You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మరణ శిక్షల్లో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎక్కడ? - రియాలిటీ చెక్
- రచయిత, శృతి మేనన్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
దిల్లీలో 2012లో ఒక బస్సులో ఒక యువతి మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నేరంలో నలుగురు పురుషులను దోషులగా గుర్తించారు. వారిలో ఒకరు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు తిరస్కరించటంతో.. ఆ నలుగురికీ మరి కొద్ది రోజుల్లో మరణ శిక్ష విధించే అవకాశముంది.
భారత న్యాయస్థానాలు అత్యంత తీవ్రమైన నేరాలకు మరణ దండనలు ఖరారు చేస్తుండటాన్ని కొనసాగిస్తున్నప్పటికీ.. గత నాలుగేళ్లుగా మరణ శిక్షలేవీ అమలు చేయలేదు. 1990ల్లో ముంబైపై బాంబు దాడులకు నిధులు సమకూర్చిన నేరంలో దోషిగా నిర్ధారితుడైన యకూబ్ మెమన్‌ను 2015లో ఉరితీశారు. ఆ తర్వాత ఇప్పటివరకూ దేశంలో మరణశిక్షలు అమలు కాలేదు.
భారతదేశం కన్నా ఇతర దేశాల్లో మరణ శిక్షలు మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. 2018లో నమోదైన మరణ శిక్షల అమలులో అత్యధిక శిక్షలు కేవలం నాలుగు దేశాలకు చెందినవే కావటం గమనార్హం.
కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమలవుతున్న మరణశిక్షల సంఖ్య తగ్గిపోతూ వస్తోందని.. గడచిన దశాబ్దంలో చూస్తే గత ఏడాది అతి తక్కువగా ఉన్నాయని.. హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తోంది.
భారతదేశం ఏ నేరాలకు మరణ శిక్షలు విధిస్తుంది?
భారతదేశం 2018లో అత్యధికంగా హత్యా నేరాలు, లైంగిక హింసతో కూడిన హత్యా నేరాలకు మరణ దండన విధించింది. గత ఏడాది లైంగిక హింసతో కూడిన హత్యానేరాలకు 58 మరణ శిక్షలు, హత్యా నేరాలకు 45 మరణ శిక్షలు ఖరారు చేసింది.
దేశంలో భారత శిక్షా స్మృతి (1860)లోని వివిధ సెక్షన్ల కింద ఈ మరణ దండనలు విధించవచ్చు.
మరణ శిక్షకు అవకాశం గల మరో 24 కేంద్ర, రాష్ట్ర చట్టాలు కూడా ఉన్నాయి.
భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచీ.. అత్యధిక మరణ శిక్షలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశారని దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ సేకరించిన గణాంకాలు చెప్తున్నాయి.
ఆ రాష్ట్రం ఇప్పటివరకూ 354 మందిని ఉరి తీసింది. ఉత్తర ప్రదేశ్ తర్వాత అత్యధికంగా హరియాణాలో 90 మందిని, మధ్యప్రదేశ్‌లో 73 మందిని ఉరితీశారు.
ఒక్క 2018 సంవత్సరంలోనే భారతదేశంలోని న్యాయస్థానాలు 162 మరణ శిక్షలు విధించాయని నేషనల్ లా యూనివర్సిటీ సమాచారం చెప్తోంది. ఇది గత ఏడాది కన్నా దాదాపు 50 శాతం అధికం. మొత్తం రెండు దశాబ్దాల్లో చూస్తే ఇదే అత్యధికం.
లైంగిక హింసతో కూడిన హత్యలకు మరణ శిక్షలు విధించటం అంతకుముందు సంవత్సరం కన్నా 2018లో 35 శాతం పెరిగింది. ఇందుకు చట్టంలో చేసిన మార్పులు కొంత కారణం.
మరోవైపు గత ఏడాది.. పాకిస్తాన్‌లో 250 కన్నా ఎక్కువ మరణ శిక్షలు, బంగ్లాదేశ్‌లో 229 కన్నా ఎక్కువ మరణ శిక్షలు ఖరారు చేసినట్లు తెలిస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కోర్టులు విధించే మరణ శిక్షల సంఖ్య 2017 కన్నా 2018లో స్వల్పంగా తగ్గాయి. ప్రపంచ వ్యాప్తంగా 2017లో మొత్తం 2,591 మరణ శిక్షలు విధించగా 2018లో మొత్తం 2,531 మరణ శిక్షలు విధించారు.
ప్రపంచంలో అత్యధిక ఉరిశిక్షలు అమలు చేసేదెవరు?
మరణ శిక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్.. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 690 మరణ శిక్షలు అమలు అయినట్లు తెలుసునని చెప్తోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 30 శాతం తగ్గిందనీ వెల్లడించింది.
2018లో అమలైనట్లు నమోదైన మరణ శిక్షల్లో 80 శాతం కేవలం నాలుగు దేశాల్లోనే ఉన్నాయి:
- ఇరాన్
- సౌదీ అరేబియా
- వియత్నాం
- ఇరాక్
వియత్నాం ఒక అరుదైన అధికారిక ప్రకటనలో.. తమ దేశం 85 మరణ శిక్షలను అమలు చేసిందని గత ఏడాది నవంబరులో నిర్ధారించింది. అయితే.. మరణ శిక్షలు దేశ రహస్యంగా ఉండటం వల్ల అంతకుముందలి సంవత్సరాల్లో అమలైన మరణ శిక్షలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేదు.
మొత్తంగా.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరణ శిక్షల అమలు అంతకుముందలి ఏడాదితో పోలిస్తే 46 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం వియత్నాంలో అమలైన మరణ శిక్షల సంఖ్యే. జపాన్ 15 మందికి, పాకిస్తాన్ 14 మందికి, సింగపూర్ 13 మందికి మరణ శిక్ష అమలు చేశాయి. థాయ్‌లాండ్ కూడా 2009లో నిలిపివేసిన మరణ శిక్షల అమలును గత ఏడాది మళ్లీ పునరుద్ధరించింది.
అమెరికాలో వరుసగా రెండోసారి.. మరణ శిక్షలు అంతకుముందు సంవత్సరం కన్నా కొంచెం పెరిగాయి. 2017లో 23 మరణ శిక్షలను అమలు చేసిన అమెరికా 2018లో 25 మరణ శిక్షలు అమలు చేసింది.
కానీ ఈ ప్రంపచ వ్యాప్త గణాంకాల్లో కొన్ని ఖాళీలున్నాయి..
- చైనాలో మరణ శిక్షల సంఖ్య ఇందులో ఉండవు.. అక్కడ వేలాది మందికి మరణ శిక్ష అమలు చేస్తున్నారని, కానీ ఆ లెక్కలను రహస్యంగా దాచేస్తున్నారని ఆమ్నెస్టీ భావిస్తోంది.
- అలాగే సిరియాలో యుద్ధం కారణంగా.. ఆ దేశంలో మరణ శిక్షలు అమలు చేశారా లేదా అన్నది నిర్ధారించటం కష్టం.
- ఉత్తర కొరియా నుంచి కానీ లావోస్ నుంచి కానీ ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు.. ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షల అమలుకు సంబంధించిన తన గణాంకాలు తక్కువ అంచనాలు కావచ్చునని ఆమ్నెస్టీ చెప్తోంది.
మరణ శిక్షలు ఎదుర్కొంటున్న వారు అధికంగా ఉన్న దేశం ఏది?
ఈ సమాచారం విషయంలో పరిమితులు ఉన్నాయి. ప్రతి దేశానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు.
అయితే.. తెలిసినంతమేరకు 2018లో అత్యధిక సంఖ్యలో మరణ శిక్ష ఎదుర్కొంటున్న వారు పాకిస్తాన్‌లో ఉన్నారు. అక్కడ 4,864 కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో మరణ శిక్ష పడ్డ ఖైదీలు చేసుకున్న అప్పీలును దేశ అత్యున్నత న్యాయ స్థానం వినటానికన్నా ముందు ఒక్కో ఖైదీ సగటున 10 సంవత్సరాలు జైలులో గడుపుతున్నట్లు ఒక హక్కుల సంస్థ ఈ ఏడాది పరిశోధనలో వెల్లడైంది.
బంగ్లాదేశ్‌లో 1,500 మంది కన్నా ఎక్కువ మంది మరణశిక్ష ఎదుర్కొంటున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తోంది.
భారతదేశంలో నేషనల్ లా యూనివర్సిటీ సమాచారం ప్రకారం.. గత ఏడాది చివరి నాటికి 426 మంది మరణ శిక్ష ఎదుర్కొంటున్నారు. వీరిలో సగం మందికి పైగా ఖైదీలు హత్య కేసులో ఈ శిక్షను ఎదుర్కొంటుంటే.. మరో 21.8 శాతం మందికి అత్యాచారం, హత్య కేసుల్లో ఉరి శిక్ష పడింది.
అమెరికాలో 2,654 మంది ఖైదీ, నైజీరియాలో 2,000 మందికి ఖైదీలు పైగా మరణ శిక్ష ఎదుర్కొంటున్న వారు ఉన్నారు.
ఇదిలావుంటే.. 2018 చివరి నాటికి ప్రపంచ దేశాల్లో సగం కన్నా ఎక్కువ దేశాలు చట్టంలో కానీ, ఆచరణలో కానీ మరణ శిక్షను రద్దు చేశాయి. ఇది ఒక దశాబ్దం కిందటి కన్నా 47 శాతం అధికం.
2018లో బుర్కినా ఫాసో మరణ దండనను రద్దు చేసిందని.. గాంబియా, మలేసియాలు రెండూ మరణశిక్షలపై అధికారిక మారటోరియం ప్రకటించాయని ఆమ్నెస్టీ గుర్తుచేస్తోంది.
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం కూడా మరణ శిక్షను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీంతో ఆ దేశంలో మరణ శిక్షను రద్దు చేసిన రాష్ట్రాల సంఖ్య 20కి పెరిగింది.
ఇవి కూడా చదవండి:
- నిర్భయ కేసు: మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆ నలుగురు దోషులకు చట్టపరంగా ఉన్న చివరి అవకాశాలేమిటి?
- అయిదు హత్యలు, ఆరుగురు నిర్దోషులు, చేయని తప్పుకు చేజారిన 16 ఏళ్ళ జీవితం
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్కు మరణశిక్ష
- చైనాలో 10 మందికి బహిరంగంగా మరణ శిక్ష విధించిన చైనా
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
- డబ్బు ప్రమేయం లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)