You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తైవాన్‌లో 9 గంటల పాటు కనిపించిన హరివిల్లు
ఆకాశంలో హరివిల్లు కనిపిస్తే ఎంతసేపైనా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అయితే, ఆ సప్తవర్ణాల సోయగం మనకంత అవకాశం ఇవ్వదు.
ఇంద్రధనుస్సు కనిపించడమే చాలా అరుదు.. చిరుజల్లులు, మంచు తుంపరలు కురిసే సమయంలో ఎండ కూడా ఉంటేనే ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. అది కూడా కొన్ని నిమిషాలే.
కానీ, గత వారం చైనీస్ కల్చర్ యూనివర్సీటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు మాత్రం ఏకంగా 9 గంటల పాటు ఆకాశంలో అలాగే నిలిచిపోయిన ఈ అందాన్ని తిలకించారు.
నవంబరు 30న కనిపించినట్లుగా చెబుతున్న ఈ అరుదైన దృశ్యాన్ని ప్రొఫెసర్ చౌ కున్ సుయాన్, లీ చింగ్ హ్యుయాంగ్‌లు తమ బృందంతో కలిసి కెమరాల్లో బంధించారు.
తైపీలోని కొండల్లో విరిసిన ఈ ఇంద్రధనుస్సు అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 6.57 నుంచి మధ్యాహ్నం 3.55 నిమిషాల వరకు మొత్తం 8 గంటల 58 నిమిషాల పాటు కనిపించింది.
ఇవి కూడా చదవండి:
పాత రికార్డు చెరిగిపోయినట్లేనా
ఈ ఇంద్రధనుస్సు గత రికార్డులన్నీ చెరిపేసినట్లేనని చైనీస్ కల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు 1994 మార్చి 14న ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో కనిపించిన ఇంద్రధనుస్సే అత్యంత సుదీర్ఘ సమయం కనిపించిందిగా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది.
తాజా ఇంద్రధనుస్సుకు సంబంధించి 10 వేల చిత్రాలను తీసిన చైనీస్ కల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు దీన్ని రికార్డు కోసం గిన్నిస్ బుక్‌కు ప్రతిపాదిస్తున్నారు.
ఇది ఏర్పడినప్పటి నుంచి కనుమరుగైన వరకు వరుసగా ఫొటోలు తీశామని, కచ్చితంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దీన్ని గుర్తిస్తుందని వారు నమ్మకం కనబరుస్తున్నారు.
కాగా ఈశాన్య రుతుపవనాల కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, అదేసమయంలో తగినంత సూర్యరశ్మి ఉండడం.. సెకనుకు 2.5 నుంచి 5 మీటర్ల వేగంతో అత్యంత నెమ్మదిగా గాలి వీయడం వంటి వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలించి ఇలా ఇంద్రధనుస్సు చాలాసేపు కనిపించిందని ప్రొఫెసర్ చౌ కున్ సుయాన్ తెలిపారు.
తైపీలోని యాంగ్‌మింగ్‌షాన్ పర్వతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు చాలా సాధారణమే. చైనీస్ కల్చర్ యూనివర్సిటీ ఇక్కడే ఉండడంతో వారికి దీన్ని చూసే అవకాశం దక్కింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)