కశ్మీర్ దాడి: పుల్వామా మారణహోమం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు

    • రచయిత, అనురాధ భాసిన్ జమ్వాల్
    • హోదా, బీబీసీ కోసం

కశ్మీర్‌లో ఇంకా ఎంత రక్తం పారాలి?

పుల్వామాలో జరిగిన భీకర దాడిలో పెద్ద సంఖ్యలో భారత జవాన్లు అసువులుబాసిన ఘటన ఈ ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది.

2016 సెప్టెంబరులో ఉరీ సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి తరువాత ఇది మరో భీతావహ ఘటన. 2001 అక్టోబరులో శ్రీనగర్‌లో అసెంబ్లీపై జరిగిన పాశవిక దాడిని ఇది తలపించింది.

అయితే.. దాడికి పాల్పడిన విధానం, జరిగిన నష్టం విషయంలో మాత్రం గతంలోని అన్ని దాడుల కంటే కూడా ఇది ఇంకా తీవ్రమైనదనే చెప్పాలి.

దాడి జరిగిన వెనువెంటనే రాజకీయ నాయకులు, అధికారులు అంతా దాడిని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, జనరల్ వి.కె.సింగ్(మాజీ ఆర్మీ చీఫ్) ''ఉగ్రవాదులకు మర్చిపోలేని గుణపాఠం చెబుతాం'' అన్నారు.

అధికార స్థానాల్లో ఉన్నవారు చేసే ఇలాంటి వ్యాఖ్యలు.. కశ్మీర్‌ సమస్యపై ఉన్న అవగాహన లేమి, లోపభూయిష్ట పరిష్కారాలను పదేపదే వల్లించే తీరును మరోసారి బయటపెడుతున్నాయి.

ఇలాంటి ఘటనల సమయంలో సైనికుల పరాక్రమాన్ని ఘనంగా చూపుతూ బాధ్యతల నుంచి తప్పుకొనే ధోరణికీ ఇది నిదర్శనం.

సరిహద్దుల్లోను, కుట్రదారులతోనూ పోరాడటం సైనికుల బాధ్యత అయితే... ఇలాంటి హింసాత్మక పరిస్థితులను తప్పించాల్సిన నైతిక బాధ్యత రాజకీయ నాయకులది.

కానీ, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇలాంటి బాధ్యతాయుత పాత్రను ప్రస్ఫుటం చేయలేకపోతున్నాయి.

ఏమాత్రం ఆలస్యం లేకుండా, ఏ ఒక్క కోణాన్నీ విడిచిపెట్టకుండా ఈ కేసులో దర్యాప్తు చేయడం అత్యవసరం. దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న రహదారిలో ఇలాంటి దాడి జరిగిందంటే లోపమెక్కడ ఉంది? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

అయితే, బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య రాజ్యాల నుంచి రాజకీయంగా కానీ, చర్యలపరంగా కానీ ప్రతీకార విధానాలను ఆశించరాదు.

పైగా ఇలాంటి చర్యల వల్ల శాంతి స్థాపన జరుగుతుందన్న నమ్మకం ఏమీ లేదు. ప్రతీకార దాడుల వల్ల కేవలం మరింత రక్తం చిందుతుంది.. దాని వల్ల కశ్మీర్ లోయ, భారతావనికి నష్టం కలిగే ప్రమాదమూ ఉంది.

కాబట్టి, దీనికి బదులుగా.. కశ్మీర్ లోయలో సైనికులు, రాజ్యేతర సాయుధ శక్తులు, పౌరులు ప్రాణాలు ఎందుకు బలవుతున్నాయన్న ప్రశ్న వేసుకోవాలి. అంతేకాదు, ఈ పరిస్థితులకు ముగింపు పలికేందుకు ఎలాంటి పరిష్కారం చూపాలన్నదీ ఆలోచించాలి.

కశ్మీర్‌లో మిలిటెన్సీని రూపుమాపే విధానాలు అనుసరించడానికి బదులు మిలిటెంట్లను హతమార్చి విజయోత్సవాలు చేసుకోవడమనేది పెరగడంతో... ప్రతిగా యువత ఆయుధాలు పట్టి భారత భద్రతాదళాలతో పోరాడడమనేదీ పెరిగిపోయింది.

ఇక్కడ మిలిటెన్సీ అనేది కశ్మీర్ సమస్య వేర్లలోంచి పుట్టిన ఒక మొక్క. ఇదొక అపరిష్కృత రాజకీయ వివాదం. ప్రజాస్వామిక హక్కుల విధ్వంసానికి, మానవ హక్కుల హననానికి ఇదొక నిదర్శనం. ఈ విషయంలో రాజకీయ చొరవ లేకుండా ఎలాంటి సైనిక ప్రయత్నం చేసినా అది తప్పుడు మార్గంలో వెళ్లినట్లే.

గత 7 దశాబ్దాల్లో.. ముఖ్యంగా తిరుగుబాటు మొదలైన 1990ల నుంచి కశ్మీర్ వివాదం విషయంలో అన్ని ప్రభుత్వాలదీ ఒకే తీరు.

కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సంక్షోభ పరిష్కారం దిశగా కాకుండా.. విరామం లేకుండా సాగిస్తున్న సైనిక విధానం ద్వారా సంక్షోభం మరింత ముదిరేలా వ్యవహరిస్తోంది.

2016 నుంచి కశ్మీర్ ప్రజల విషయంలో బుల్లెట్లు, పెల్లెట్లు, దాడులు, విరుచుకుపడడాలు, అరెస్టులే ఏకైక విధానంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఇలాంటి విధానం హింసాకాండను కానీ మిలిటెన్సీని కానీ ఆపలేదు. 2018లో 250 మంది మిలిలెంట్లను హతమార్చగా అంతకంటే ఎక్కువ మంది కొత్తగా తుపాకులు పట్టారు.

పాతుకుపోయిన ఈ సమస్యను పరిష్కరించడానికి శాంతియుత మార్గంలో గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప కశ్మీర్ లోయలో రక్తపుటేరులు ఆగవు.

అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లతో చర్చలకు ప్రపంచ దేశాలు చూపిన మార్గానికి భారత్‌ కూడా మద్దతిచ్చింది. అలాంటప్పుడు కశ్మీర్ విషయంలో మాట్లాడడానికి భారత్ ఎందుకు ఊగిసలాడుతుంది?

ఈ సమస్య పరిష్కరానికి సరికొత్త మార్గాలు అన్వేషించాల్సి ఉంది. అలాగే, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం.. పాకిస్తాన్, జమ్ముకశ్మీర్ ప్రజలతో ఒకేసారి చర్చలు జరపడం వంటివి అవసరం.

ఈ విషయంలో భారత్ ఉత్తర ఐర్లాండ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఉత్తర ఐర్లాండ్ రక్తసిక్తంగా మారినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం స్నేహపూర్వక విధానాలతోనే సమస్యను పరిష్కరించింది.

పుల్వామా దాడి ఒక హెచ్చరిక. మిలిటెన్సీలోని కొత్త ధోరణులను ఇది సూచిస్తోంది. గత ఘటనలకు భిన్నంగా జరిగిన ఈ భీతావహ దాడి.. కశ్మీర్ విషయంలో అనుసరిస్తున్న లోపభూయిష్ఠ విధానాలు మానవ హననమనే సుడిగుండంలోకి నెడుతున్న సంగతి స్పష్టం చేసింది.

(రచయిత 'కశ్మీర్ టైమ్స్' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)