You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రియాలిటీ చెక్: మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐక్యరాజ్య సమితి మాటలో నిజమెంత?
ప్రస్తుతం దాదాపు 170 దేశాలు మరణ శిక్షను రద్దు చేయడమో లేదా, మరణ దండన అమలుపై మారటోరియం విధించడమో చేశాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ నెల 10న వ్యాఖ్యానించారు. మరణ శిక్ష రద్దుకు దేశాలు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ప్రపంచ మరణ శిక్ష వ్యతిరేక దినం సందర్భంగా ఆయన ఈ మాట అన్నారు. ఇది పూర్తిగా నిజమేనా? దీనిని తేల్చేందుకు బీబీసీ 'రియాలిటీ చెక్' బృందం ప్రయత్నించింది.
ఐరాసలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. సెక్రటరీ జనరల్ లెక్క ప్రకారం చూస్తే 23 దేశాలు గత పదేళ్లలో కనీసం ఒక్కరికైనా మరణ శిక్షను అమలు చేశాయి.
ఐరాస సభ్య దేశాలు, పౌర సమాజం అందించిన సమాచారం ఐరాస గణాంకాలకు ఆధారం. మానవ హక్కుల సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' వాదన ఐరాస గణాంకాలకు భిన్నంగా ఉంది.
142 దేశాలే మరణ శిక్షను రద్దు చేశాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది. గత ఐదేళ్లలో 33 దేశాలు కనీసం ఒక్కరికైనా ఈ శిక్షను అమలు చేశాయని పేర్కొంటోంది.
చైనాలో వెయ్యి మందికి పైగా వ్యక్తులకు అమలు: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
2017లో అత్యధికంగా చైనా వెయ్యి మందికి పైగా వ్యక్తులకు మరణ శిక్ష అమలు చేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది. చైనా అధికారిక గణాంకాలు అందుబాటులో లేకపోయినప్పటికీ, అక్కడ మరణ శిక్షలు వేలల్లో ఉన్నాయని పేర్కొంటోంది. చైనాలో ఈ గణాంకాలు అధికార రహస్యాల కిందకు వస్తాయి.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం- గత సంవత్సరం చైనా తర్వాత అత్యధికంగా ఇరాన్ మరణ శిక్షలను అమలు చేసింది. ఇరాన్ 507 మందికి పైగా, సౌదీ అరేబియా 146 మందికి, ఇరాక్ 125 మందికి పైగా, పాకిస్తాన్ 60 మందికి పైగా, ఈజిప్ట్ 35 మందికి పైగా, సొమాలియా 24 మందికి, అమెరికా 23 మందికి, జోర్డాన్ 15 మందికి, సింగపూర్ 8 మందికి మరణ శిక్షలను అమలు చేశాయి.
అధికారిక గణాంకాలు, మీడియా కథనాలు, మరణ శిక్ష పడ్డ వ్యక్తులు, వారి కుటుంబాలు, వారి ప్రతినిధులు అందించిన సమాచారం ఆధారంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గణాంకాలు వెల్లడిస్తుంది.
చైనాను మినహాయించి చూస్తే, 2017లో అమలైన మరణ శిక్షల్లో 84 శాతం కేవలం నాలుగు దేశాల్లోనే అమలయ్యాయి. అవేంటంటే- ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, పాకిస్తాన్.
గత సంవత్సరం ఆయా దేశాల్లో మరణ శిక్షలను తల నరికివేయడం, ఉరి తీయడం, విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం, తుపాకీతో కాల్చడం ద్వారా అమలు చేశారు.
నిరుడు 53 దేశాల్లో కనీసం 2,591 మందికి మరణ శిక్షలు విధించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది. అయితే కొన్ని కేసుల్లో తర్వాత శిక్షలను తగ్గించడం జరుగుతుంటుంది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సమాచారం ప్రకారం-
- 106 దేశాల్లో మరణ శిక్షను చట్టాలు అనుమతించవు.
- 7 దేశాల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే అత్యంత తీవ్రమైన నేరాలకు మరణ శిక్షను విధిస్తారు. ఉదాహరణకు యుద్ధం సమయంలో చేసిన నేరాలకు ఈ శిక్ష వేస్తారు.
- 29 దేశాల్లో మరణ శిక్షను చట్టాలు అనుమతిస్తున్నప్పటికీ, గత పదేళ్లలో ఒక్కరికీ ఈ శిక్షను అమలు చేయలేదు. ఈ శిక్షను అమలు చేయకూడదనే విధానాన్ని పాటిస్తున్నాయి.
- మరణ శిక్ష చట్టాలు ఉండి ఈ శిక్షను అమలు చేస్తున్న లేదా శిక్షను అమలు చేయబోమని ప్రకటించని దేశాలు 56 ఉన్నాయి.
ఐరాసలో సభ్యత్వం లేని ఐదు దేశాలను కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిగణనలోకి తీసుకొని, జాబితా తయారు చేసింది.
ఐరాస సెక్రటరీ జనరల్ వ్యాఖ్యల అనంతరం మలేసియా స్పందిస్తూ- తాము మరణ శిక్షను రద్దు చేయాలనుకుంటున్నామని ప్రకటించింది. మలేషియాలో దాదాపు 1200 మంది మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారు. హత్య, మాదక ద్రవ్యాల రవాణా, విద్రోహం, ఇతర తీవ్రమైన నేరాలకు మలేషియాలో మరణ శిక్ష విధిస్తారు. మరణ శిక్ష రద్దుపై పార్లమెంటు రానున్న సమావేశాల్లో బిల్లును చేపట్టనుంది.
2017లో గునియా, మంగోలియా మరణ శిక్షను రద్దు చేశాయి. మలేషియా ఈ బిల్లును ఆమోదిస్తే ఈ రెండు దేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్న దేశం ఇదే అవుతుంది.
తమ దేశంలో మరణ శిక్షను రద్దు చేస్తామని గాంబియా అధ్యక్షుడు అడామా బారో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. గాంబియాలో మరణ దండన చివరిసారిగా 2012లో అమలైందని ద గార్డియన్ పత్రిక తెలిపింది.
ఆఫ్రికాలోని బుర్కీనా ఫాసో ఈ ఏడాది జూన్‌లో మరణ దండనను రద్దు చేసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సమాచారం ప్రకారం 2017 చివరి నాటికి సబ్-సహారన్ ఆఫ్రికాలో కనీసం 20 దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయి.
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం మరణ శిక్షపై ఈ నెల్లోనే నిషేధం విధించింది. ఇప్పటివరకు అమెరికాలో వాషింగ్టన్‌తో కలిపి 20 రాష్ట్రాలు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నాయి.
మరణ శిక్షను పూర్తిస్థాయిలో రద్దుచేసిన దేశాల సంఖ్య 1991 నుంచి 2017 వరకు నిలకడగా పెరుగుతూ వచ్చింది. మరణ శిక్షను నిషేధించిన దేశాల సంఖ్య 1991లో 48 కాగా, గత ఏడాది ఇది 106కు పెరిగింది. ఇటీవలి సంవత్సరాల్లో మరణ శిక్షను అమలు చేసే దేశాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది.
2013-17 మధ్య మరణ శిక్షను అమలు చేసిన దేశాలు: అఫ్గానిస్థాన్, భారత్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బెలారస్, బోత్స్‌వానా, చాద్, చైనా,ఈజిప్ట్, ఈక్వటోరియల్ గునియా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, జపాన్, జోర్డాన్, కువైట్, మలేషియా, నైజీరియా, ఉత్తర కొరియా, ఒమన్, పాకిస్తాన్, పాలస్తీనియన్ టెరిటరీస్, సౌదీ అరేబియా, సింగపూర్, సొమాలియా, దక్షిణ సుడాన్, సుడాన్, తైవాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, వియత్నాం, యెమెన్.
లిబియా, సిరియా దేశాల్లో మరణ శిక్షలు అమలయ్యాయా, లేదా అనే విషయాన్ని అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నందున ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిర్ధరించుకోలేకపోయింది.
మరణ శిక్షను రద్దు చేయకున్నా 2013-17 మధ్య దీనిని అమలు చేయని దేశాలు: ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, బెలీజ్, కామరోస్, క్యూబా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డొమినికా, ఇథియోపియా, గాంబియా, గుయానా, జమైకా, లెబనాన్, లీసోథో, ఖతార్, సెయింట్ కిట్స్ అంట్ నెవీస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యుగాండా, జింబాబ్వే.
ఇవి కూడా చదవండి:
- జైపూర్‌లో జికా వైరస్... బాధితురాలికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏమిటి?
- 2013 ఈజిప్ట్ నిరసనలు: 75 మందికి మరణ శిక్ష
- వివాదంలో ట్రంప్ కుటుంబం: వారికి అంత సంపద ఎలా వచ్చింది? ట్రంప్ తండ్రి ఏం చేసేవారు?
- రఫేల్ ఒప్పందం: HAL ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డున పడతారా?
- తిత్లీ తుపాను: 2,25,000 కుటుంబాలపై తీవ్ర ప్రభావం
- హైదరాబాద్ టెస్ట్: వెస్టిండీస్‌ను కుప్పకూల్చిన ఉమేశ్ యాదవ్... టెస్ట్ సిరీస్ భారత్ కైవసం
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
- భారత్: పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్ జననాల శాతం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)