You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పర్వేజ్ ముషరఫ్‌కు మరణ శిక్ష: 'మాజీ ఆర్మీ చీఫ్ ఎప్పటికీ దేశ ద్రోహి కాలేడు' - పాక్ మేజర్ జనరల్ గఫూర్
మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్‌ను దేశద్రోహం కేసులో దోషిగా ఖరారు చేసిన పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మంగళవారం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆరు కింద ఆయనకు మరణశిక్ష విధించింది.
ఒక మాజీ ఆర్మీ చీఫ్‌కు దేశద్రోహం కేసులో ఉరిశిక్ష విధించడం పాక్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. కోర్టు ఈ తీర్పును 2-1 మెజారిటీతో ఇచ్చింది.
కోర్టు ఈ తీర్పుపై పాకిస్తాన్ సైన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ గఫూర్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేస్తూ "జనరల్ పర్వేజ్ ముషరఫ్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పుతో సైన్యం దిగ్భ్రాంతికి గురైంది. ఇది చాలా విచారకరం" అన్నారు.
గఫూర్ తన ప్రకటనలో "మాజీ ఆర్మీ చీఫ్, మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ దేశానికి 40 ఏళ్ల వరకూ సేవలు అందించారు. దేశ రక్షణ కోసం యుద్ధంలో పోరాడిన వ్యక్తి ఎప్పటికీ దేశద్రోహి కాలేడు. కోర్టు విచారణలో రాజ్యాంగాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రాథమిక హక్కైన ఆత్మరక్షణకు కూడా కోర్టులో అవకాశం ఇవ్వలేదు. తగిన విచారణ జరపకుండానే తొందరపాటులో తీర్పు వినిపించారు" అని ఆరోపించారు.
కోర్టు తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని పాకిస్తాన్ సైన్యం ఆశిస్తోందని గఫూర్ అన్నారు.
సుప్రీంకోర్టుకు ముషరఫ్
స్పెషల్ కోర్టులోని ముగ్గురు జడ్జిల బెంచ్ ఈ తీర్పు వినిపించింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేఠ్ అధ్యక్షతన ఏర్పడిన ఈ బెంచ్‌లో సింద్ హైకోర్టు జస్టిస్ నజర్ అక్బర్, హైకోర్ట్ జస్టిస్ షాహిద్ కరీమ్ ఉన్నారు.
ఇప్పుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ దుబయిలో ఉన్నారు. ఇటీవల ఒక వీడియో స్టేట్‌మెంట్‌లో ఆయన తనను వేధిస్తున్నారని చెప్పారు.
ఈ తీర్పుకు వ్యతిరేకంగా ముషరఫ్ లాయర్లు సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థిస్తే పాక్ అధ్యక్షుడు తన రాజ్యాంగ హక్కు కింద ఈ మరణశిక్షను రద్దు చేయవచ్చు.
ముషరఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు 2007లో ఆయన పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి అమలు చేసినప్పటిది. ఈ కేసు 20013 నుంచి పెండింగులో ఉంది. 1999లో అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ముషరఫ్ అధికారంలోకి వచ్చారు.
సైనిక దుశ్చర్యలకు కోర్టు చెక్
ముషరఫ్ 2007లో పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. ఆ తర్వాత పాకిస్తాన్ కీలక జడ్జిలను ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఇతర ప్రాంతాల్లో గృహనిర్బంధం చేశారు.
2013లో నవాజ్ షరీఫ్ తిరిగి అధికారంలోకి వచ్చినపుడు ముషరఫ్‌కు వ్యతిరేకంగా దేశద్రోహం కేసు నమోదైంది. ఆయనపై 2014 మార్చి 31 నుంచీ కోర్టులో విచారణలు ప్రారంభమయ్యాయి.
తగిన ఆధారాల ప్రకారమే జనరల్ ముషరఫ్‌ను దోషిగా ఖరారు చేశారని, సైనిక దుశ్చర్యకు మొదటిసారి కోర్టు షాక్ ఇచ్చిందని పాకిస్తాన్ సుప్రీంకోర్టు వకీల్ హినా జిలానీ చెప్పారు.
ఈ తీర్పుతో రాజ్యాంగం అత్యున్నతమైనది అనే సందేశం వెళ్తుందని, సైనిక దుశ్చర్యలు బలహీనం అవుతాయని ఆయన భావించారు.
"సైనిక దుశ్చర్యలకు వారిని బోనులో నిలబెట్టడమే కాదు, కఠిన శిక్షలు కూడా వేయాలి" అని జిలానీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీ
- భారత్-పాకిస్తాన్లలో గోదాములు నిండుగా ఉన్నా ఆకలికేకలు
- రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో మధ్యవర్తులు వీరే..
- బ్రసెల్స్ మ్యూజియం హత్యలు: 'అతడే మొదటి ఐరోపా జిహాదీ'
- మొబైల్ డేటా రేట్లు ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అత్యంత తక్కువ
- భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉన్నారా...
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)