ట్విన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్: ఒకేచోట చేరిన 14 వేల కవలలు.. ఎక్కువ మంది రావటంతో రసాభాసగా మారిన కార్యక్రమం

అత్యధికమంది కవలలు ఒకేచోట నిలబడి ప్రపంచ రికార్డు సష్టించాలనుకున్నారు. అయితే, అనుకున్న రికార్డు సంఖ్య కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ మంది రికార్డు స్థాయిలో రావటంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది.

'శ్రీలంక ట్విన్స్' అనే కార్యక్రమం నిర్వాహకులు గిన్నిస్ ప్రపంచ రికార్డు సష్టించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొలంబోలోని మైదానాన్ని ఎంచుకున్నారు. సోమవారం దేశంలోని కవలలంతా స్టేడియం వద్దకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఎక్కువ మంది కవలలు ఒకేచోట కలిసిన రికార్డు తైవాన్‌లో 1999లో నమోదైంది.

అప్పుడు.. 3961 కవల జంటలు, ఒకేసారి పుట్టిన ముగ్గురు పిల్లల జంటలు 37, ఒకేసారి పుట్టిన నలుగురు పిల్లల జంటలు నాలుగు ఒకేచోటుకు వచ్చి, కలిశాయి.

ఆ రికార్డును అధిగమించేందుకు, సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు ఈసారి 5000 జంటల కవలలు వస్తారని నిర్వాహకులు అనుకున్నారు.

అయితే, స్టేడియం వద్దకు దాదాపు 14 వేల జంటల కవలలు వచ్చారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

వీరంతా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు భారీ క్యూ లైన్లలో నిలబడ్డారు.

ప్రతి ఒక్కరూ తమతమ పుట్టిన తేదీ సర్టిఫికెట్లను చూపించాలి. వాటిని నిర్వాహకులు తనిఖీ చేయాలి.

తర్వాత కవలల్ని ఫొటో తీస్తారు. ఆ తర్వాత కనీసం ఐదు నిమిషాలు నిలబడాలి.

ఇలా ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావటంతో నిర్వాహకులు చేతులెత్తేశారు.

రికార్డు నెలకొల్పేందుకు చేపట్టిన కార్యక్రమానికి రికార్డు స్థాయిలో కవలలు రావటంతో వారందరినీ ధృవీకరించే వ్యవహారం ఆలస్యమైంది.

ఇలా స్టేడియంకు వచ్చిన వారిలో ఇద్దరు శ్రీలంక ఆర్మీ జనరల్స్.. జయంత సెనెవిరత్నే, పూరక సెనెవిరత్నేలు... సైన్యంలో కవలల దళానికి నాయకత్వం వహించారు.

ఎక్కువ మంది రావటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ పెట్టిన నియమ నిబంధనల్ని పాటించలేకపోయామని నిర్వాహకులు చెప్పారు.

అయితే, ఈ ప్రయత్నం రికార్డుకు అర్హత సాధించిందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు పడుతుంది.

ఒకవేళ రికార్డు సాధ్యపడకపోతే మళ్లీ మరో కార్యక్రమం ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

సోమవారం స్టేడియానికి వచ్చిన వారిలో చాలామంది కూడా మళ్లీ ఈ కార్యక్రమం పెడితే ఆనందంగా వస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)