You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ దార్ ఇంటి దగ్గర ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
ఈ దాడి జమ్ము-శ్రీనగర్ హైవేపై జరిగింది. అది జరిగిన ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ దార్ ఇల్లుంది.
కాక్‌పోరా గ్రామంలో ఉన్న ఇంటి నుంచి ఏడాది క్రితం పరారైన ఆదిల్ దార్ తర్వాత జైషే మహమ్మద్‌లో చేరాడు. వారి కోసం తుపాకీ పట్టాడు.
దార్ ఇల్లు ఒక రెండతస్తుల భవనం. అక్కడ మొదటి అంతస్తులో కుటుంబం అంతా గుమిగూడి ఉంది. వారిది వ్యవసాయ కుటుంబం. చలి, వర్షం మధ్య నేను అక్కడకు చేరుకున్నప్పుడు, మొదట ఆదిల్ ఇద్దరు అన్నలు, ఆయన తండ్రి బీబీసీతో మాట్లాడ్డానికి నిరాకరించారు.
కాసేపటి తర్వాత ఆదిల్ తండ్రి గులామ్ హసన్ దార్ కాస్త ఓపెన్ అయ్యారు. "మృతదేహాన్ని ఇంటికి తీసుకురాలేదు. కొడుకుని ఖననం చేయలేదు. అందుకే అరకొరగా అనిపిస్తోంది" అన్నారు.
నేను, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయినందుకు మీకు బాధ లేదా? అని అడిగాను.
సమాధానంగా ఆయన "సైనికులు కూడా తమ పని తాము చేస్తుంటారు. వారు లేకపోవడం వారి కుటుంబాలకు కూడా బాధగానే ఉంటుంది. మాలాగే కొన్ని కుటుంబాలకు వారి కొడుకుల మృతదేహాలు కూడా అందుండవు. వాళ్లకు కూడా మా బాధ తెలిసి ఉంటుంది" అన్నారు.
ఆదిల్‌కు జైష్‌తో సంబంధం ఉంది. కానీ, పుల్వామా సహా దక్షిణ కశ్మీర్‌లో పాకిస్తాన్ నుంచి నడిచే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా కార్యకలాపాలు తక్కువ. నిపుణుల ప్రకారం ఇక్కడ హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్లు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు.
ఒకప్పుడు టీచర్‌గా పనిచేసిన 33 ఏళ్ల రియాజ్ నాయికూ హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు. నాయికూ పేరు కశ్మీర్ లోయలోని మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ల లిస్టులో అందరికంటే పైనుంది.
రియాజ్ నాయికూ ఎవరు?
రియాజ్ నాయికూ గ్రామం పుల్వామాలోని బేగ్‌పురా. ఏడేళ్ల క్రితం గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాయికూ తర్వాత ఆయుధం పట్టాడు.
అతడి కుటుంబం కూడా ఎప్పుడో ఒకప్పుడు తమ ఇంటికి నాయికూ మృతదేహం వస్తుందని నిశ్చయించుకుంది. "ఎప్పుడు ఎన్‌కౌంటర్ జరిగినా, చనిపోయిన వారిలో తన కొడుకు ఉన్నాడేమో అనిపిస్తుందని" అతడి తండ్రి అసదుల్లా నాయికూ చెప్పారు.
వేర్పాటువాద మద్దతుదారుడుగా, ఒక తండ్రిగా మీరు ఎలాంటి సంఘర్షణ ఎదుర్కుంటున్నారని ఆయన్ను అడిగితే "ఒక ముస్లిం అయినందుకు అది మాకు గర్వంగానే ఉంది. అది తప్పని మేం చెప్పం. తను డ్రగ్స్, లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటే, మాకు పరువు పోయేది. కానీ తను సరైన పనే చేస్తున్నాడని మాకు అనిపిస్తోంది" అని అసదుల్లా అన్నారు.
కశ్మీర్ సమాజం ఎలా ఆలోచిస్తోంది?
స్థానికుల నుంచి మిలిటెంట్లకు సాయం అందుతోందని కశ్మీర్‌లో పనిచేస్తున్న అధికారులు అందరికీ తెలుసు.
డార్ కుటుంబమైనా, నాయికూ కుటుంబమైనా వారు సామాన్యులే. కానీ వారి కొడుకులు తుపాకీ పట్టి చనిపోయినపుడు, సమాజంలో వారికి చాలా గౌరవం లభిస్తోంది. మిలిటెంట్లకు స్థానికుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. స్థానికులు వారికి ఆశ్రయం ఇవ్వకపోతే, వారికి ఆహారం అందించకపోతే, పోలీసులు రాకముందే వారిని హెచ్చరించకపోతే ఇక్కడ హింసాత్మక ఆందోళనలు ఎక్కువ రోజులు కొనసాగవు.
కానీ, అటు భద్రతా దళాలకు స్థానికుల ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్ భారీగానే ఉంది. ఎవరైనా లోకల్ ఇన్ఫార్మర్ మిలిటెంట్ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇచ్చినపుడే ఇక్కడ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. మిలిటెంట్లను చుట్టుముట్టిన సమయంలో వారికి స్థానికుల అండ ఉండడం వల్ల దార్ లేదా నాయికూ లాంటి వారు తరచూ తప్పించుకుంటున్నారు.
ఎన్‌కౌంటర్ జరుగుతున్నప్పుడు గ్రామంలో కొందరు వారు తప్పించుకోడానికి సాయం చేస్తే, ఒక్కోసారి కొందరు పోలీసులకు అడ్డంగా నిలబడుతూ, ఇంకోసారి భద్రతా దళాలపైకి రాళ్లు విసురుతూ వారికి అండగా ఉంటున్నారు.
జమ్ము-కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కశ్మీర్‌లో ప్రస్తుతం మిలిటెంట్ స్ట్రాటజీ మారిందా అని మేం అడిగాం. దానికి ఆయన నాకు తెలిసి పాకిస్తాన్‌లో కూర్చున్న మిలిటెంట్ సంస్థల నేతలపై "మీరు చాలా పరువు తీశారు, ఏదైనా పెద్దది చేయండి' అని చాలా ఒత్తిడి తెస్తున్నారు. అందుకే పాకిస్తాన్, ఐఎస్ఐ ఒత్తిడితో వారి స్ట్రాటజీ తరచూ మారుతూ ఉంటుంది" అన్నారు.
కశ్మీర్ లోయలో అత్యంత యాక్టివ్‌గా ఉండే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి మూడు సంస్థలకు వేర్వేరు ఇస్లాం ఆలోచనాధోరణి ఉంది. మొదటి రెండు పాకిస్తాన్‌కు చెందినవి. కశ్మీర్‌లో వాటి ఉనికి ఉంది. వీటిలో కొందరు స్థానిక మిలిటెంట్స్ కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది సరిహద్దు అవతలి వైపు నుంచే వస్తారు. ఈ మూడు సంస్థలు కలిసి ఏర్పడిన 'జీహాద్ కౌన్సిల్' పాకిస్తాన్‌లో ఉంది. దాన్లో మసూద్ అజర్, హఫీజ్ మహమ్మద్ సయీద్ ఉన్నారు.
ఐడియాలజీలో పరస్పరం అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ తరచూ వీరి మధ్య ఆపరేషనల్ సఖ్యత కనిపిస్తుంది. పుల్వామాలో అదే జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ముందు ముందు దాడులు జరిగే అవకాశం ఉందా?
దిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థి అయ్మాన్ మాజిద్ కశ్మీర్‌లో వేర్పాటువాదుల హింసపై లోతుగా రీసెర్చ్ చేశారు. "నాకు తెలిసి ఇలాంటి దాడులు ఎక్కువగా కనిపించవు. కశ్మీర్లో ఇలాంటి దాడులు మళ్లీ జరగవచ్చని మీడియా చెబుతోంది. కానీ పుల్వామా లాంటి పెద్ద దాడులు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి" అన్నారు.
పుల్వామా దాడి గురించి విచారణ కొనసాగుతోంది. కానీ ఇది ప్రభుత్వ వ్యూహం వైఫల్యాలను చూపిస్తోందా? సమాధానంగా కశ్మీర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇబ్రహీమ్ వనీ "ప్రభుత్వం గత ఏడాది మిలిటెన్సీపై అదుపు సాధించామని చెప్పింది. కానీ పుల్వామా దాడితో అది జరగలేదని తేలింది. 2018లో చాలా మంది మిలిటెంట్స్ చనిపోయారని, సైన్యం విజయం సాధించిందని అన్నారు. కానీ అది తప్పని తెలిసింది" అన్నారు.
ఎదురుకాల్పుల్లో ఒక మిలిటెంట్ చనిపోతే, మరొకరు పుట్టుకొస్తారని అధికారులకు తెలుసు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న సాయుధ యువకుల సంఖ్య ఒకప్పుడు 150 నుంచి 250 మంది వరకూ ఉండేది. భద్రతా దళాలను ఇబ్బంది పెట్టడానికి, వారిని ఎంగేజ్ చేయడానికి ఈ సంఖ్య చాలని మిలిటెంట్లకు తెలుసు.
దక్షిణ కశ్మీర్‌లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో భద్రతా దళాల జవాన్లే ఎక్కువగా మృతి చెందుతున్నారు. ఇది మైదాన ప్రాంతం. ఇక్కడ అడవులు కూడా తక్కువ. అందుకే ఇక్కడ స్థానిక హిజ్బుల్ ముజాహిదీన్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంది. కశ్మీరీ భాష తెలీదు కాబట్టి లష్కర్, జైష్ మిలటెంట్స్ ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
నిఘా ఏజెన్సీల ప్రకారం ఉత్తర కశ్మీర్‌లో జైష్, లష్కరే మిలిటెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కొండల్లో అడవుల్లో దారుల గురించి వాళ్లకు బాగా తెలుసు. వాళ్లకు సైనిక విధానాల గురించి కూడా తెలుసు. హిజ్బుల్ మిలిటెంట్లతో పోలిస్తే వారికి చాలా అనుభవం ఉంది. వీరిలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉంటారు. ఇటీవల హంద్‌వాడాలో ఒక ఎన్‌కౌంటర్ 72 గంటలు నడిచింది. దీన్లో భద్రతా దళాలకే ఎక్కువ నష్టం జరిగింది. పాకిస్తానీల హస్తం ఉన్న చోట, అదుపు చేయడం కష్టమని ఒక జర్నలిస్టు చెప్పారు.
ఇప్పుడు ముందున్న దారేంటి?
కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగు పడ్డాయని అనిపిస్తున్న సమయంలో పుల్వామా దాడి జరిగిందని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు.
కశ్మీర్‌లో హింసకు మళ్లీ చర్చలు కొనసాగించడమే పరిష్కారం అని ఆయన అంగీకరించారు. "మొదట పరిస్థితులు మెరుగుపడాలి, స్థానికులు పాకిస్తాన్ మిలిటెంట్స్‌కు సహకరించడం మానేయాలి. అప్పుడే చర్చల ప్రక్రియ ప్రారంభించవచ్చు" అన్నారు.
గులామ్ హసన్ దార్ ఆత్మాహుతి దాడి చేసిన ఒక మిలిటెంట్ తండ్రి. ఆయన మాటిమాటికీ ఈ పరిస్థితికి కారణం కేంద్ర, రాష్ట్ర నేతలే అంటున్నారు. తన కొడుకు మిలిటెంట్ కాకుండా ప్రభుత్వాలు ఆపలేకపోయాయని చెబుతున్నారు. కానీ ఆయన దృష్టిలో ఈ హింసను అడ్డుకోడానికి ఒకే ఒక దారుంది. భారత్, పాకిస్తాన్, కశ్మీర్ చర్చలు.
హింసలో చివరికి చనిపోయేది మనుషులేనని దార్ అంటున్నారు. "హిందూ, సిక్కు, ముస్లిం అందరూ మనుషులే. చనిపోయేది ఒక మనిషే. నేతలు తమ స్వార్థం చూసుకోకుండా కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకడం మంచిది" అన్నారు.
పుల్వామా తర్వాత దాదాపు రోజూ ఎన్‌కౌంటర్లు జరుగుతుండడంతో లోయలో హింసకు ఇప్పుడప్పుడే తెరపడదని అనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి.
- 292 మంది మిలిటెంట్లు చనిపోయారా: FactCheck
- కార్గిల్‌కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్‌ల దాడుల చరిత్ర
- భారత్ మిరాజ్ యుద్ధ విమానాలనే ఎందుకు ఉపయోగించింది... బాలాకోట్ ఎక్కడుంది...
- భారత యుద్ధ విమానాలను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయింది
- టీవీ చానెళ్లు పాక్‌పై వైమానిక దాడి అంటూ మీకు చూపెట్టిన వీడియో.. వాస్తవానికి ఓ వీడియో గేమ్‌లోనిది
- ఓ విమానాన్ని కూల్చేశాం.. మరో విమానాన్ని కోల్పోయాం, పైలెట్ అచూకీ తెలియడం లేదు - భారత్
- విశాఖకు రైల్వే జోన్: సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)