కృతిక శుక్లా, దీపిక పాటిల్: దిశ చ‌ట్టం అమ‌లు కోసం ఏపీ ప్ర‌భుత్వం నియమించిన ఈ అధికారులు ఎవరు?

    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

దిశ చ‌ట్టం అమ‌లు దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అందుకోసం చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఇద్దరు మహిళా ఉన్నతాధికారులను నియమించింది.

మ‌హిళ‌లపై, బాలిక‌ల‌పై ఎవరైనా వేధింపులకు, హింస‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవడానికి అనుగుణంగా ఏపీ ప్ర‌భుత్వం గ‌త నెల‌లో దిశ చ‌ట్టాన్ని రూపొందించింది.

వేగ‌వంతంగా కేసు విచార‌ణ పూర్తి చేసి, నేరస్థులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా చేసేందుకు అనుగుణంగా విధివిధానాలు ఖరారు చేసింది.

ఈ చ‌ట్టం అమ‌లుకోసం ఇప్ప‌టికే 13 జిల్లాల్లోనూ ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించారు. రాష్ట్ర‌ స్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఇద్ద‌రు మ‌హిళా అధికారుల‌ను నియ‌మించారు. వారిలో ఐఏఎస్ కృతిక శుక్లా, ఐపీఎస్ దీపిక ఎం పాటిల్ ఉన్నారు.

కృతిక శుక్లా నేప‌థ్యం

2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.

జ‌మ్మూ క‌శ్మీర్ క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారిగా స‌ర్వీసు ప్రారంభించారు.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళా, శిశు సంక్షేమ‌ శాఖ డైరెక్ట‌ర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అంత‌కుముందు కృష్ణా జ‌ల్లా జాయంట్ క‌లెక్ట‌ర్ గానూ, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ డిప్యూటీ సీఈవో గానూ ఆమె ప‌నిచేశారు.

తొలుత విశాఖ అసిస్టెంట్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. మ‌ద‌న‌ప‌ల్లి స‌బ్ క‌లెక్ట‌ర్‌గానూ, గుంటూరు జాయింట్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వహించారు.

బీఎస్సీ, ఎంకాం అభ్యసించిన కృతిక... రెండో ప్ర‌య‌త్నంలో ఐఎఎస్‌గా ఎంపిక‌య్యారు.

హ‌రియాణా రాష్ట్రానికి చెందిన ఆమె ప‌నిచేసిన ప్రాంతాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భ‌ర్త హిమాన్షు శుక్లా కూడా ఐఏఎస్ అధికారి. ప్ర‌స్తుతం ఆయ‌న హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖ‌లో డైరెక్ట‌ర్‌గా ఉన్నారు.

దిశా చట్టం ప్ర‌త్యేక అధికారిణిగా నియ‌మితులైన వెంట‌నే ఆమె రంగంలోకి దిగారు. 13 జిల్లాల ప్ర‌త్యేక అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. చ‌ట్టం అమ‌లులోకి రాబోతున్న నేప‌థ్యంలో వారికి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర ప‌డ‌గానే...

"జనవరి చివరికల్లా అన్ని జిల్లాల్లోని బోధనాసుపత్రుల్లో దిశా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దిశా మహిళా పోలీస్ స్టేషన్ లు, దిశా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. సీఎం ఆదేశాలతో జనవరి నెలను 'దిశా నెల'గా పరిగణిస్తున్నాం. దిశా చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. చట్టం అమలుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి" అని జిల్లా స్థాయి ప్ర‌త్యేక అధికారుల‌కు కృతిక వివరించారు.

"అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళల సంరక్షణకు దిశా చట్టం అమలుపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మహిళా శిశు సంక్షేమ శాఖ పథకాల ద్వారా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. వన్ స్టాప్ సెంటర్‌లను, దిశా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. వైఎస్సార్ కిశోరీ వికాసం పథకం కింద ప్రాథమిక స్థాయి నుంచే స్వీయ రక్షణపై అవగాహన కల్పిస్తాం" అని ఆమె చెప్పారు.

ఐపీఎస్ అధికారిణి దీపిక

దిశ చ‌ట్టం అమ‌లు పర్య‌వేక్ష‌ణ కోసం మ‌రో అధికారిణి మండ‌వ దీపికను కూడా ఏపీ ప్ర‌భుత్వం నియ‌మించింది. ప్ర‌స్తుతం ఆమె క‌ర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా విధులు నిర్వ‌హిస్తున్నారు.

దీపిక నేప‌థ్యం

2014 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్.

బీఈ, ఎంఎస్సీ చ‌దివారు.

ప్ర‌స్తుతం క‌ర్నూలు అడిష‌న‌ల్ ఎస్పీ

అంత‌కుముందు ఏసీబీలో ఏఎస్పీ స్థాయిలో ప‌నిచేశారు.

పార్వ‌తీపురం ఏఎస్పీగా కూడా ప‌నిచేశారు.

తొలుత ప్ర‌కాశం జిల్లాలో ట్రైనీగానూ, అనంత‌రం కొంత‌కాలం గ్రేహౌండ్స్‌లోనూ ప‌నిచేశారు.

అమె కుటుంబంలో ఆమెతో క‌లిపి న‌లుగురు ఐపీఎస్‌లు ఉన్నారు.

ఆమె తండ్రి మండవ విష్ణువర్దన్‌ సీఆర్‌పీఎఫ్‌లో చేరి ఐజీ స్థాయికి ఎదిగారు.

సోద‌రుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఈటాన‌గ‌ర్ ఎస్పీగా ఉన్నారు.

దీపిక భ‌ర్త విక్రాంత్ పాటిల్ ప్ర‌స్తుతం గుంత‌క‌ల్ రైల్వే జోన్ ఎస్పీగా ప‌నిచేస్తున్నారు.

తన తండ్రి స్ఫూర్తితోనే తాను ఐపీఎస్ అయ్యానని ఆమె చెబుతారు.

క్షేత్ర‌స్థాయి అనుభ‌వంతో దిశ చ‌ట్టం అమ‌లు కోసం ప్ర‌య‌త్నిస్తాం: దీపిక

దిశ చ‌ట్టం అమ‌లులో ప్ర‌త్యేక అధికారిగా బాధ్య‌తాయుతంగా ప‌నిచేస్తామంటున్నారు ఐపీఎస్ అధికారి దీపిక ఎం పాటిల్.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ... "దేశంలోనే మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌యంలో దిశ చ‌ట్టం పెద్ద ముంద‌డుగు అవుతుంది. మ‌హిళ‌ల‌పై దాడులను అరిక‌ట్టేందుకు కీల‌కంగా మార‌బోతోంది. అలాంటి చ‌ట్టం అమ‌లు బాధ్య‌త మాకు అప్ప‌గించడం గ‌ర్వంగా ఉంది. బాధ్యతాయుతంగా ప‌నిచేసి మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌లో స‌మ‌ర్థ‌వంత‌మైన ఫ‌లితాలు సాధిస్తామ‌నే విశ్వాసం ఉంది. గ‌తంలో పార్వ‌తీపురం ఏఎస్పీగా ప‌నిచేసిన కాలంలో మ‌హిళ‌ల‌పై నేరాల కేసులను చేధించడంలో వచ్చి అనుభవం ఇప్పుడు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెళ్ళి అయిన వెంట‌నే భార్య ద‌గ్గ‌ర న‌గ‌ల కోసం, ఆమెను భర్త హ‌త్య చేసిన కేసుని స్వ‌ల్ప కాలంలోనే చేధించ‌డం అప్ప‌ట్లో సంతృప్తినిచ్చింది. క్షేత్ర‌స్థాయిలో మ‌హిళ‌ల‌కు సంబంధించిన కేసుల విష‌యంలో ఎదుర‌య్యే స‌వాళ్లు స్వ‌యంగా చూశాను. ఇప్పుడు వాటిని అధిగ‌మించేందుకు అవ‌స‌ర‌మైన యంత్రాంగం, నిధులు కూడా కేటాయించేందుకు ప్ర‌భుత్వం సిద్ధం కావ‌డం సంతోషాన్నిస్తోంది. బాధితుల‌కు న్యాయం జ‌ర‌గడంతో పాటుగా వారి సంక్షేమానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల కోసం అటు ఐఏఎస్, ఇటు ఐపీఎస్ అధికారులిద్ద‌రినీ నియ‌మించ‌డం స‌మగ్రమైన న్యాయం జ‌ర‌గానికి ఉప‌యోగ‌ప‌డుతుంది" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)