రెండో ప్రపంచ యుద్ధంలో ఎవరికీ పెద్దగా తెలియని 8 మంది మహిళా 'వార్ హీరోలు'

    • రచయిత, మార్క్ షీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుద్ధంలో హీరోలు ఎలా పని చేస్తారో మీరెప్పుడైనా ఊహించారా? ధైర్య సాహసాలతో యుద్ధంలో పోరాడిన పురుషులు, మహిళలనే హీరోలు అంటారని మీరు అనుకుంటూ ఉండచ్చు.

మీకు అలాంటి 8 మంది మహిళల గురించి చెప్పబోతున్నాం. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన వీరందరూ మిగతా లక్షలాది మంది కంటే భిన్నంగా ఒక అరుదైన ఉదాహరణగా నిలిచారు.

రెండో ప్రపంచ యుద్ధం యూరప్‌లో మే 8న ముగిసింది.

చాంగ్ బెన్హువా- మృత్యువును చిరునవ్వుతో ఆహ్వానించారు

చెంగ్ బెన్హువా ఒక శ‌త్రు సేన‌కు నాయ‌కురాలు. ఆమె 1937లో జపాన్‌ను చైనా ఆక్రమించిన సమయంలో జపనీయులతో పోరాడారు.

బాయినెట్లు తన శరీరాన్ని జల్లెడలా చేసేముందు తీసిన ఒక ఫొటోలో భయం లేని సైనికులకు ఆమె ఒక తిరుగులేని ఉదాహరణగా నిలిచారు.

ఈ ఫొటోను ఒక జపాన్ ఫొటోగ్రాఫర్ తీశాడు. అతడు అందులో చాంగ్ చివరి క్షణాలను కెమెరాలో బంధించాడు. ఈ యుద్ధంలో పోరాడుతూ పట్టుబడ్డ చాంగ్‌ను జైల్లో బంధించారు.

ఆమెను బంధించిన సైనికులు చాంగ్‌పై చాలాసార్లు సామూహిక అత్యాచారం చేశారు. కానీ వారు ఆమెను తుదిశ్వాస వరకూ భయపెట్టలేకపోయారు.

ఈ చిత్రంలో ఆమె మరి కొన్ని క్షణాల్లో చనిపోతున్నా, చిరునవ్వుతో కనిపిస్తారు. తన చేతులు కట్టుకుని, తలెత్తుకుని ఎలాంటి భయం లేకుండా కెమెరా లెన్స్ వైపు చూస్తుంటారు.

ఈ ఫోజే నాన్జింగ్‌లో ఆమెకు ఐదు మీటర్ల విగ్రహం ఏర్పాటు చేసేందుకు కారణమయ్యింది. నాన్జింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో దారుణ మారణహోమానికి ఒక ప్రత్యక్షసాక్షిగా నిలిచింది.

ఇక్కడ మూడు లక్షల మందికి పైగా చైనా పురుషులు, మహిళలను జపాన్ సైనికులు ఊచకోత కోశారు.

1938లో చాంగ్‌ను హత్య చేసినపుడు, ఆమె వయసు 24 ఏళ్లే. ఏడాది తర్వాత ఆ యుద్ధం యూరప్‌కు చేరింది.

చైనా చరిత్రకారుడు, మ్యూజియం డైరెక్టర్ ఫెన్ జియాంచువాన్ 2013లో పీపుల్స్ డెయిలీతో మాట్లాడుతూ.. “ఈ భీకర యుద్ధంలో చనిపోయిన లక్షల మందిలో చాంగ్ బెన్హువా అత్యంత గొప్ప వ్యక్తిత్వం కలవారు. ఆమె యుద్ధంలో త‌న‌దైన‌ ముద్ర వేశారు. అత్యంత గౌరవానికి అర్హులు” అన్నారు.

నూర్ ఇనాయత్ ఖాన్-ఒక గూడఛారి, రాజకుమారి

భారత రాకుమారి, బ్రిటిష్ గుడఛారి అయిన నూర్ ఇనాయత్ ఖాన్ మైసూర్‌లో 18వ శతాబ్దపు ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్ వంశస్థురాలు.

ఆమె తండ్రి భారతీయుడు, సూఫీ బోధకుడు. తల్లి అమెరికన్. నూర్ మాస్కోలో పుట్టారు. ఆమె విద్యాభ్యాసం పారిస్‌లోని సోర్బాన్‌లో జరిగింది.

ఆమెకు చాలా భాషలు తెలుసు. ఆ ప్రత్యేకతే బ్రిటిష్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్(ఎస్ఓఈ) ఆమె దగ్గరకే వచ్చేలా చేసింది. ఎస్ఓఈ అంటే ఆక్రమిత ఫ్రాన్స్ లో పనిచేసే అండర్ కవర్ ఏజెంట్లు.

ఈ ఏజెంట్లు ఆ ప్రాంతంలో నాజీల కార్యకలాపాలను అడ్డుకునేవారు. విధ్వంసం, అస్థిరత సృష్టించే ప్రయత్నాల్లో ఉండేవారు. దానితోపాటు వీరు వ్యతిరేక ఆందోళనలు చేసే ఫ్రాన్స్ వారితో లింకులు పెట్టుకునేవారు. నాజీ సైనికుల రాకపోకల గురించి రహస్య సమాచారం సేకరించేవారు.

నూర్ ఇనాయత్ ఖాన్ రేడియో ఆపరేటర్‌గా పనిచేసేవారు. ప్రమాదకరమైన పనులు చేసిన మొదటి మహిళ ఆమే. తాము ఉన్న ప్రాంతం ఎవరికీ తెలీకుండా వారు తరచూ తమ లొకేషన్ మార్చేవారు.

చివరికి ఆమెను నాజీ పోలీస్ గెస్టాపో పట్టుకున్నారు. విచారించేటపుడు దారుణంగా హింసించారు.

నూర్ చాలాసార్లు పారిపోయే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆమె పైకప్పు మీద నుంచి తప్పించుకోవడంలో దాదాపు సఫలం అయ్యారు.

కానీ, పారిపోవాలనే ఆమె ప్రయత్నాలన్నీ దారుణంగా ఫెయిలయ్యాయి. దాంతో ఆమె కఠిన శిక్షలు, విచారణ ఎదుర్కోవాల్సి వచ్చేది. అప్పటికీ ఓటమిని ఒప్పుకోని నూర్, నాజీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెబుతారు.

జర్మనీ సైనికులు మెడెలీన్ అనే ఆమె కోడ్ నేమ్ మాత్రం తెలుసుకోగలిగారు. ఆమె భారతీయురాలు అనే విషయం కూడా వారికి తెలీదు.

1944 సెప్టెంబర్‌లో ఇనాయత్ ఖాన్, మరో ముగ్గురు మహిళా ఎస్ఓఈ ఏజెంట్లను దాచావూ కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌కు పంపించారు. సెప్టెంబర్ 13న ఆమెను కాల్చి చంపారు.

ఇనాయత్‌ ఖాన్‌ సాహసాలకు ఆమెకు మరణానంతరం బ్రిటిష్ జార్జ్ క్రాస్, గోల్డ్ స్టార్ ఉన్న ఫ్రాన్స్ క్రోయిక్స్ డే గుయెరేతో గౌరవించారు.

ఆమె జ్ఞాపకార్థం లండన్‌లోని గార్డెన్ స్క్వేర్‌లో ఒక సమాధి కూడా కట్టారు.

శ్రావణి బాసు ‘స్పై ప్రిన్సెస్- ద లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’ పేరుతో ఒక పుస్తకం రాశారు. “నూర్ ఇనాయత్ ఖాన్ ఇప్పటికీ స్ఫూర్తిగా నిలిచారు. అసాధారణ వీరత్వానికి ఆమెను గుర్తు చేసుకోవమే కాదు, ఆమె ఏ సిద్ధాంతాల కోసం పోరాడారో వాటిని కూడా స్మరించుకుంటారు” అని ఆమె బీబీసీతో అన్నారు.

అయితే ఆమె సూఫీ. అహింసను నమ్మేవారు. కానీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటంలో నూర్ తన జీవితాన్నే త్యాగం చేశారు.

లుడ్‌మిలా పావ్లీచెంకో-లేడీ డెత్

లుడ్‌మిలా పావ్లీచెంకో.. చరిత్రలో అత్యంత విజయవంతమైన స్నైపర్లలో ఈమె ఒకరని చెబుతారు. 1941లో సోవియట్ యూనియన్ మీద నాజీలు దాడి చేసిన తర్వాత లుడ్‌మిలా స్వయంగా ఆ యుద్ధానికి వెళ్లారు. ఆమె తన రైఫిల్‌తో 309 మంది జర్మన్ సైనికులను కాల్చి చంపారనే రికార్డు కూడా ఉంది.

ఆమె గన్ బుల్లెట్ తగిలిన శత్రు సైనికుల్లో పదుల సంఖ్యలో స్నైపర్స్ ఉన్నారు. పిల్లీ-ఎలుక ఆటలో లుడ్‌మిలా వారిని చివరికి పైకి పంపేవారు. సెవాస్తాపోల్, ఓడెసా యుద్ధంలో అందరూ ‘లేడీ డెత్’ అని పిలుచుకునేంతగా లుడ్‌మిలా పాపులారిటీ పెరిగిపోయింది.

నాజీ స్నైపర్స్ ఆమెను టార్గెట్ చేయలేకపోయారు. కానీ లుడ్‌మిలా ఒక మోర్టార్ ఫైరింగ్‌లో గాయపడ్డారు. అయితే, ఆమె ఆ గాయం నుంచి కోలుకున్నప్పటికీ, ఫ్రంట్‌లైన్ నుంచి తొలగించారు. సోవియట్ యూనియన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు కూడగట్టడం కోసం ఆమె కీర్తిని ఉపయోగించుకున్నారు.

రెడ్ ఆర్మీ పోస్టర్ గర్ల్‌ గా ఆమె చాలా దేశాల్లో పర్యటించారు, అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ ను కూడా కలిశారు.

ఆమెకు ‘గోల్డ్ స్టార్ ఆఫ్ ద హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్’ గౌరవం కూడా లభించింది. కానీ తర్వాత ఆమె సాధించినవాటిని చరిత్ర నుంచి తొలగించారు.

జెండర్ ఈక్వాలిటీ యాక్టివిస్ట్, బ్రాడ్‌కాస్టర్ ఇర్యానా స్వావింస్కా బీబీసీతో మాట్లాడుతూ.. “ఒక అసాధారణ సామర్థ్యం ఉన్న మహిళా స్నైపర్‌కు ఆమె చనిపోయిన తర్వాత తగిన గౌరవం అందించకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం” అన్నారు.

“కానీ, రెండో ప్రపంచ యుద్ధం విషయానికి వస్తే సోవియట్ యూనియన్ దృష్టంతా తమ సాహసిక పురుష సైనికుల వరకే పరిమితమైంది. వార్ హీరోస్ పేరుతో ఏర్పడిన సమాధులన్నీ పురుష సైనికులవే కనిపిస్తాయి. ఈ మొత్తం నరేషన్‌లో మహిళలు ఎక్కడా కనిపించరు” అని ఆమె చెప్పారు.

నాన్సీ వేక్-ద వైట్ మౌస్

ఈమె వ్యక్తిత్వం చాలా సాహసోపేతమైనది. నాన్సీ వేక్‌కు ఒక భయంకరమైన ఫైటర్‌ ఇమేజ్ ఉండేది. ఆమె తన అందచందాలతో శత్రువులను ఊరించేదని, మద్యం తాగుతారని కూడా చెప్పుకుంటారు. నాజీలతో ఆమె శత్రుత్వం చాలా పాపులర్.

ఆమె న్యూజీలాండ్‌లో పుట్టినా పెరిగింది ఆస్ట్రేలియాలో. 16 ఏళ్ల వయసులో నాన్సీ స్కూల్ నుంచి పారిపోయారు. ఫ్రాన్స్ లో జర్నలిస్టుగా పనిచేశారు. ఆమె ఈ ఉద్యోగం కోసం చాలా అబద్ధాలు చెప్పారని అంటారు. ఆమెకు ఈజిఫ్ట్ చరిత్ర గురించి చాలా బాగా తెలుసు. దానిని రాయాలని కూడా అనుకునేవారు.

ఆమె ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫివోక్కాను పెళ్లి చేసుకున్నారు. 1939లో జర్మన్లు ఫ్రాన్స్ మీద దాడి చేసినపుడు, ఆమె మెర్సిలీలో ఉండేవారు.

ఫ్రాన్స్ వాసుల ప్రతిఘటనలో వేక్ కూడా భాగం అయ్యారు. వైమానిక దళాల సైనికులు సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోడానికి ఆమె సాయం చేశారు.

1942లో వేక్ నెట్‌వర్క్ ఆమెను మోసం చేసింది. ఆమె సమాచారం జర్మన్లకు అందింది. దాంతో ఆమె స్పెయిన్ మీదుగా బ్రిటన్ పారిపోయారు.

ఫివోక్కా ఫ్రాన్స్ లోనే చిక్కుకుపోవడంతో పట్టుబడ్డారు. నాజీలు ఆయన్ను టార్చర్ చేసి చంపేశారు. వేక్ తిరిగి ఫ్రాన్స్ చేరుకుని బ్రిటిష్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్(ఎస్ఓఈ) ఏజెంట్లతో కలిసి పనిచేయడం ప్రారంభించారు.

ఆ సమయంలో ఆమె ఎన్నో ప్రమాదకరమైన మిషన్లలో పాల్గొన్నారు. ఒకసారి ఒట్టి చేతుల్తో ఒక జర్మన్ సెంట్రీని చంపారు.

1990వ దశకంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె “ఎస్ఓఈలో నాకు జూడో-చాంప్ స్కిల్ నేర్పించారు. నేను దానిని బాగా ప్రాక్టీస్ చేశాను. కానీ ఆ నైపుణ్యాన్ని మొదటిసారి యుద్ధంలో ఉపయోగించాను. ఒకసారి సెంట్రీని చేతుల్తో చంపేశాను” అని చెప్పారు.

యుద్ధంలో చాలా కీలకమైన మిత్ర దేశాల రేడియో కోడ్స్ పోవడంతో ఆమె 500 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లి శత్రు ప్రాంతాల్లోకి చొరబడి దాని రీప్లేస్‌మెంట్ తీసుకురావాలని నిర్ణయించారు. ఆ పనిని మూడు రోజుల్లోనే పూర్తి చేశానని చెప్పారు.

ఆమె రహస్య సమాచారం సేకరించడానికి, అందంగా అలంకరించుకుని జర్మనీ సైనికులతో డేటింగ్‌కు కూడా వెళ్లేవారు.

ఒక ఆస్ట్రేలియా పత్రికతో మాట్లాడిన వేక్ “కాస్త పౌడర్ రాసుకుని, దారిలో కాస్త మద్యం తాగి నేను జర్మన్ పోస్టుల మధ్య నుంచి వెళ్లేదాన్ని. వారితో ‘మీరు నన్ను తనిఖీ చేయాలనుకుంటున్నారా అనేదాన్ని. అప్పుడు, నేను వారిని ఎంత ఊరించేదాన్నో” అన్నారు.

వేక్ బయోగ్రఫీ రాసిన పీటర్ ఫిట్జ్ సిమోన్స్ ఆమె చాలాసార్లు జర్మన్ల పట్టు నుంచి తప్పించుకున్నారు అని రాశారు.

తప్పించుకునే ఆమె కళను చూసి జర్మన్లు వేక్‌కు ‘వైట్ మౌస్’(తెల్ల చుంచు) అనే పేరు పెట్టారు. ఆమె జీవితచరిత్ర పేరు కూడా అదే.

వేక్‌కు యుద్ధం ముగిసిన తర్వాత చాలా అవార్డులు లభించాయి. ఆమె 98 ఏళ్ల వయసులో 2011 ఆగస్టు 7న లండన్‌లో చనిపోయారు. తన అస్థికలను ఫ్రాన్స్ తీసుకెళ్లాలని ఆమె కోరుకున్నారు.

జెన్ వాయ్లే- రిపోర్టర్, గూడఛారి, రాజకీయవేత్త

జెన్ వాయ్లే రిపబ్లికన్ ఆఫ్ కాంగోలో పుట్టారు. కానీ ఆమె చిన్నతనంలోనే పారిస్ వచ్చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు జర్నలిస్టుగా పనిచేసేవారు.

వాయ్లే పారిస్ వదిలేసి, ఫ్రాన్స్ ప్రతిఘటనలో ఒక సీక్రెట్ ఏజెంట్‌గా చేరారు. ఆమె ఫ్రాన్స్ దక్షిణ భాగంలో పనిచేసేవారు. అప్పటికి ఆ ప్రాంతం జర్మనీ అధీనంలోకి రాలేదు. అక్కడ విచీ నామమాత్రపు ప్రభుత్వం ఉండేది.

జెన్ నాజీ సైనికుల రాకపోకల గురించి రహస్య సమాచారం సేకరించేవారు. దానిని మిత్ర దేశాలకు చేరవేసేవారు.

శత్రువులు ఆమెను 1943 జనవరిలో పట్టుకున్నారు. ఆమెపై దేశద్రోహం ఆరోపణలు మోపారు.

అయితే ఆమె రహస్యాలు ఎవరికీ అంతుపట్టలేదు. ఎందుకంటే ఆమె ఎవరూ చదవలేని విధంగా తన డేటాను కోడ్‌లో మార్చుకునేవారు.

వాయ్లేను కూడా మొదట కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌కు పంపించారు. ఆ తర్వాత ఆమెను మెర్సిలేలోని మహిళల జైల్లో పెట్టారు. కానీ, ఆమె అక్కడి నుంచి పారిపోవడమో లేదంటే విడుదల చేయడమో జరిగింది. దాంతో జెన్ యుద్ధం తర్వాత సజీవంగా ఉన్నారు.

ఆమెను 1947లో ఫ్రాన్స్ సెనేట్‌కు ఎన్నుకున్నారు.

హేడీ లామార్-హాలీవుడ్ అందాలరాశి

హేడీ లామార్ ఆస్ట్రియాలో పుట్టారు. ఆమె సినీ కెరీర్ అద్భుతంగా ఉండేది. ఆ రంగంలో హేడీకి చాలా పేరు లభించింది. హాలీవుడ్‌ అగ్రతార అయిన హేడీకి ఆరుగురు భర్తలు.

పుట్టినపుడు ఆమెకు హెడ్‌విగ్ ఈవా మారియా కీస్లర్ అనే పేరు పెట్టారు. ఆమె ఆస్ట్రియాలోని వియన్నాలో ఒక సంపన్న యూదు కుటుంబంలో పుట్టారు.

మొట్టమొదట ఆమె ఒక ఆయుధాల డీలర్‌ను పెళ్లాడారు. ఆమె మొదట్లో తన యాక్టింగ్ కెరీర్ పట్ల అసంతృప్తితో ఉండేవారు. ఆమె స్నేహితులకు, సహచరులకు తనను హోస్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆమె స్నేహితుల్లో నాజీలు కూడా ఉండేవారు.

లామార్ ఆ పనిలో ఉండలేకపోయారు. రహస్యంగా పారిపోయి మొదట పారిస్, తర్వాత లండన్ చేరుకున్నారు.

అక్కడ ఆమె ఎంజీఎం స్టూడియోస్ హెడ్, లెజండరీ లూయిస్ బి.మేయర్‌ను కలిసారు.

ఆయన ఆమె హాలీవుడ్‌లోకి రావడానికి ఆఫర్ ఇచ్చారు. హేడీకి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా పాపులారిటీ తెచ్చారు.

ఆమె నటించిన 30కి పైగా సినిమాలు హేడీకి పాపులారిటీ తీసుకొచ్చాయి. కానీ, ఆమెకు అసలు పేరు వచ్చింది మాత్రం ఆవిష్కర్తగానే. అందుకే ఆమెకు ఈ లిస్టులో స్థానం లభించింది.

మిత్ర దేశాల కోసం లామార్ ఒక గైడెన్స్ సిస్టమ్ రూపొందించారు. దానిని టార్పెడోల కోసం ఉపయోగించేవారు. శత్రువులు ఫ్రీక్వెన్సీ మార్చేసి టార్పిడోలను జామ్ చేయకుండా ఆమె గైడెన్స్ సిస్టమ్ ఉపయోగపడింది.

ఆమె ఆవిష్కరణ ఫలాలను ఇప్పుడు బ్లూటూత్, వైఫై టెక్నాలజీలో కూడా చూడవచ్చు.

మ్యా యీ-కత్తి, విషం ఉపయోగించిన సాహసి

మ్యా యీ పోరాటం రెండో ప్రపంచ యుద్ధంలో జపనీయులు బర్మాపై దాడి చేయడానికి ముందే మొదలైంది.

ఆమె దేశ స్వాతంత్ర్యం కోసం తీవ్రంగా పోరాడిన వారిలో ఒకరు. బ్రిటిష్ వలసవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు.

ఆమె రెండో ప్రపంచ యుద్ధంలో ప్రతిఘటన శక్తులతో చేరారు. ఆమె చేతిలో ఎప్పుడూ కత్తి ఉండేది, ఒక సీసాలో విషం కూడా ఉంచుకునేవారు.

1944లో ఆమె కాలినడకన శత్రువులు ఉన్న ప్రాంతాలకు చేరుకున్నారు. అదే సమయంలో మ్యా యీ అప్పట్లో బ్రిటన్ అధీనంలో ఉన్న భారత్‌కు వచ్చారు. ఇక్కడ నుంచే జపనీయులతో యుద్ధం చేశారు.

ఆమె యుద్ధంలో అయిన గాయాలకు తన ధోవతినే చించి కట్టు కట్టుకునేవారు. పురుషుల సాయం కూడా తీసుకునేవారు కాదు.

ఆమె భారత్‌, బర్మాలో జపనీయులకు వ్యతిరేకంగా సిద్ధం చేసిన కరపత్రాలు పంచారు. వాటిలో జపాన్ పాలకులు ఎంత దుర్మార్గులో, బర్మా ప్రజలతో ఎంత ఘోరంగా ప్రవర్తించారో చెప్పారు.

అయితే, మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఆమె తన భర్తతో కలిసి తిరిగి బర్మా వెళ్లిపోవాలని అనుకున్నారు. మ్యా యీ పారాచ్యూటర్‌ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. కానీ చివరి సమయంలో ఆమె తన సీటును మరో ఫైటర్ కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఆమె చివరికి 1945లో యుద్ధం ముగిసిన తర్వాత బర్మా చేరుకోగలిగారు.

ఆ తర్వాత కూడా ఆమె పోరాటం కొనసాగింది. ఆమె స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకిస్తూ పోరాడారు.

రసూనా సయ్యద్-ఒక వెలుగు

ఈ యుద్ధం జరిగిన సమయంలో రసూనా సయ్యద్‌ శత్రు దేశాలతో చాలా మామూలుగా కలిసి పనిచేశారనే ఒక అపవాదు ఉంది.

ఆమె ఇండోనేషియా స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖచిత్రంగా ఉన్నారు. జపనీయులకు బదులు ఇండోనేషియాలోని డచ్ వలసవాదులు ఆమెకు శత్రువులుగా మారారు.

సయ్యద్ చాలా చిన్న వయసు నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆమె 20 ఏళ్ల వయసులోనే ఇండోనేషియా ముస్లిం అసోసియేషన్ పేరుతో పెరమీ అనే పార్టీ ఏర్పాటుచేశారు. అది ఆమె మతం, జాతీయత ఆధారంగా ఏర్పటైంది.

సయ్యద్ అద్భుతంగా ప్రసంగించేవారు. ఆమె మాట్లాడుతుంటే పట్టపగలే పిడుగులు పడుతున్నట్లు ఉండేదని సయ్యద్ జీవిత చరిత్రలో రాశారు. డచ్ వలసపాలనలో అధికారులను విమర్శించే సాహసం కూడా ఆమెకు పేరు తెచ్చింది.

డచ్ అధికారులు తరచూ ఆమె ప్రసంగాలను మధ్యలోనే ఆపించేవారు. ఒకసారి ఆమెను 14 నెలలు జైల్లో కూడా పెట్టారు.

జపనీయులు 1942లో ఆర్చిపేలాగోపై దాడి చేసినపుడు, సయ్యద్ ఒక జపాన్ మద్దతు సంస్థతో కలిశారు. కానీ ఆమె దానిని తన స్వాతంత్ర్య పోరాటం ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగించారు.

ఇక ఇండోనేషియా విషయానికి వస్తే జపనీయుల ఓటమి తర్వాత కూడా యుద్ధం ఆగలేదు. అక్కడి డచ్ అధికారులు మళ్లీ తమ పాలన బలోపేతం చేసుకోవాలని ప్రయత్నించారు.

మొదట, ఆమె వారిని తరిమికొట్టేందుకు బ్రిటిష్ సాయం తీసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు రక్తపాత యుద్ధం మొదలైంది.

చివరికి డచ్ వారు 1949లో ఇండోనేషియాకు స్వాతంత్ర్యం ఇచ్చాక ఈ యుద్ధం ముగిసింది.

ఈ పోరాటంలో సయ్యద్ పాత్రను చాలామంది గుర్తు చేసుకుంటారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రధాన మార్గానికి ఆమె పేరే పెట్టారు.

లింగ సమానత్వం కోసం, మహిళా విద్య కోసం ఆమె చాలా మద్దతు ఇచ్చారు. ఇండోనేషియాలో నేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న కొంతమంది మహిళల్లో రసూనా సయ్యద్ ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)