జాబితా రాయటం. ఒక్కో అంశం గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనేది వివరంగా రాయాలి. ఆ తర్వాత ఆ జాబితా చూసి.. అందులో కొన్ని భయాలు అనవసరమైనవి, అధికంగా ఉన్నవి, పరిష్కరించదగ్గవి అనేది వాస్తవాల ప్రాతిపదికగా నిర్ధారించుకోవచ్చు.

లాక్‌డౌన్‌లో ఉన్న వారికి ఈ ఆందోళనలో.. ఆదాయం కోల్పోవటం, ఉద్యోగ భద్రత కోల్పోవటం, సామాజిక ఒంటరితనం, జీవితంలో ఆనందకర క్షణాలకు దూరమవటం వంటి పలు అంశాలు మిళితమై ఉండొచ్చు. ఆ ఆందోళనలు ఒక్కోదాన్ని వేరుగా గుర్తంచటం ద్వారా.. కొంత ఒత్తిడిని నివారించవచ్చునని నిర్ణయించుకోవచ్చు.

ఉదాహరణకు.. కుటుంబం, స్నేహితులతో తరచుగా వీడియో కాల్స్ చేసే ఏర్పాట్లు చేసుకోవటం ద్వారా, ప్రపంచం మళ్లీ సురక్షితంగా మారినపుడు ఓ పెద్ద హాలిడే పార్టీకి ప్రణాళిక రచించుకోవటం ద్వారా ఒంటరితనాన్ని ఎదుర్కోవచ్చు.

అన్నిటికీ మించి.. ఈ మహమ్మారిని ఎవరూ ఒంటరిగా ఎదుర్కోవటం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి మనం స్వయంగా ఒంటరితనంలో ఉండొచ్చు. కానీ ఇది మనమంతా కలిసి చేస్తున్నాం.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)