You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పోలవరంలో కాంక్రీటు గిన్నిస్ రికార్డు ఎలా సాధ్యపడింది? ఇంత కాంక్రీటు పోశారని ఎలా లెక్కిస్తారు?
- రచయిత, రిపోర్టర్: బళ్ల సతీశ్, ఫొటోలు: నవీన్ కుమార్ కె
- హోదా, బీబీసీ ప్రతినిధులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. అయితే, అవి ఎలా సాధ్యమయ్యాయి?
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని విషయాలను రికార్డు చేస్తుంది. దానికోసం ముందుగా సంస్థను సంప్రదిస్తే, పరిశీలన తరువాత నియమిత తేదీల్లో తమ ప్రతినిధులనూ, ఆయా రంగాల నిపుణులనూ పంపిస్తుంది.
ఏదైనా ఒక నిర్మాణానికి నిరంతరంగా కాంక్రీటు పోసిన రికార్డు దుబాయిలో ఒక భవనానికి ఉంది. ఇప్పుడు అది పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకుగానూ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీకి వచ్చింది.
2017లో దుబాయిలో ఒక భవనానికి నిరంతరంగా 21 వేల 580 ఘనపు మీటర్లు (క్యూబిక్ మీటర్లు) కాంక్రీటు పోశారు.
దీన్ని తిరగరాస్తూ జనవరి 7వ తేదీన పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు రికార్డులు వచ్చాయి. 24 గంటల్లో 32,315.5 ఘనపు మీటర్ల కాంక్రీటు పోసిన రికార్డు ఒకటి. నిరంతరాయంగా అత్యధిక సమయం పాటూ కాంక్రీటు పోయడం అనే మరో రికార్డు వచ్చాయి.
ఈ కాంక్రీటును 325 బ్లాకుల్లో పోశారు. దీని బరువు 72 వేల టన్నులు. ఇందుకు 2 లక్షల సిమెంటు బస్తాలు వాడారు.
కాంక్రీటు ఎక్కడ పోశారు?
పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే స్పిల్ చానల్‌లో ఈ కాంక్రీటు పోశారు. రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని వదలేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణమే స్పిల్ వే. ఆ నీరు పారే ప్రాంతంలో ముందే సిద్ధం చేసిన ఖాళీల (బ్లాక్స్)లో ఈ కాంక్రీటు పోశారు.
ఇంత కాంక్రీటు పోశారని ఎలా లెక్కిస్తారు?
ముందుగా సిద్ధం చేసిన ముడి సరుకును... అంటే ఇసుక, సిమెంటు, కంకరను మిక్సర్ (బాచింగ్ ప్లాంట్)లో వేసే ముందు అవి ఎంత పరిమాణంలో ఉన్నాయో కొలిచారు. కాంక్రీటు సిద్ధమైన తరువాత అక్కడి నుంచి బయటకు వచ్చిన మొత్తం ఎంతో చూస్తారు. వాటిని కాంక్రీట్ మిక్సర్ లారీలు ఎక్కించాక ఎన్ని బండ్లు వెళ్లాయో చూస్తారు. ఇవి కాకుండా కాంక్రీటు పోసే స్థలం కూడా తీసుకున్నారు. ఇదంతా గంటగంటకూ లెక్కించారు. సివిల్ ఇంజినీరింగ్‌లో అనుభవం ఉన్న కొందరు నిపుణుల సమక్షంలో ఇదంతా జరిగిందని బీబీసీ తెలుగుకు వివరించారు గిన్నిస్ ప్రతినిధి ఋషినాథ్. గిన్నిస్ సంస్థ తరపున ఈ రికార్డు పరిశీలించడానికి అధికారిక నిర్ణేత (అఫీషియల్ అడ్జుడికేటర్)గా ఋషినాథ్ వచ్చారు.
ఎటువంటి నిర్మాణంలో కాంక్రీటు పోయాలి? అన్నటువంటి నిబంధనలు గిన్నిస్ రికార్డుకు లేవు. అయితే కాంక్రీటు పోయడం నిరంతరం, ఆగకుండా జరగాలి. అంతేకాకుండా, ఆ కాంక్రీటును ఒకదానితో ఒకటి సంబంధం ఉండే భాగాల్లోనే (జాయింట్) పోయాలి. ఈ రెండు షరతులు మాత్రమే ఈ కాంక్రీటు రికార్డుకు వర్తిస్తాయి. పోలవరం విషయంలో ఈ నిబంధన పాటించారని గిన్నిస్ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత్లో ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం ఇదే
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- పోలవరం గ్రౌండ్ రిపోర్ట్: అసలేం జరుగుతోందక్కడ?
- పోలవరం నిర్వాసితుల గోడు: 'అక్కడే చనిపోయినా బాగుండేది'
- కాళేశ్వరం ప్రాజెక్టు: BBC SPecial Report
- CBI vs CBI: కాకినాడ సానా సతీశ్ బాబు ఫిర్యాదు ఎందుకు సంచలనమైంది?
- సీబీఐ వర్సెస్ సీబీఐ: ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?
- అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా.. ఎవరేమంటున్నారు?
- నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)