హువావే: అమెరికా నిషేధం తర్వాత.. భవిష్యత్తు భారత్‌తో ముడిపడివుందా?

చైనీస్ టెక్ దిగ్గజం హువావే తన 5జీ ఉత్పత్తులను అమెరికాలో విక్రయించడంపై నిషేధం విధించారు. దీంతో, వాటిని భారతదేశంలో విక్రయించటానికి ఈ సంస్థ భారీగా ప్రచారం చేస్తోంది.

''ఆ సంస్థను ఇప్పటికే పలు దేశాల ప్రభుత్వాలు నిషేధించాయి. కాబట్టి భారతదేశంతో 5జీ కాంట్రాక్టు చాలా కీలకమవుతుంది'' అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన టెక్ విశ్లేషకుడు అరుణ్ సుకుమార్ బీబీసీతో అన్నారు.

''హువావే ప్రస్తుతం సౌకర్యవంతంగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మున్ముందు మునిగిపోకుండా ఉండాలంటే ప్రపంచ వ్యాప్తంగా కొత్త మార్కెట్లలో పెట్టుబడులు పెట్టటం కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు భారతదేశం కన్నా పెద్ద మార్కెట్ ఏముంది?'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాలో కూడా హువావే సంస్థను నిషేధించారు. మరికొన్ని దేశాలు సైతం ఈ సంస్థను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.

హుహావే పరికరాల్లో చైనా నిఘా పెట్టటానికి వీలుకల్పించే దొంగదారులు ఉన్నాయని అమెరికా అభ్యంతరం వ్యక్తంచేస్తోంది.

కానీ.. తమ ఉత్పత్తులను ఉపయోగించటం వల్ల భద్రతకు ముప్పు ఉంటుందన్న వాదనలను హువావే సంస్థ పదేపదే తిరస్కరిస్తోంది. చైనా ప్రభుత్వానికి తనకు సంబంధం లేదని.. తమది స్వతంత్ర సంస్థ అని చెప్తోంది.

అయితే.. భారతదేశం వైర్‌లెస్ మార్కెట్ ప్రపంచంలో చైనా తర్వాత అతి పెద్ద మార్కెట్. కనుక ఏ కంపెనీకైనా భారత మార్కెట్ ముఖ్యమైనదే అవుతుంది. కానీ హుహావే ప్రస్తుతం ఎదుర్కొంటున్నఇబ్బందుల రీత్యా ఈ సంస్థ భవిష్యత్తుకు భారతదేశం చాలా కీలకంగా మారవచ్చు.

మరోవైపు, హువావే సంస్థను బహిష్కరించాలంటూ భారతదేశంతో పాటు తన ఇతర మిత్ర దేశాల మీద కూడా అమెరికా ఒత్తిడి తెస్తోంది. అలా చేయని దేశాలను శిక్షించటానికి చర్యలు చేపట్టే విషయాన్ని కూడా కొట్టివేయటం లేదు.

అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ ఇటీవల భారతదేశంలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ, ''మా భౌగోళిక రాజకీయ భాగస్వామి అయిన భారతదేశం.. అనవసర భద్రతా ప్రమాదాలను తనకు తానుగా కొనితెచ్చుకోదని మేం ఆశిస్తున్నాం'' అని అన్నారు.

అమెరికా ఆరోపించినట్లుగా తమ పరికరాల్లో నిఘా మార్గాలేవీ లేవని భారత ప్రభుత్వానికి హామీ ఇస్తూ ఒక ధ్రువీకరణ పత్రం మీద సంతకం చేయటానికి కూడా తమ సంస్థ సిద్ధంగా ఉందని మువావే ఇండియా సీఈఓ జే చెన్ బీబీసీ ప్రతినిధి డెవీనా గుప్తాతో చెప్పారు.

''భారత ప్రభుత్వంతో లాబీ చేయటానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మేం మీడియాలో చదివాం. కానీ, మేం ఏం చేయగలం అనే దానిమీద దృష్టి కేంద్రీకరించాలని, ఆ దిశగా శాయశక్తులా కృషి చేయాలని మేం నమ్ముతున్నాం'' అని చెప్పారు.

హువావే మీద అమెరికా ఆరోపణల విషయంలో భారత్ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. త్వరలో జరగబోయే 5జీ స్పెక్ట్రమ్ పరీక్షల్లో పాల్గొనాలని హువావేను ఆహ్వానించింది. అయితే,

నిజానికి 5జీ ప్రక్రియ నుంచి హువావేను తప్పించటం భారతదేశానికి ప్రతికూలంగా మారవచ్చునని సుకుమార్ బీబీసీతో అన్నారు.

''5జీని ప్రారంభించటానికి ఐదు కంపెనీల కన్నా ఎక్కువ వాటికి మౌలిక సదుపాయాలు లేవు. పైగా పశ్చిమ దేశాల సంస్థలైన నోకియా, ఎరిక్సన్ వంటి వాటికన్నా హువావే మౌలిక సదుపాయాలు ఇంకా ఎక్కువ అందుబాటు ధరల్లో ఉంటాయి. భారత టెలికాం పరిశ్రమ ఇప్పటికే ఇబ్బందులు పడుతోంది. కాబట్టి.. 5జీ సర్వీసును అతి తక్కువ ధరకు అందించ గలిగే హువావే సంస్థతో జట్టుకట్టటం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది'' అని ఆయన విశ్లేషించారు.

హువావే టెక్నాలజీకి ప్రత్యామ్నాయంగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఇండియా దగ్గర లేదు. ఈ విషయం హువావేకు బాగా తెలుసు.

భారతదేశపు డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో హువావే చాలా కీలకమైన భాగమని.. ఈ దశలో హువావేను పక్కనపెడితే ఆ వ్యవస్థ మొత్తం ''ధ్వంసం'' అయ్యే ప్రమాదం ఉంటుందని చెన్ 'ఎకానమిక్ టైమ్స్' వార్తాపత్రికతో పేర్కొన్నారు.

''ఆర్థికంగానే కాకుండా సాంకేతిక అభివృద్ధిలోనూ నష్టం జరుగుతుంది'' అని ఆయన వ్యాఖ్యానించినట్లు సదరు పత్రిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)