You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అభినందన్ రాక తరువాత పుల్వామా దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు...
భారతీయ వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన తరువాత అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొత్త మలుపు తిరిగాయి.
అభినందన్ రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వచ్చినందుకు బీజేపీ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తున్నాయి. తీవ్రవాదం పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే, పుల్వామా మానవబాంబు దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబ సభ్యులకు మాత్రం ఈ రాజకీయ వాద ప్రతివాదాలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయి.
పంజాబ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులను బీబీసీ కలిసింది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వారి మానసిక స్థితి ఎలా ఉంది, వారు ఏం ఆశిస్తునానారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఎన్నికలకు ముందే విచారణ పూర్తవ్వాలి
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఉంటున్న రంజిత్ కుమార్ గౌత్ అన్న అజిత్ కుమార్ గౌతం కూడా పుల్వామా దాడిలో చనిపోయారు.
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి స్వదేశానికి రావడం తమకు ఆనందం కలిగిస్తోందని చెప్పిన రంజిత్, తమ కుటుంబం అంతా కూడా పుల్వామా దాడి మీద విచారణ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తోందన్నారు.
బీబీసీ ప్రతినిధి సమీరాత్మజ్ మిశ్రతో మాట్లాడుతూ, దీనిపై విచారణ జరగాలని ఆయన అన్నారు. అంతేకాదు, ఈ ఘటనను ఏ పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరారు.
"ఈ దాడి ఎలా జరిగింది, ఏ ఉద్దేశంతో జరిగిందనే విషయాలపై విచారణ జరగాలి. ఈ దాడి వల్ల ఏ వ్యక్తికీ, ఏ రాజకీయ పక్షానికీ ప్రయోజనాలు కలగడమన్నది లేకుండా ఎన్నికలకు ముందే ఈ విచారణ పూర్తి కావాలి" అని రంజిత్ అన్నారు.
మా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దీనిపై విచారణ జరగాలని కోరుకుంటున్నారని చెప్పిన రంజిత్, "జవాన్లు మొదటి నుంచీ అప్రమత్తంగానే ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. ఆరోజు జమ్మూ బంద్ జరిగిందని కూడా విన్నాం. అక్కడ ఏదో ప్రమాదం జరగవచ్చన్నది ముందే తెలిసినప్పటికీ, ఎలాంటి భద్రత లేకుండా అన్ని వాహనాలు అక్కడికి పంపించారు" అని సందేహం వ్యక్తం చేశారు.
క్షేత్ర స్థాయిలో శాంతి స్థాపనకు కృషి చేయాలి
పాకిస్తాన్ ప్రధానమంత్రి శాంతి చర్చలకు ఇచ్చిన పిలుపును పరిగణనలోకి తీసుకుంటూనే, క్షేత్ర స్థాయిలో శాంతి స్థాపనకు అడ్డుపడుతున్న ప్రతి అంశాన్నీ పరిశీలించాలని అంటున్నారు పుల్వామా దాడిలో అసువులు కోల్పోయిన సుఖ్‌జిందర్ సింగ్ కుటుంబ సభ్యులు.
ఫిబ్రవరి 14న జరిగిన మిలిటెంట్ల దాడిలో సుఖ్‌జిందర్ సింగ్ చనిపోయారు. ఆయన స్వగ్రామం తరన్ తరన్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గందీవిండ్.
ఇప్పుడు ఆ ఇంట్లో ఆయన భార్య, 8 నెలల బిడ్డ, తల్లి, తండ్రి, అన్న ఉంటున్నారు.
సుఖ్‌జిందర్ అన్న గుర్జంట్... బీబీసీ ప్రతినిధి సహయోగి రవిందర్ సింగ్‌తో మాట్లాడుతూ, "ఫిబ్రవరి 14న మా తమ్ముడు చనిపోయినట్లు మాకు వార్త తెలిసింది. మా దృష్టిలో యుద్ధం ఆరోజే మొదలైంది. యుద్ధం అంటే ఏమిటో మా కుటుంబానికి కూడా తెలుసు. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ఒక శాంతి సందేశాన్ని ఇచ్చారు. ఈ సంకేతాన్ని గుర్తించి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాలి" అని అన్నారు.
సుఖ్‌జిందర్ తండ్రి గుర్మేజ్ సింగ్ కూడా, "మనుషులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తుంటారు. మిలిటెంట్ల దాడిలో నా బిడ్డ చనిపోయాడు. అయితే, భవిష్యత్తులో ఇలా ఎవరి బిడ్డ కూడా ఇలా మిలిటెంట్ల దాడిలో చనిపోకుండా చూడాలి. శాంతికి మనం శాంతితోనే బదులివ్వాలి" అని అన్నారు.
సోదురుడి మృతితో దిగాలుగా ఉన్న గుర్జంట్ సింగ్, "ఇవాళ వాళ్ళు మనవాళ్ళను 40 మందిని చంపారు. మనం రేపు 400 మందిని చంపేస్తాం. ఆ తరువాత వాళ్ళు 800 మందిని చంపేస్తారు. అప్పుడు మనం 8 వేల మందిని చంపుతూ పోవాలా... ఇలా ఎన్ని కుటుంబాలు దిక్కులేనివై పోవాలి? ఇదంతా ఆగిపోవాలి" అని అన్నారు.
పాకిస్తాన్‌ను తిట్టడం తప్పు
భారత్-పాకిస్తాన్ దేశాల మాటల యుద్ధంలో పుల్వామా విచారణ అంశం కొట్టుకుపోతుందేమోనని, ఆ దాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ సంజయ్ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.
సంజయ్ తండ్రి మహేంద్ర ప్రసాద్, బీబీసీ ప్రతినిధి సహయోగి నీరజ్‌తో మాట్లాడుతూ, "ఇదంతా చూస్తుంటే మనసంతా బాధతో నిండిపోతోంది. మంచి ఏదీ జరగడం లేదు. అలాంటి ఘటనలు తగ్గడం లేదు. ఇంకా పెరుగుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాదు. కానీ, చేయాల్సినంత చేయడం లేదు. దాడి జరిగినప్పుడు అందరూ మాట్లాడతారు. ఆ తరువాత కొన్ని రోజులకు మరిచిపోతారు. మళ్ళీ ఇంకో దాడి జరుగుతుంది. ప్రభుత్వం దీని గురించి లోతుగా ఆలోచించాలి. ఈ దాడులను పూర్తిగా లేకుండా చేయాలని మేం ప్రధానమంత్రిని కోరుతున్నాం" అని అన్నారు.
"భారత వైమానిక దళం ఎలాగైతే తీవ్రవాద శిబిరాల మీద దాడులుప చేసి వాటిని ధ్వంసం చేసిందో... అలాగే ఇంకా చాలా చేయాలి. తీవ్రవాద శిక్షణ శిబిరాలు ఎక్కడున్నా రూపుమాపాలి" ఆ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరి యుద్ధం వస్తే ఇలాగే మరికొందరు తండ్రులు తమ బిడ్డలను కోల్పోతారు కదా అన్నప్పుడు, "అవును అలాగే జరుగుతుంది. కానీ, మరో మార్గమేమిటి? పాకిస్తాన్ సానుకూలంగా స్పందించడం లేదు. తీవ్రవాదాన్ని అది అంతం చేయడం లేదు. ఇక బిడ్డల విషయానికి వస్తే.. నేనెలాగూ నా బిడ్డను కోల్పోయాను...." ఆవేదనతో చెప్పాపు,.
ఆ తరువాత ఆయనే తనను తాను స్థిమితపరచుకుంటూ, "ఇంకా ఏం చెప్పాలి... పాకిస్తాన్ కూడా మన ప్రజలున్న దేశమే. ఒకప్పుడు కలిసి ఉన్న దేశమే. అన్నాతమ్ములు తాము అన్నాతమ్ముల్లాగా వ్యవహరించాలని తెలుసుకోవాలి. పాకిస్తాన్‌ను తిట్టే వారు, దూషించే వారు చాలా తప్పు చేస్తున్నారు. ఒక దేశంలోని నాగరిక పౌరులు, మరొక దేశాన్ని కూడా అంతే గౌరవంగా చూడాలి" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- #BBCSpecial: మసూద్ అజర్‌ను టెర్రరిస్టుగా ప్రకటించాలనే డిమాండ్‌కు చైనా అడ్డుపుల్ల ఎందుకు?
- ఒసామా బిన్ లాడెన్ సాయంతో జైష్-ఎ-మొహమ్మద్ ఎలా ఏర్పాటైంది?
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలా ప్రకటిస్తుంది?
- ఇండియన్ ఆర్మీ: ‘‘కశ్మీర్ తల్లులారా... ఉగ్రవాదంలో చేరిన మీ పిల్లలను లొంగిపోమని చెప్పండి... లేదంటే వాళ్లు చనిపోతారు’’
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- కార్గిల్‌కు ముందు... ఆ తరువాత కశ్మీర్లో భారత్-పాక్‌ల దాడుల చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)