You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
300 మంది మరణశిక్షలను ఈమె ప్రత్యక్షంగా చూశారు!
రికీ మెక్‌జిన్‌కు మరణశిక్ష విధించి 18 ఏళ్లయింది. కానీ ఇప్పటికీ అది తల్చుకుని మైఖెల్ లియాన్స్ కన్నీరు పెట్టుకుంటారు.
వార్తాపత్రిక రిపోర్టర్‌గా, ఆ తర్వాత టెక్సాస్ క్రిమినల్ జస్టిస్ అధికారిగా ప్రభుత్వం విధించే ప్రతి మరణశిక్షకు ఆమె పన్నెండేళ్ల నుంచి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు.
2000-2012 మధ్యకాలంలో లియాన్స్ దాదాపు 300 మంది పురుషులు, మహిళల మరణాలను కళ్లారా చూశారు. రెండు సూదులు జీవిత పోరాటానికి ప్రశాంతమైన ముగింపును ఇచ్చేవి.
లియాన్స్‌కు 22 ఏళ్ల వయసు ఉన్నపుడు ఆమె మొదటిసారి మరణశిక్షను చూశారు.
జేవియర్ క్రజ్ మరణించినప్పుడు ఆమె తన డైరీలో, ''నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నిజానికి నేను బాధపడాలా?'' అని రాసుకున్నారు.
క్రజ్ ఇద్దరు వ్యక్తులను సుత్తితో కొట్టి చంపాడు. అందువల్ల అలాంటి వాడి కోసం బాధపడడం అనవసరం అనుకున్నారు.
‘మరణశిక్షల రాజధాని’
లియాన్స్ తన అనుభవాలను క్రోడీకరించి రాసిన 'ద ఫైనల్ మినిట్స్' ఇటీవలే ప్రచురితమైంది.
''నేను మరణశిక్షలకు అనుకూలంగా వాదించేదాన్ని. కొన్ని నేరాలకు అదే సరైన శిక్ష అని భావించేదాన్ని'' అని ఆమె తెలిపారు.
1924 నుంచి టెక్సాస్ ప్రభుత్వం విధించే మరణశిక్షలన్నీ టెక్సాస్ నగరానికి తూర్పున ఉన్న హంట్స్‌విల్‌లో అమలు చేసేవారు.
1972లో అమెరికా సుప్రీంకోర్టు అది చాలా క్రూరమైన, అసహజమైన శిక్ష అంటూ మరణశిక్షను రద్దు చేసింది. కానీ కొన్ని నెలల్లోనే కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఆ శిక్షను తీసుకొచ్చాయి.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రెండేళ్ల లోపలే టెక్సాస్ మరణశిక్షను తీసుకువచ్చింది. అయితే ఈసారి మరణశిక్షను విధించడానికి ఇంజెక్షన్లను ఉపయోగించడం ప్రారంభించారు.
క్రమంగా హంట్స్‌విల్ ''ప్రపంచ మరణశిక్షల రాజధాని'' అని పేరు పొందింది.
చివరి క్షణాలలో ఒక్కోరు ఒకోలా..
నిజానికి లియాన్స్ చాలా సందడిగా కనిపిస్తారు. ఆమెతో ఈ ప్రపంచంలోని ఏ విషయం గురించి అయినా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు.
కానీ ఒక్కసారి డెత్ ఛాంబర్ గురించి ప్రస్తావిస్తే మాత్రం ఆమె మారిపోతారు.
2000 సంవత్సరంలో టెక్సాస్‌లో 40 మరణశిక్షలు విధించారు. అది ఒక రికార్డు. అది దాదాపు అన్ని రాష్రాలూ కలిసి విధించిన మరణశిక్షలతో సమానం.
హంట్స్‌విల్ రిపోర్టర్‌గా లియాన్స్ వాటిలో 38 మరణశిక్షలను దగ్గరుండి చూశారు. వాటన్నిటి గురించి తన డైరీలో రాసుకున్నారు.
తను వాటిని పట్టించుకోనట్లు, వాటిపై ఎలాంటి భావాన్ని ప్రకటించనట్లు కనిపించినా, నిజానికి ఆ రాతలు ఆ ఒత్తిడిలోంచి బైటకు రావడానికి ఆమె అనుసరించే విధానం.
''ఇప్పుడు నా డైరీని చూస్తే, వాటిలో నన్ను వేధించే విషయాలు కనిపిస్తాయి.'' అని ఆమె అంటారు.
''వాళ్ల చివరి క్షణాలను, వాళ్ల ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళడాన్ని దగ్గర నుంచి చూడడం అనేది సాధారణ విషయం కాదు. కానీ దోషులకు మరణశిక్ష విధించడం అక్కడ ఎంత సామాన్యంగా అయిపోయిందంటే, దానిలో అక్కడ పరిపూర్ణత సాధించారని చెప్పవచ్చు.''
మరణశిక్షల సందర్భంగా అనేకమంది క్షమించమని వేడుకునేవారు, కొంత మంది తాము నిరపరాధులమని గింజుకునేవారు. కొందరు బైబిల్ వాక్యాలను చదివితే కొందరు కొటేషన్లు చెప్పేవారు.
శిక్ష సందర్భంగా వాళ్లకు ఇచ్చిన ఇంజెక్షన్ క్రమక్రమంగా పని చేయడం మొదలుపెట్టగానే చిన్నగా నిద్రలోకి జారుకునేవారు. ఒకోసారి చిన్న దగ్గు, ఒక గురక.. వాళ్ల ఊపిరితిత్తులు మెల్లగా పని చేయడం ఆగిపోయేవి. వాళ్లు మరణించాక, వాళ్ల శరీర వర్ణం మారిపోయేది.
లియాన్స్‌కు ప్రపంచంలోని నలుమూలల నుంచి ఉత్తరాలు, ఈమెయిల్స్ వచ్చేవి. వాటిలో 'ప్రభుత్వం చేస్తున్న హత్యల'లో పాలు పంచుకుంటున్నందుకు ఆమెనూ తిట్టేవారు.
మొదట్లో ఆమె మరణశిక్షలను నిర్వికారంగానే చూసినా, 2004లో ఆమె గర్భవతి అయ్యాక పరిస్థితి మారింది. అప్పటివరకు బింకంగా ఉన్న ఆమె ముసుగు తొలగిపోయింది.
''నాటి నుంచి మరణశిక్షలు నా మీద తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించాయి. నా కడుపులోని బిడ్డ వాళ్ల చివరి మాటలు, తాము నిర్దోషులమన్న వేడుకోళ్లు... ఇవన్నీ వింటోంది అనిపించేది''
''నాకు కూతురు పుట్టాక, మరణశిక్షలు అంటేనే భయం కలిగేది. ఒకవైపు నా కూతురు నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటే, ఇక్కడ మరణశిక్ష పడిన వారి బంధువులు తమ వారి కోసం ఏడ్చేవాళ్లు.''
''దీనిలో విజేతలు ఎవరూ లేరు. నా చుట్టూ నిరంతరం ఒక విషాద వాతావరణం అల్లుకుని ఉండేది.''
ఆ తర్వాత ఆమె అలాగే ఏడేళ్లు నెట్టుకొచ్చారు. చిట్టచివరికి లియాన్స్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
మరణశిక్ష పట్ల పెరుగుతున్న విముఖత
అయినా గతంలో జరిగిన సంఘటనలు ఆమెను నిరంతరం వెంటాడుతుంటాయి.
దేన్ని చూసినా, ఏం విన్నా తనకు డెత్ చాంబర్ గుర్తొస్తుంది అంటారు.
క్రమక్రమంగా టెక్సాస్‌లో కూడా మరణశిక్ష పట్ల విముఖత పెరుగుతోంది. 2016లో అక్కడ 40 మరణశిక్షలు విధిస్తే, గత ఏడాది కేవలం ఏడుగురికే విధించారు.
లియాన్స్ తరచూ మరణశిక్షలు విధించిన వారిని సమాధి చేస్తున్న జో బైర్డ్ శ్మశానవాటికను సందర్శిస్తుంటారు.
వారిలో ఎవరెవరు తన కళ్ల ముందే మరణించి ఉంటారా అని ఆలోచిస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)