రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో మధ్యవర్తులు వీరే..

అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు కేసును సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం కోసం పంపింది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఐదుగురు జడ్జిల ధర్మాసనం.. ముగ్గురు సభ్యులను మధ్యవర్తిత్వ కమిటీ సభ్యులుగా చేసింది.

సుప్రీంకోర్టు జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ ఖలీఫుల్లా(రిటైర్డ్) ఈ కమిటీకి అధ్యక్షుడుగా ఉంటారు.

ఆయనతోపాటు ప్యానల్‌లో ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచూ కూడా ఉన్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉత్తర ప్రదేశ్ అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం చేయనున్న ఈ ముగ్గురూ దక్షిణ భారతదేశానికి చెందినవారు.

ఈ కీలక కమిటీలోని ముగ్గురు మధ్యవర్తుల గురించి తెలుసుకుందాం.

శ్రీశ్రీ రవిశంకర్ నేపథ్యం

శ్రీశ్రీ రవిశంకర్ 1956లో తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించారు

ఒకసారి బీబీసీతో మాట్లాడిన ఆయన తన బాల్యం గురించి చెప్పారు.

"నేను చిన్నప్పుడు చాలా అల్లరిచేసేవాడ్ని. ఇప్పుడు కూడా అంతే. నేను ప్రతి పిల్లాడూ అల్లరి చేయాలని, పెద్దలను బాగా సతాయించాలని కోరుకుంటాను. కానీ ఈరోజుల్లో పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరులను చాలా చికాకు పెడుతున్నారు" అన్నారు.

"ఆటలు నాకు సిల్లీగా అనిపించేవి, చిన్నతనం నుంచే నేను తీవ్రంగా ఆలోచించేవాడిని. ఎవరైనా క్రికెట్ ఆడ్డం చూస్తే, దీనివల్ల ఏం లభిస్తుంది అనుకునేవాడ్ని. నాకు సంగీతం, నృత్యం, నటన అంటే చాలా ఆసక్తి ఉండేది. ఆటలంటే అంత నచ్చేది కాదు" అని రవిశంకర్ తెలిపారు.

శ్రీశ్రీ రవిశంకర్ చాలాసార్లు సినీ నటులతో కూడా కనిపించారు.

కానీ సినిమాల గురించి ఆయన ఎలా ఆలోచిస్తారు?

ఈ ప్రశ్నకు ఆయన "నేను సినీ నటులను ప్రముఖులుగా, తారల్లా చూడను. మొత్తం జీవితాన్నే నేను ఒక సినిమాగా భావిస్తాను. నా ముందుకు వచ్చే మనుషులు కూడా నాకు ఒక సినిమాలాగే అనిపిస్తారు. ప్రతి ఒక్కరూ హీరో, హీరోయిన్లే. అందరికీ తమకంటూ ఒక కథ ఉంటుంది. దాన్ని పరిష్కరించడానికే నేను చూస్తుంటాను" అన్నారు.

శ్రీశ్రీ రవిశంకర్ చాలా పాటలను సత్సంగాల్లో పాడుతుంటారు.

శ్రీశ్రీ రవిశంకర్ పాకిస్తాన్ పర్యటన

సుమారు ఏడేళ్ల క్రితం మార్చిలో ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు.

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తమ ఆశ్రమం ప్రారంభించిన తర్వాత ఆయన బీబీసీతో "తాలిబాన్, ఇతర ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు" చెప్పారు.

ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో "ఏదో ఒక విధంగా ప్రజల మధ్య దూరాలను తగ్గించాలని, శాంతి స్థాపన చేయాలనేదే నా మొదటి లక్ష్యం" అని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.

రామ జన్మభూమి, బాబ్రీమసీదుపై శ్రీశ్రీ రవిశంకర్

2017 మార్చిలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్య వివాదం పరిష్కరించకపోతే భారత్‌లో సిరియా లాంటి పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

అప్పుడు శ్రీశ్రీ రవిశంకర్ ఎన్‌డీటీవీతో మాట్లాడారు. "కోర్టు ఈ ప్రాంతం బాబ్రీ మసీదుదే అని చెబితే, జనం దానిని అంత సులభంగా, సంతోషంగా అంగీకరిస్తారా? 500 ఏళ్ల నుంచీ మందిరం కోసం పోరాటం చేస్తున్న చాలామందికి అది చేదు మాత్రలా మారుతుంది. అలాంటప్పుడు పరిస్థితి హింసకు కూడా దారితీయవచ్చు" అన్నారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశంకర్ "బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదానికి పరిష్కారం కోర్టు బయట వెతకాలి. ముస్లిం సమాజం రామ మందిరం కోసం తమ కేసులు త్యాగం చేయాలి. బదులు వారికి అయోధ్యలో మసీదు నిర్మించుకోడానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి" అన్నారు.

యమూనా తీరంలో శ్రీశ్రీ రవిశంకర్

శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 2015 మార్చిలో దిల్లీలో ఒక అంతర్జాతీయ సాంస్కృతిక వేడుకను నిర్వహించింది. యమునా తీరంలో జరిగిన ఈ వేడుకపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఒక వ్యక్తి దానిపై ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు.

ఆ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.

ఎన్‌జీటీ ఒక నిపుణుల ప్యానల్‌తో ఈ కేసును దర్యాప్తు చేసింది. "ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుక వల్ల యమునా తీరానికి తీరని నష్టం జరిగిందని" ఆ ప్యానల్ ఎన్‌జీటీకి చెప్పింది.

దాంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ సంస్థకు ఎన్‌జీటీ 5 కోట్ల జరిమానా విధించింది.

శ్రీశ్రీ రవిశంకర్ ఎన్‌జీటీ ఆదేశాలకు అంగీకరించలేదు. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.

జస్టిస్ ఎఫ్.ఎం. ఖలీఫుల్లా నేపథ్యం

జస్టిస్ ఖలీఫుల్లా తమిళనాడులోని శివగంగై జిల్లా కరైకూడికి చెందినవారు.

సుప్రీంకోర్టు జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ ఖలీఫుల్లా(రిటైర్డ్) దివంగత జస్టిస్ ఎం ఫకీర్ కుమారుడు. ఆయన వయసు 68 ఏళ్లు.

బీసీసీఐ పనితీరులో మార్పులకు సంబంధించిన ఆదేశాలను ఇచ్చిన బెంచ్‌లో ఆయన అప్పటి చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో పాటు ఉన్నారు.

ఆయన 2000 మార్చిలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

అదే ఏడాది ఏప్రిల్లో అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెప్టెంబరులో అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

2012 ఏప్రిల్లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ ఖలీఫుల్లా నాలుగేళ్లకు పైగా ఆ బాధ్యతల్లో కొనసాగారు. 2016 జులై 22న పదవీ విరమణ చేశారు.

మద్రాస్ హైకోర్టులో జడ్జిగా నియమితులు కాక ముందు జస్టిస్ ఖలీఫుల్లా 'టీఎస్ గోపాలన్ అండ్ కో' అనే న్యాయసేవల సంస్థలో భాగస్వామిగా ఉన్నారు.

కార్మిక చట్టాల కేసులు వాదించడంలో తనదైన ప్రత్యేకత ఉన్న ఆయన, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తరపున వాదనలు వినిపించారు.

జాతీయీకరణ చేసిన బ్యాంకులు, షెడ్యూల్డు బ్యాంకుల తరపున కూడా వాదించారు.

భారత విశ్వవిద్యాలయాల్లో వైదిక జ్యోతిష్యం కోర్సును ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ ఖలీఫుల్లా 2004లో ఇచ్చిన తీర్పు ఆయన ఇచ్చిన కీలక తీర్పుల్లో ఒకటి.

ఈ కోర్సును ప్రవేశపెట్టాలన్న నిర్ణయంలో జోక్యం చేసుకొనేందుకు ఆయన నిరాకరించారు.

''విద్యాబోధన లక్ష్యం విద్యార్థికి జ్ఞానాన్ని అందించడం. విద్యను టీచర్‌కే టీచర్‌గా చెబుతారు. విజ్ఞాన సముపార్జన కోసం చాలా అంశాల్లో అధ్యయనం చేసేందుకు అన్ని అవకాశాలూ ఉండాలి. విజ్ఞాన సముపార్జన ప్రయత్నాలను అడ్డుకోరాదు. వైదిక జ్యోతిష్యాన్ని ప్రవేశపెడితే అందులో విజ్ఞానం సంపాదించేందుకు విద్యార్థికి వీలు కలుగుతుంది. తన భవిష్యత్తు కోసం ఏం చదవాలనేది విద్యార్థి ఇష్టం. ఒక సబ్జెక్టు (వైదిక జ్యోతిష్యం) మూలాలు ఒక మతంలో ఉన్నంత మాత్రాన ఆ కోర్సును ప్రవేశపెడితే అది కేవలం ఆ మతం వ్యాప్తికే దోహదపడుతుందని అనలేం. ఈ అంశాల దృష్ట్యా, వైదిక జ్యోతిష్యం కోర్సును శాస్త్రీయ అధ్యయనం కోసం ప్రవేశపెట్టడాన్ని నిషేధించాలని చెప్పలేం'' అని జస్టిస్ ఖలీఫుల్లా తన తీర్పులో చెప్పారు.

ఇలాంటి కేసే తన ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ తరహాలోనే తీర్పు వెలువరించింది.

శ్రీరాం పంచూ నేపథ్యం

శ్రీరాం పంచూ ఒక సీనియర్ అడ్వకేట్, ఆయన ప్రముఖ మధ్యవర్తిగా పనిచేస్తున్నారు. పంచూ 'ద మీడియేషన్ చాంబర్స్' వ్యవస్థాపకులు కూడా.

ఈ సంస్థ వివాదాలను సెటిల్ చేయడం, మధ్యవర్తిత్వం చేస్తుంటుంది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మీడియేటర్స్(ఐఎంఐ)కి శ్రీరాం పంచూ అధ్యక్షులుగా ఉన్నారు.

2005లో ఆయన భారత దేశంలో కోర్టుతో సంబంధం ఉన్న మొదటి మధ్యవర్తిత్వం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ చట్ట వ్యవస్థ, అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వం నెరపడంలో శ్రీరాం పంచూ సమర్థమైన పాత్రను పోషించారు.

భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో వ్యాపార, పారిశ్రామిక వివాదాలను పంచూ సెటిల్ చేశారు. కుటుంబ ఆస్తుల వివాదాల నుంచి దివాలా, పారిశ్రామిక పోటీ, ఐటీ వివాదాలు, మేధో సంపదకు సంబంధించిన కేసులలో కూడా మధ్యవర్తిత్వం చేయడంలో ఆయన సఫలం అయ్యారు.

శ్రీరాం పంచూ అంతర్జాతీయ వ్యాపార వివాదాలను కూడా సెటిల్ చేశారు. సుప్రీంకోర్టు ఆయన్ను అసోం, నాగాలాండ్ మధ్య ఒక వివాదం పరిష్కరించడం కోసం మధ్యవర్తిగా నియమించింది. దానితోపాటు కోర్టు ఆయనను ముంబైలో పార్శీ సమాజానికి సంబంధించిన ఒక వివాదం సెటిల్మెంటుకు కూడా మధ్యవర్తిగా నియమించింది.

లీగల్ మధ్యవర్తిత్వంపై శ్రీరాం పంచూ Settle for More and Mediation: Practice & Law పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. భారత సుప్రీంకోర్టు పంచూను 'గౌరవనీయ మధ్యవర్తి' 'దేశంలోని అత్యంత సీనియర్ మధ్యవర్తుల్లో ఒకరు' లాంటి విశేణాలతో పిలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)