You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆసియా బీబీ: జైల్లో గార్డులు నా మెడకు గొలుసు బిగించి కుక్కలా ఈడ్చుకెళ్లారు
పాకిస్తాన్‌లో దైవదూషణ కేసులో దోషిగా తేలి మరణ శిక్ష పడిన క్రైస్తవ మహిళ ఆసియా బీబీ తాను స్వేచ్ఛగా బయటకొస్తానని ఎప్పుడూ నమ్మేదాన్నని చెప్పారు.
ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఆమె బీబీసీతో మాట్లాడుతూ ఏనాటికైనా తాను మళ్లీ పాకిస్తాన్ రాగలుగుతానని అనుకుంటున్నానన్నారు.
ఫ్రెంచ్ జర్నలిస్ట్ 'అన్నె ఇసబెల్లె టోలెట్'తో కలిసి ఆసియా బీబీ ఇటీవల 'చివరికి స్వేచ్ఛ దొరికింది' (ఎన్ఫిన్ లిబర్) అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
తన జైలు అనుభవాలు, గార్డుల కర్కశ ప్రవర్తన వంటివన్నీ అందులో ఆమె రాసుకొచ్చారు. ఓసారి తన మెడకు పట్టీ బిగించి చైన్లు కట్టి ఈడ్చుకెళ్లి గార్డులు ఎలా చిత్రహింసలు పెట్టారో ఆమె వర్ణించారు.
అయితే, పాకిస్తాన్ అధికారులు మాత్రం ఆమె ఆరోపణలను ఖండిస్తూ ఆమె నమ్మశక్యం కాని మాటలు చెబుతున్నారన్నారు.
ఆసియా బీబీ ఎవరు?
ఆసియా బీబీ అసలు పేరు ఆసియా నోరీన్. 2009 జూన్‌లో కొందరు మహిళలతో జరిగిన వాదనల అనంతరం ఆమెపై దైవదూషణ కేసు నమోదైంది.
ఏడాది తరువాత ఆమెకు మరణశిక్ష పడింది. పాకిస్తాన్ దైవదూషణ చట్టాల ప్రకారం మరణశిక్ష పడిన తొలి పాకిస్తానీ మహిళ ఆమె. ఆమెకు మరణశిక్ష పడడంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
2018లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆమె మరణ శిక్షను రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌లోని మత ఛాందసులు హింసాత్మక నిరసనలకు దిగారు.
తన కొత్త పుస్తకం ప్రమోషన్ కోసం ఫ్రాన్స్ వచ్చిన ఆసియా బీబీ అక్కడ 'బీబీసీ'తో మాట్లాడారు. 2009లో పొరుగింటివారితో జరిగిన గొడవ సందర్భంగా కొంతమంది మహిళలంతా కలిసి తాను మహ్మద్ ప్రవక్తను అవమానించానని ఆరోపించారని గుర్తు చేసుకున్నారు ఆసియా బీబీ.
''అప్పటికి నా భర్త పనిపై వెళ్లారు. పిల్లలు స్కూలుకి వెళ్లారు. నేను పెరట్లో పండ్లు కోయడానికి వెళ్లాను. అప్పుడు ఒక గుంపు వచ్చి నన్ను పక్కకు లాగి నన్ను దూషించింది. నేనప్పుడు నిస్సహాయంగా మిగిలిపోయాను'' అన్నారామె.
తనను ఉరితీయాలని డిమాండ్ చేసిన ఇతర ఖైదీల మధ్య జైలులో తాను బతుకుపై భయంతో గడిపానని ఆమె తన పుస్తకంలో రాసుకొచ్చారు.
''నేను ఊపిరి తీసుకోలేను'' అని రాశారామె. ''నా మెడకు ఒక పట్టీ బిగించారు.. దాని తాళం గార్డు దగ్గర ఉంటుంది.. ఆ పట్టీని ఎంత గట్టిగా బిగించాలంటే అంత గట్టిగా బిగించగలడతను. ఆ పట్టీకి ఒక పొడవైన చైను ఉండేది.. అది గార్డు చేతిలో ఉండేది. నన్ను కుక్కలా ఈడ్చుకెళ్లడానికి ఆ చైను పనికొచ్చేది''
''నీ మత విశ్వాసాలను మార్చుకుంటే వదిలేస్తామని చెప్పారు. కానీ, నేను నిరాకరించాను. నా నమ్మకాల కోసం జైలులో ఉంటాను'' అన్నారామె.
''నా కష్టాలకు ముగింపు దొరకాలని ప్రపంచమంతా నా కోసం ప్రార్థిస్తోందని నా భర్త నాకు చెప్పారు. పోప్ కూడా నా కోసం ప్రార్థించారని తెలుసుకుని సంతోషించాను. వారందరి ప్రార్థనల ఫలితంగా నాకు విముక్తి దొరుకుతుందని అనిపించింది.''
నిర్దోషులను విడిచిపెట్టాలి
అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, దైవదూషణ కేసుల్లో దోషులను విడిచిపెట్టాలని.. ఆరోపణలపై సక్రమంగా దర్యాప్తు చేయాలని ఆమె పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు.
''అమాయకులను నిష్కారణంగా శిక్షించరాదు, నిర్దోషులైనప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నవారిని విడిచిపెట్టాలి'' అన్నారామె.
తనకు కఠిన పరీక్షలు ఎదురైనప్పటికీ పాకిస్తాన్ అంటే తాను సానుకూలంగానే ఉన్నానని... ఏదో ఒక రోజు స్వదేశానికి వెళ్తాననుకుంటున్నానని ఆమె అన్నారు.
''అక్కడ ప్రమాదం ఉండడంతో నాకు నేనుగానే పాకిస్తాన్ నుంచి వచ్చేశాను. అక్కడుంటే నాకు ఎప్పుడేం జరిగేదో తెలియదు. కానీ, ఇప్పటికీ నా గుండెల్లో నా దేశంపై ప్రేమ ఉంది. నేనక్కడికి తిరిగి వెళ్లే రోజు కోసం చూస్తున్నాను'' అన్నారామె.
తాను జైలులో ఉన్నప్పుడు తనకు సహాయపడేందుకు ప్రయత్నించిన షాబాజ్ భట్టీ, సల్మాన్ తసీర్‌లు హత్యకు గురవడంపైనా కలిగిన వేదనను గుర్తు చేసుకున్నారు.
''నేనెంతో ఏడ్చాను. వారి కోసం వారం రోజులకు పైగా ఏడ్చాను. ఇప్పటికీ నా హృదయమంతా వేదనతోనే ఉంది. వారిని మిస్సవుతున్నాను'' అన్నారామె.
కానీ, తనను చంపమని డిమాండ్ చేసిన ఎవరిపైనా తనకు కోపం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ''నాకెవరిపైనా కోపం లేదు, నాలో సహనం ఉంది, కాఠిన్యం లేదు. నా పిల్లలను వదిలి ఉన్న తరువాత సహనం అలవాటైంది. నేనిప్పుడు అందరినీ క్షమించాను'' అన్నారామె.
పాకిస్తాన్ క్రైస్తవుల పరిస్థితి..
* పాక్ జనాభాలో 1.6 శాతం క్రైస్తవులు ఉన్నారు.
* వీరిలో అత్యధికులు బ్రిటిష్ పాలనా కాలంలో క్రైస్తవంలోకి మారిన హిందువుల వారసులే.
* నిమ్న కులాలవారిగా ఉండడం ఇష్టం లేక మతం మారినవారే అధికం.. వీరిలో చాలామంది పేదలు.
* అఫ్గానిస్తాన్‌లో అమెరికా నేతృత్వంలో సాగిన యుద్ధంపై ఆగ్రహం వల్ల ఇలా క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
పాకిస్తాన్‌లో దైవదూషణ చట్టాలు ఏం చెబుతున్నాయి
పాక్‌లో దైవదూషణ కేసుల్లో అరెస్టయిన వారిలో అత్యధికులు ముస్లింలు, తమను తాము ముస్లింలుగా చెప్పుకొనే అహ్మదీ సమాజానికి చెందినవారు.
1990 నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవులనూ ఈ కేసుల్లో దోషులుగా తేల్చారు.
సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ (సీఎస్‌జే) గణాంకాల ప్రకారం 1987 నుంచి 2017 వరకు మొత్తం 720 మంది ముస్లింలు, 516 మంది అహ్మదీలు, 238 మంది క్రైస్తవులు, 31 మంది హిందువులను దైవదూషణ చట్టంలోని వివిధ నిబంధనల కింద నిందితులుగా తేల్చారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో దైవదూషణ చట్టాలున్నాయని.. పాక్‌లో ఇలాంటి కేసులన్నీ కోర్టు ముందుకు వస్తాయని, తగిన విధానంలో వాటిని విచారిస్తారని అక్కడి అధికారులు చెబుతున్నారు.
తమ దేశంలో అల్ప సంఖ్యాక వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పాక్ అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- ఐసన్‌హోవర్ నుంచి ఒబామా వరకు.. భారత్‌లో అమెరికా అధ్యక్షుల పర్యటనలు ఇలా సాగాయి...
- రాయలసీమలో ‘రత్నాల’ వేట
- ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది
- ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ ఇదే
- సీఏఏ-ఎన్ఆర్సీ: పెళ్లి, పుట్టినరోజు సర్టిఫికెట్ల కోసం హైదరాబాద్‌లో దరఖాస్తుల వెల్లువ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)