You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ఇటలీలో 366కు చేరిన మృతుల సంఖ్య... 7 వేలు దాటిన కేసులు
ఇటలీలో కరోనావైరస్ వల్ల ఒక్క రోజులోనే 133 మంది మరణించారు. దీనితో కలిపి దేశంలో ఇప్పటివరకు 366 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ
ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య కూడా 5,883 నుంచి 7,375కు అంటే 25 శాతం పెరిగిందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది.
రోజు రోజుకూ పరిస్థితి తీవ్రం అవుతుండడంతో లోంబార్డీతో పాటు 14 ప్రావిన్సులలో కోటి 60 లక్షల మందిని క్వారెంటైన్ అంటే నిర్బంధంలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతాల వారు ఎక్కడికైనా ప్రయాణించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఇటలీలోని మిలాన్, వెనిస్ రెండూ కరోనావైరస్ బాధిత ప్రాంతాలే. దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, నైట్ క్లబ్‌లు అలాగే ఇతర అన్ని వేదికల్ని మూసేయాలని ప్రధాని జుసెప్పే కాంటే ఆదేశించారు. ఏప్రిల్ మూడో తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది.
నాలుగో వంతు జనాభాపై కరోనా ప్రభావం
యూరోప్ మొత్తంలో అత్యధికంగా కరోనావైరస్ కేసులు ఇటలీలోనే నమోదయ్యాయి. శనివారం నాటికి కేసుల సంఖ్య మరింత పెరిగింది కూడా. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన నిర్బంధం ఇటలీ జనాభాలో దాదాపు నాల్గోవంతుపై ప్రభావం చూపిస్తోంది.
అది కూడా దేశ కేంద్ర స్థానం కావడంతో ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇటలీలో మృతుల సంఖ్య 366కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లోనే 133 మంది ప్రాణాలు కోల్పోయారు.
"మా ప్రజల ఆరోగ్యానికి మేం భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. మేం తీసుకున్న చర్యల కారణంగా కొన్ని సార్లు చిన్న చిన్న త్యాగాల నుంచి మరి కొన్ని సార్లు పెద్ద పెద్ద త్యాగాలు కూడా చెయ్యాల్సి ఉంటుంది." అని ప్రధాని కొంటే అన్నారు.
కానీ "మన విషయంలో మనం బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇదే" అని కొంటే వ్యాఖ్యానించారు .
గత వారంలోనే దేశంలోని అన్ని పాఠశాలలను, కాలేజీలను, విశ్వ విద్యాలయాలను పది రోజుల పాటు మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే ఆలస్యమయ్యిందా?
బీబీసీ రోమ్ ప్రతినిధి మార్క్ లోవన్ విశ్లేషణ
కరోనావైరస్ విషయంలో వారం క్రితమే ప్రభుత్వం ఈ స్థాయిలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఒక వేళ కేసుల సంఖ్య తగ్గి ఉంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించి ఉండేవి. కానీ అలా జరగలేదు.
బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. నిజానికి ఇదే అత్యంత నాటకీయ పరిణామం. అలాగని బాధిత ప్రాంతాలను పూర్తిగా లాక్ డౌన్ చెయ్యలేదు. విమానాలు, రైళ్లు ఇప్పటికీ తిరుగుతునే ఉన్నాయి. అలాగే అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలకు అనుమతులు ఇస్తునే ఉన్నారు. అయితే ప్రజల్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు..? ఎందుకు వెళ్తున్నారన్న విషయాన్ని పోలీసులు ప్రశ్నించవచ్చు.
చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందా ..? ఇదే అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇటలీలో కరోనావైరస్ ప్రభావం కొద్ది వారాల క్రితం నుంచే మొదలయ్యింది. ప్రస్తుతం దేశంలో 22 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చైనా తర్వాత అత్యంత కఠినమైన తీవ్ర మైన చర్యల్ని తీసుకుంటోది ఇటలీ. కానీ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వంటిదేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇళ్లకే పరిమితమైన కోటి పైగా ప్రజలు
ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా సుమారు లోంబర్డేలోని ఉత్తర ప్రాంతంలో ఏ ఒక్కరూ అడుగు పెట్టలేరు. అలాగే అక్కడ నుంచి బయట ప్రాంతాలకు రాలేరు.
అత్యవసర సమయాల్లో తప్ప సుమారు కోటి మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ ప్రాంతంలో అతి ముఖ్యమైన నగరం మిలాన్. అక్కడ సుమారు 14 ప్రాంతాలు కరోనావైరస్ ప్రభావానికి లోనయ్యాయి.
ఆరోగ్య పరమైన లేదా ఉద్యోగ పరమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవ్వరూ బయటకు వచ్చే వీలు లేదని ప్రధాని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఉత్తర ఇటలీలో నివసిస్తున్న 50 వేల మందిపై మాత్రమే ఈ నిర్బంధం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తోంది.
పెళ్లిళ్లు ఆగిపోయాయి
వైరస్ ధాటికి పెళ్లిళ్లు , వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తాతాల్కికంగా నిలిచిపోయాయి. నైట్ క్లబ్బులు, వ్యాయామశాలలు, రిసార్టులను ఇప్పటికే మూసేశారు .
నిర్బంధంలో ఉన్న ప్రాంతాల్లోని రెస్టారాంట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు మాత్రమే అనుతిస్తున్నారు.
అలాగే అందులో కూర్చొనే కస్టమర్ల మధ్య దూరం కనీసం 3 అడుగులు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గృహ నిర్బంధాన్ని బయటకొస్తే 3 నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రావచ్చు.
వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటలీకి సూచించింది.
ఈ విషయంలో చైనా తీసుకున్న చర్యల్ని ప్రశంసించింది.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి మీ పిల్లలకు ఎలా చెప్పాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- ప్రెస్ రివ్యూ: ‘‘మోదీజీ... మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా!’’ - ట్విటర్‌లో ఎనిమిదేళ్ల ఉద్యమకారిణి
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)