You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాటో అంటే ఏమిటి? అది ఎందుకు ఏర్పడింది.. దానికి ఇంకా ప్రాధాన్యం ఉందా
ప్రచ్ఛన్న యుద్ధం తొలి దశల్లో 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)ను సభ్య దేశాల ఉమ్మడి రక్షణకు ఒక రాజకీయ, సైనిక కూటమిగా నెలకొల్పారు.
డెబ్బై ఏళ్ల తర్వాత ఎంతో మారిపోయిన, భద్రతా ప్రాధామ్యాలు అత్యంత విభిన్నంగా ఉన్న ప్రపంచంలో దీనికి ఇంకా ప్రాధాన్యం ఉందా?
ఇటీవలి కాలంలో నాటోలో అంతర్గత వాతావరణం సామరస్యంగా లేదు. సంస్థను గురించి, ఇతర సభ్య దేశాల గురించి అమెరికా, ఫ్రాన్స్, టర్కీలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నాయి.
చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక కూటమిగా దీన్ని సమర్థించేవారు అభివర్ణిస్తున్నప్పటికీ నాటో భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాటో ఎలా రూపొందింది?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్‌ను నిలువరించడం ప్రధాన లక్ష్యంగా పది ఐరోపా దేశాలతో పాటు అమెరికా, కెనడా సభ్య దేశాలుగా నాటో ఏర్పాటైంది.
నాటి యుద్ధంలో ఒక విజేతగా ఆవిర్భవించిన తర్వాత సోవియట్ సైనిక బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు యూరప్‌లోనే కొనసాగాయి. తూర్పు జర్మనీ సహా పలు దేశాలపై రష్యా బలమైన ప్రభావం చూపింది.
యుద్ధం తర్వాత జర్మనీ రాజధాని బెర్లిన్‌ను విజేతలు ఆక్రమించారు. 1948 మధ్యలో సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల నియంత్రణలో ఉన్నప్పటికీ పూర్తిగా తూర్పు జర్మనీ పరిధిలోనే ఉన్న పశ్చిమ బెర్లిన్‌కి వ్యతిరేకంగా దిగ్బంధం మొదలుపెట్టారు.
నగరంలోకి వాయుమార్గంలో సైనిక బలగాలను విజయవంతంగా పంపించడం వల్ల ముఖాముఖి ఘర్షణ జరగలేదు. కానీ ఆ సంక్షోభం వల్ల సోవియట్ శక్తికి వ్యతిరేకంగా ఒక కూటమి రూపకల్పనను వేగవంతమైంది. 1949లో అమెరికా మరో 11 దేశాలు (బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, నార్వే, బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఐస్‌ల్యాండ్, లక్సెంబర్గ్) ఒక రాజకీయ, సైనిక కూటమిగా ఏర్పడ్డాయి.
ఈ సంస్థ 1952లో గ్రీస్, టర్కీలను చేర్చుకుని విస్తరించింది. 1955లో పశ్చిమ జర్మనీ కూడా చేరింది.
1999 నుంచి మాజీ తూర్పు కూటమి (ఈస్ట్రన్ బ్లాక్) దేశాలు కూడా ఇందులో చేరాయి. మొత్తం సభ్య దేశాల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా 2017 జూన్‌లో మాంటెనిగ్రో కూడా నాటో భాగస్వామిగా మారింది.
ఈ నాటో ఎందుకు?
నాటో అధికారికంగా చెప్తున్న ప్రధాన కారణం.. ''ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సుస్థిరత, శ్రేయస్సులను పెంపొందించటం ద్వారా సభ్య దేశాల స్వాతంత్ర్యం, ఉమ్మడి వారసత్వం, నాగరికతలను సంరక్షించటం''.
నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశం మీద సాయుధ దాడి జరిగితే.. దానిని తమందరి మీదా దాడిగా పరిగణించటం జరుగుతుందని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నాటో ఒప్పందం స్పష్టంచేస్తోంది.
ఆచరణలో.. ''తన యూరప్ సభ్య దేశాల భద్రత ఉత్తర అమెరికా సభ్య దేశాల భద్రతతో విడదీయలేనంతగా ముడిపడి ఉంద''ని కూటమి చూపుతోంది.
ఈ భద్రతకు సోవియట్ యూనియన్‌ను, కమ్యూనిజాన్ని ప్రధాన ముప్పుగా ఈ సంస్థ పరిగణించింది.
కానీ.. నాటో ఏర్పాటైనప్పటి నుంచీ దాని సరిహద్దులు రష్యా రాజధాని మాస్కోకు 1000 కిలోమీటర్ల సమీపానికి జరిగాయి.
తూర్పు యూరప్‌లో 1989 విప్లవాలు, సోవియట్ యూనియన్ ముగిసిన అనంతరం.. ఒకప్పటి సోవియట్ శాటిలైట్ దేశాలను కూడా తన సభ్య దేశాలుగా నాటో ఇప్పుడు లెక్కిస్తోంది.
సోవియట్ రష్యా లేనపుడు.. నాటో ఇంకా ఎందుకుంది?
ప్రచ్ఛన్న యుద్ధం, సోవియట్ యూనియన్ ముగియటంతోనే రష్యా గురించి పశ్చిమ దేశాల ఆందోళన తొలగిపోలేదు.
''కమ్యూనిజం అదృశ్యమవటం వల్ల మిత్రదేశాలు సాయుధ బలగాలు లేకుండా, రక్షణ లేకుండా జీవించగలిగే ఒక స్వర్ణయుగం సృష్టి జరిగిందని అకస్మాత్తుగా ఎవరూ నమ్మలేదు'' అని నాటో ఉన్నతాధికారి ఒకరు జేమీ షియా 2003 ప్రసంగంలో చేసిన వ్యాఖ్య చాలా ప్రాచుర్యం పొందింది.
రష్యా సైనికపరంగా శక్తివంతంగానే కొనసాగటంతో పాటు.. యుగోస్లోవియా కుప్పకూలటంతో 1990లలో యూరప్‌కు యుద్ధం తిరిగి వచ్చింది.
దానిని అనుసరించి తలెత్తిన సంఘర్షణలతో.. నాటో తన పాత్రను మార్చుకుంది. మరింతగా జోక్యం చేసుకునే సంస్థగా మారింది. బోస్నియా, కొసావాల్లో సెర్బియా దళాలలకు వ్యతిరేకంగా వైమానిక దాడులు, నౌకా దిగ్బంధంనం, శాంతి పరరక్షణ బలగాల వంటి సైనిక కార్యకలాపాలు చేపట్టింది.
2001లో నాటో మొదటిసారిగా తన కార్యకలాపాలను యూరప్ వెలుపలకు తీసుకెళ్లింది. సెప్టెంబర్ 11 దాడుల అనంతరం అఫ్ఘానిస్తాన్‌కు పంపించిన ఐక్యరాజ్యసమితి సంకీర్ణ బలగాల వ్యూహాత్మక నాయకత్వాన్ని నాటో స్వీకరించింది.
అఫ్ఘాన్ భద్రతా దళాలకు శిక్షణనివ్వటం, సలహాలివ్వటం, సాయపడే కార్యక్రమంలో భాగంగా.. ఆ దేశంలో ఈ రోజుకీ నాటో నాయకత్వం కింద దాదాపు 17,000 మంది సైనికులు కొనసాగుతూనే ఉన్నారు.
నాటో సభ్య దేశాల మధ్య వాగ్వాదాలు ఎందుకు?
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నాటోను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఆయన 2016లో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడే.. నాటోకు ''కాలం చెల్లిందని'' ఆ సంస్థ ''ముక్కలైతే బాగుంటుంద''ని ఆయన వ్యాఖ్యానించారు.
కూటమి సభ్య దేశాల మీద దాడి జరిగితే రక్షించాలన్న నిబద్ధతకు కట్టుబడి ఉండటానికి అమెరికా తిరస్కరించవచ్చునని - అసలు నాటో నుంచే వైదొలగవచ్చునని కూడా ట్రంప్ సంకేతాలిచ్చారు.
నాటో సభ్య దేశాల్లో ఏ దేశం కన్నా కానీ రక్షణ కోసం అమెరికా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతోందని కూడా ఆయన ఫిర్యాదు చేశారు.
''నాటో కోసం ఏ ఇతర దేశం కన్న కానీ అమెరికా చాలా ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఇది న్యాయం కాదు. అమోదనీయమూ కాదు'' అని ఆయన 2018 సెప్టెంబర్‌లో ట్వీట్ చేశారు.
ఆయన మాటలకు బలమైన కారణముండొచ్చు. నాటో సభ్య దేశాలన్నీ రక్షణ కోసం చేసే ఖర్చులో అమెరికా వాటా దాదాపు 70 శాతం (2018 గణాంకాలు) వరకూ ఉంది. అంతేకాదు.. 2024 నాటికి తమ రక్షణ వ్యయాన్ని రెండు శాతానికి పెంచుతామని నాటో సభ్య దేశాలన్నీ అంగీకరించినా కూడా.. దానిని ఇప్పటివరకూ ఏ దేశమూ సాధించలేదు.
టర్కీ విషయం ఏమిటి?
1951 నుంచీ నాటో సభ్య దేశంగా ఉన్న టర్కీ.. గత అక్టోబరులో ఉత్తర సిరియాలో జోక్యం చేసుకుని కుర్దు బలగాల మీద దాడి చేయాలని నిర్ణయించటం ద్వారా కూటమిలో చీలికకు కారణమైంది.
యూరోపియన్ యూనియన్ టర్కీకి ఆయుధాల విక్రయాన్ని నిలిపివేసింది. ఈయూలోని 28 దేశాల్లో 22 దేశాలు నాటో సభ్య దేశాలే.
టర్కీకి అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ కూడా ఉన్నాయి.
కానీ.. రష్యాతో టర్కీకి పెరుగుతున్న సైనిక సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి.
అమెరికా అభ్యంతరాలు వ్యక్తంచేసినా లెక్కపెట్టకుండా.. రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను కొనుగోలు చేయటానికి అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రభుత్వం కాంట్రాక్టు మీద సంతకాలు చేసింది.
టర్కీకి తన పేట్రియాట్ ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్‌ను విక్రయించాలని అమెరికా 2013 నుంచీ ప్రయత్నిస్తోంది. కానీ.. ఆ రక్షణ వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని ఎర్డోగన్ విజ్ఞప్తి చేశాక ఆ చర్చలు స్తంభించిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తే టర్కీ తన సొంత రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుంది. అందుకు బరాక్ ఒబామా ప్రభుత్వం తిరస్కరించింది.
దీంతో రష్యాను ఆశ్రయించిన టర్కీ.. ఎస్-400 వ్యవస్థను కొనుగోలు చేయటానికి ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ పరిణామంతో.. ఆత్యాధునిక ఎఫ్-35 యుద్ధవిమానం తయారీకి ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమం నుంచి టర్కీని తొలగొంచింది అమెరికా. అయితే ఒప్పందం వల్ల.. ఎఫ్-35 గురించిన సున్నితమైన వివరాలు రష్యాకు లభించే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.
అమెరికా తన అణ్వాయుధాలను మోహరించిన ఐదు నాటో సభ్య దేశాల్లో టర్కీ కూడా ఒకటి. టర్కీ భూభాగంలో అమెరికా అణ్వాయుధాలు మోహరించి ఉన్నాయి.
ఫ్రాన్స్ విషయం?
నాటో ''బ్రెయిన్ డెడ్'' అయిందని తాను భావిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఇటీవల ద ఎకానమిస్ట్ మేగజీన్‌తో పేర్కొన్నారు. నాటోను హెచ్చరించకుండానే సిరియా నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలన్న అమెరికా నిర్ణయాన్ని ఉటంకిస్తూ.. నాటో కూటమి పట్ల అమెరికా నిబద్ధత విషయంలో ఆందోళన వ్యక్తంచేశారు.
ఒకవేళ ఏదైనా దాడి జరిగితే నాటో సభ్య దేశాలు పరస్పరం రక్షణ కోసం వస్తాయని తాను ఖచ్చితంగా భావించలేనని కూడా ఆయన పరోక్షంగా చెప్పారు.
''అమెరికా వైఖరి నేపథ్యంలో నాటో ఏమిటనే వాస్తవాన్ని మనం పున: సమీక్షించాలన్నది నా వాదన. సైనిక వ్యూహం, సామర్థ్యాల విషయంలో యూరప్ స్వయంప్రతిపత్తి పొందాలి'' అని మాక్రాన్ వివరించారు.
మాక్రాన్ ఇంటర్వ్యూ కలకలం రేకెత్తించింది. ఫ్రాన్స్ సన్నిహిత మిత్రలైన జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది.
''మనం మళ్లీ కూర్చుని ఒక కప్పు టీ తాగటం కోసం.. నువ్వు పగులగొట్టే కప్పులను నేను పదే పదే అతికించాల్సి వస్తోంది'' అని ఆమె మాక్రాన్‌తో చెప్పినట్లు ద న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.
బ్రెగ్జిట్‌తో సమస్యలు వస్తాయా?
బ్రిటన్‌లో ముందస్తు సాధారణ ఎన్నికలు జరగటానికి వారం రోజుల ముందు లండన్‌లో నాటో సమావేశం జరుగుతోంది. ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలీదు.
ఇక యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగే- బ్రెగ్జిట్ ప్రక్రియ విధివిధానాలపై బ్రిటన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ బ్రెగ్జిట్ కఠినంగా ఉన్నట్లయితే అది ఈయూలోని మొత్తం 28 దేశాల్లో 22 దేశాలు సభ్యలుగా ఉన్న కూటమిలో విభేదాలకు దారితీస్తుంది.
ప్రస్తుతం నాటో దేశాల్లో అమెరికా తర్వాత రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశం బ్రిటన్.
నాటో భవిష్యత్ ఏమిటి?
ఈ ప్రశ్నకు ప్రధాన సమాధానం.. రష్యా భౌగోళిక రాజకీయాల వైఖరి మీద ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది.
''రష్యా దూకుడుగా ఉన్నంత కాలం.. ప్రాధమిక లక్ష్యమైన ఉమ్మడి రక్షణ, హెచ్చరికల కోసం నాటో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కనీసం మరికొన్ని దశాబ్దాల పాటు.. ఇంకా చెప్తే మరో 70 సంవత్సరాల కాలం దీనికి ఉందని నేను అనుకుంటున్నా'' అని నాటో మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అలెక్జాండర్ వెర్ష్బో ఈ ఏడాది ఆరంభంలో ఎన్‌పీఆర్ రేడియోతో పేర్కొన్నారు.
ఒకవైపు ట్రంప్ విమర్శలు చేస్తున్నప్పటికీ.. నాటో నుంచి అమెరికా వైదొలగకుండా నిషేధిస్తూ అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) గత జనవరిలో అత్యధిక మెజారిటీతో చట్టం చేసిన విషయాన్ని కూడా గుర్తించటం ముఖ్యం.
డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు రెండిటి నుంచీ అత్యధిక మద్దతు లభించింది. ఆ చట్టానికి అనుకూలంగా 357 ఓట్లు వస్తే.. వ్యతిరేకంగా కేవలం 22 ఓట్లు మాత్రమే పడ్డాయి.
నాటో 70వ జన్మదిన సమావేశం.. ఆ కూటమిలోని చాలా మంది ఆశించేంత వేడుకగా జరగకపోవచ్చు కానీ.. ఆ సంస్థ చివరి జన్మదినం మాత్రం కాబోదు.
ఇవి కూడా చదవండి:
- ఎయిడ్స్ డే: పాకిస్తాన్లో వందల మంది చిన్నారులకు హెచ్.ఐ.వీ ఎలా సోకింది...
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయి: ‘‘ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతుర్ని భయంతో పెంచడమేనా?’’
- ‘చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ దొరికింది‘
- భోపాల్ విషాదానికి 35 ఏళ్లు... ఫోటోలు చెప్పే విషాద చరిత
- షాద్ నగర్ బాధితురాలి సోదరి: ‘‘నిజంగా ఆ సీరియస్‌నెస్ నాకు తెలియదు.. ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- 'ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్‌కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు'
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)