ఇరాన్ క్షిపణి దాడులు: ఒక్కసారిగా పెరిగిన ముడి చమురు ధరలు

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ఆసియా మార్కెట్‌లో ముడి చమురు ధర 2.5 శాతం పెరిగింది. ఇప్పుడు ఇది ఒక బ్యారెల్‌కు 69.94 డాలర్లకు చేరింది.

పశ్చమాసియాలో చమురు సరఫరా ఆగిపోతుందేమో అనే ఆందోళనతో ముడి చమురు ధరలు పెరిగాయి.

ఈ వార్తలు వచ్చిన తర్వాత బంగారం ధరల్లో కూడా పెరుగుదల వచ్చింది.

ఇరాన్ దాడుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ప్రభావం కనిపిచింది.

జపాన్ నిక్కీ రెండు శాతం పడిపోగా, హాంకాంగ్ హాంగ్‌ సెంగ్ ఒక శాతం పతనమైంది.

ఈ దాడి తమ టాప్ కమాండర్ కాసిం సులేమానీ మృతికి ప్రతీకారం అని ఇరాన్ ప్రభుత్వ టీవీ చెప్పింది.

సులేమానీ మృతి తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఈ దాడులతో మరింత తీవ్రం అవుతుందని భావిస్తున్నారు.

హార్ముజ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే చమురు సరఫరా కూడా ఆగిపోతుందేమోనని అనుకుంటున్నారు.

సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్ నుంచి చమురు ఎగుమతులు ఇదే మార్గంలో జరుగుతాయి. ఇరాన్ కూడా ఎక్కువగా చమురు ఎగుమతులు ఈ మార్గం ద్వారానే చేస్తుంది.

అతిపెద్ద కష్టం భారత్‌కే

ఇప్పుడు ఇరాక్ నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్‌కు చిక్కొచ్చిపడింది.

భారత్ ఎక్కువ చమురు పశ్చిమాసియా దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిలో ఇరాక్ మొదటి స్థానంలో ఉంటుంది. అది కాకుండా, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్ నుంచి కూడా చమురు భారత్ చేరుతుంది.

అమెరికా, రష్యా నుంచి కూడా భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది.

ఇప్పుడు ఇరాన్ ప్రతిదాడుల తర్వాత చమురు సరఫరాలో ఏదైనా అడ్డంకి వస్తుందేమో అని భారత్ కంగారు పడడం లేదు. భారత్ ఆందోళనంతా ధరల గురించే.

భారత్ లాంటి ఆర్థికవ్యవస్థకు ఒక బ్యారెల్‌ ధర మూడు డాలర్లు పెరగడం అనేది చాలా పెద్ద విషయం. దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీ కొనుగోలు చేసే ఒక సామాన్యుడు లేదా వాటిపై ఆధారపడిన కంపెనీలకు ఇది మంచి వార్త కాదు.

అమెరికా దాడుల వల్ల భారతీయుల జేబుపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ఎందుకంటే, రాబోవు రోజుల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు కచ్చితంగా పెరుగుతాయి. భారత్‌లో చమురు దిగుమతులకు ఏ ఆటంకం ఉండదు. కానీ ధరలు మాత్రం పెరుగుతాయి.

భారత ప్రభుత్వానికి కూడా ఇది ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే, ప్రభుత్వం ఆర్థిక లోటు సవాలు ఎదుర్కొంటున్న సమయంలో చమురు ధరలు పెరగబోతున్నాయి. రూపాయిపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇది రూపాయికి మంచిది కాదు.

వచ్చే వారం రోజుల్లో భారత వినియోగదారులకు ఇది ఆందోళన కలిగించే విషయమే. అంతే కాదు, ఇది భారత ఆర్థికవ్యవస్థకు కూడా ఆందోళనకరమైన అంశం.

ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌లో అమెరికా ఈ దాడులు చేస్తే, ఇరాన్ దానికి ప్రతిదాడులు చేసింది. కానీ ఈ ఘర్షణ వల్ల అత్యంత ప్రతికూల ప్రభావం భారత్‌పై పడబోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)