2020 నాటికి నేనేమవుతాను? ప్రపంచం ఏమవుతుంది? అని 29 ఏళ్ల కిందట ఊహించిన బాలుడు.. అవి నిజమయ్యాయా?

అది 1991 ఆగస్టు నెల.. కెనడాకు చెందిన మిచ్ బ్రోగన్ అనే పదకొండేళ్ల అబ్బాయి ఒకరు ఒక చిన్న లేఖ రాశారు. భవిష్యత్‌లో పెద్దవాడవనున్న తనకే ఆ లేఖ రాసుకున్నారు.

తన తాత చార్లెస్ చెప్పడంతో పదకొండేళ్ల వయసులో బ్రోగన్.. భవిష్యత్ ఎలా ఉండనుందో అంచనా వేస్తూ 11 అంశాలు ఆ లేఖలో రాసి ఒక కవర్‌లో పెట్టి అతికించేశారు.

దాన్ని 2020 జనవరి 1 వరకు తెరవొద్దని చెప్పిన చార్లెస్ తన ఆఫీసులోని ఓ పుస్తకం మధ్యలో దాచేశారు. చార్లెస్ మరణం తరువాత 2006లో బ్రోగన్ అనుకోకుండా ఆ లేఖను చూశారు. కానీ, తాతకిచ్చిన మాట గుర్తు రావడంతో తెరవకుండా అలాగే ఉంచేశారు.

అప్పటి నుంచి 14 ఏళ్లు నిరీక్షించి 2020 జనవరి 1న దాన్ని తెరిచారు.

ఇప్పుడు మిచ్ బ్రోగన్ వయసు 39 ఏళ్లు. లండన్‌లో నివసిస్తున్నారు. 29 ఏళ్ల కిందట ఏం రాశానో తనకు కవర్ చేతిలోకి తీసుకున్నప్పుడు గుర్తు రాలేదని.. కానీ, కవర్ చించి చూడగానే ఆశ్చర్యం వేసిందని బ్రోగన్ చెప్పారు.

''కవర్ చించగానే లోపల మడతపెట్టిన పలుచని కాగితం కనిపించింది. దాంతో పాటు 1954 నాటి 1 డాలర్ బిళ్ల ఒకటి పాతది ఉంది. ఆ పలుచని కాగితంపై రాసి ఉన్నదంతా కనిపించింది. అప్పటి నా చేతి రాత నాకు గుర్తొచ్చింది'' అని చెప్పారు బ్రోగన్.

లేఖలో పైన అప్పటి తన చిరునామా, 1991 ఆగస్టు 25 అనే తేదీ ఉంది. తాతయ్య ఇంటి పెరట్లో దాచిపెట్టిన రెండు టైం క్యాప్సుల్స్ ఎక్కడున్నాయో తెలిపే మ్యాప్ కూడా ఒకటి దానిపై గీసి ఉంది.

అయితే, సుమారు మూడు దశాబ్దాల కిందట ఆయన 2020 నాటికి ఎలా ఉండబోతుందని ఊహించారు?

తనకు పెళ్లి కావొచ్చని, ఇద్దరు పిల్లలు ఉంటారని.. ఒక ఇల్లు, బోటు, కారు, ట్రక్ ఉండొచ్చని ఊహించి అందులో రాశారు. అలాగే, రచయితగా కానీ లాయర్‌గా కానీ పనిచేస్తుంటానని ఊహించారు. నెలకు 345 డాలర్ల (సుమారు రూ.25 వేలు) వరకు సంపాదించగలనని ఆయన అంచనా వేసుకుని అందులో రాశారు.

ఇవన్నీ వ్యక్తిగత భవిష్యత్తుకు సంబంధించినవి కాగా ప్రపంచం ఎలా ఉండబోతున్న ఊహలూ అందులో ఉన్నాయి. నదులు, సరస్సులు ఏవీ శుభ్రంగా ఉండబోవని.. ఇతర గ్రహాలపై మనుషులు నివసిస్తూ అక్కడా చెత్తతో నింపేస్తారని ఆయన ఊహించారు.

అయితే, బ్రోగన్ ఊహించనవాటిలో చాలా జరగలేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే ఆయనకింకా పెళ్లి కాలేదు, పిల్లల్లేరు.

ప్రపంచం కూడా ఆయన అనుకున్నట్లుగా మారలేదు. ఆయన ఊహించినట్లుగా మనుషులు ఇతర గ్రహాలపై ఆవాసాలు ఏర్పరుచుకోలేదు.

చిన్నప్పుడు ఆయన ఊహించినట్లుగా రచయిత, లాయర్ కాలేదాయన.. వ్యాపారం చేస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఉపయోగపడేలా మొబిలిటీ ఇంపెయిర్‌మెంట్స్‌కు సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థను ప్రారంభించారు.

2006లో ఓ తాగుబోతు డ్రైవర్ ఢీకొట్టడంతో ఆయన వెన్నుపూస దెబ్బతిని పూర్తిగా కదల్లేని స్థితికి చేరారు. ఆ తరువాతే ఆయన తనలాంటివారికి ఉపయోగపడే టెక్నాలజీని డెవలప్ చేయాలనుకున్నారు.

అప్పట్లో తన తాత నివసించే ఇంట్లో పాతిపెట్టిన టైం క్యాప్సుల్స్ కూడా తవ్వి తీయడం వీలవుతుందన్న ఆశాభావాన్ని బ్రోగన్ కనబరిచారు. అందుకు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారి సహకారం అవసరమని, ఆ ప్రయత్నం చేస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)