యూరప్, అమెరికాలో ఆశ్రయం కోసం ప్రజలు ఎందుకు వెళుతున్నారు? యూరప్‌కు శరణార్థుల అవసరం ఎందుకు?

    • రచయిత, సందీప్ సోనీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత నెల వలసదారులైన తండ్రీకూతుళ్లు మృతిచెందిన కలచివేసే ఈ ఫొటో ఎంతోమందికి కన్నీళ్లు తెప్పించింది.

వీరు మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నదీ ప్రవాహం తీవ్రంగా ఉండడంతో మృతిచెందారు.

ఈ ఘోరాన్ని 2015లో టర్కీ తీరంలో కనిపించిన మూడేళ్ల సిరియా చిన్నారి అయ్లాన్ కుర్దీ మృతదేహం ఫొటోతో పోల్చి చూస్తున్నారు.

ఈ చిన్నారి తల్లిదండ్రులతో యూరప్ వైపు ప్రయాణిస్తున్న వలసదారుల్లో ఉన్నాడు.

నాలుగేళ్లలో వెలుగుచూసిన ఈ హృదయవిదారకమైన రెండు ఫొటోలు ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నాయి.

మెరుగైన జీవితం కోసం 'మూడో ప్రపంచం'లోని దేశాల నుంచి ప్రజలు యూరప్-అమెరికా చేరుకోవాలని ప్రయత్నించడం కొత్త కాదు. ఎన్నో దశాబ్దాల నుంచీ ఇది జరుగుతూనే ఉంది.

దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం యూరోపియన్ అంశాల నిపుణుడు ప్రొఫెసర్ గుల్షన్ సచ్‌దేవ దీనిపై మాట్లాడుతూ "ఆఫ్రికా అయినా, అఫ్గానిస్తాన్ అయినా అభద్రతా భావంతోనో, వేరే ఏదైనా కారణంతోనో ఇల్లూవాకిలి వదిలి వెళ్తున్న వారి లక్ష్యం ఎక్కడో ఒకచోట స్థిరపడాలనే ఉంటుంది" అన్నారు.

ఎన్నో దశాబ్దాల నుంచి కొన్ని నిబంధనల ప్రకారం ఉండడానికి, ఉద్యోగం చేసుకోడానికి యూరప్‌లో వలసవెళ్లేవారికి చోటు దొరికేది. అదే కారణంతో వలసదారులు యూరప్ వైపు వెళ్లేవారు. కానీ అందరూ అక్కడివరకూ చేరుకోలేరు. గత ఏడాదిలో పడవల్లో యూరప్ చేరుకోవాలనుకుని కొన్ని వేల మంది చనిపోయారు. యూరప్ చేరుకుంటే మన జీవితాలు మెరుగుపడతాయని వారంతా అనుకుంటున్నారు.

కానీ ఇప్పుడు యూరప్‌లో పరిస్థితి చాలా మారిపోయింది. ప్రభుత్వాల వైఖరి కఠినంగా మారింది. యూరప్ మాత్రం ఇప్పటికీ బయటివారు రావాలని కోరుకుంటోంది. కానీ వారికి బాగా చదువుకున్న, నిపుణుల అవసరం ఉంది. అయినా ఒక పరిమితికి మించి ఎక్కువ మంది వెళ్తే యూరప్ దేశాలు వారికి ఖర్చు చేయలేవు. యూరప్ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు ఇంకా దానికి అంగీకరించడం లేదు.

ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్(యుఎన్‌హెచ్‌సీఆర్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మందికి పైగా నిర్వాసితులు ఉన్నారు.

వీరిలో దాదాపు రెండున్నర కోట్ల మంది శరణార్థుల రూపంలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా సిరియాకు చెందినవారే ఉన్నారు. అప్గానిస్తాన్, దక్షిణ సూడాన్ ఈ విషయంలో రెండు, మూడో స్థానంలో ఉన్నాయి.

శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో యూరప్‌లో జర్మనీ మొదటి స్థానంలో ఉంది. ఆఫ్రికాలో సూడాన్, యూగాండా కూడా భారీ స్థాయిలో శరణార్థులకు చోటు ఇస్తున్నాయి.

అలాగే అఫ్గాన్ శరణార్థులు ఎక్కువగా పాకిస్తాన్ వైపు వెళ్లాలనుకున్నారు. కానీ సంఖ్యాపరంగా చూస్తే టర్కీ ఎక్కువమందికి అంటే దాదాపు 37 లక్షల శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది.

వీరందరూ స్వదేశంలో పౌరసత్వం పొందలేకపోతున్నవారు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఎక్కడికైనా రాకపోకలు సాగించే స్వేచ్ఛ లేకుండా వంచనకు గురైనవారే.

యూరప్‌కు అవసరం

ది ఎకనామిక్ రిపోర్ట్ ప్రకారం యూరప్‌కు వలసదారుల అవసరం చాలా ఉంది. వలసదారులు లేకుంటే యూరోపియన్ దేశాల్లో జనాభా తగ్గిపోతుందని ఈ రిపోర్టులో తెలిపారు.

యూరప్‌లోని చాలా దేశాల్లో జనాభా వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. ఈ దేశాల్లో ప్రతి ఏటా ఎంతమంది చనిపోతుంటారో, ఆ సంఖ్యలో కూడా జనాభా కూడా పెరగడం లేదనేది కొంతమంది గుర్తించారు.

జననమరణాల రేటులో ఈ తేడా వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించాలంటే వలసదారుల పాత్ర చాలా కీలకం.

"ఈ విషయంలో యూరప్ ప్రపంచం ఎదుట ఒక ఉదాహరణగా నిలవాలనుకుంటోంది. మానవహక్కులు, శరణార్థుల విషయంలో మొత్త ప్రపంచానికి పాఠం నేర్పాలనుకుంటోంది. వలసదారుల కోసం యూరోపియన్ యూనియన్ 'డబ్లిన్ రెగ్యులేషన్' కింద ఒక వ్యవస్థను తయారు చేసింది. వేరు వేరు దేశాల కోసం శరణార్థుల సంఖ్యను నిర్ణయించింది" అని ప్రొఫెసర్ గుల్షన్ సచ్‌దేవ చెప్పారు.

కానీ తూర్పు యూరప్‌లోని హంగరీ-పోలండ్ లాంటి దేశాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. మాకు వారి అవసరం లేదు, బయటి వారు మా దేశంలో జీవించడానికి కుదరదని చెప్పేశాయి. అందుకే ఈ వ్యవస్థను పూర్తిగా అమలు చేయలేకపోయారు. రాజకీయ పార్టీలు కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.

జర్మనీ లాంటి దేశాలు ఒక అడుగు ముందుకేసి శరణార్థులకు ఆశ్రయం ఇవ్వాలనుకుంటే ఆ దేశ చాన్సలర్ ఏంగెలా మెర్కెల్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. అందుకే, రాబోవు సంవత్సరాల్లో బయటి నుంచి యూరప్ వెళ్లి జీవించాలనుకునే వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వలసదారుల సంబంధిత చట్టాల విషయంలో అమెరికా కూడా చర్చల్లోకి నిలిచింది. మెక్సికో దారిలో అమెరికాలోకి ప్రవేశించిన రెండు ఇలాంటి కేసులు గత రెండ్రోజులుగా వెలుగులోకి వచ్చాయి. ఈ వలసదారులు అమెరికా నుంచి బయటి ప్రపంచం దృష్టిని కూడా తమవైపు తిప్పుకున్నారు.

మొదటి కేసు ఒక తండ్రి, అతడి 23 నెలల కూతురు. వీరు ఒక నదిని దాటి అమెరికాలో ప్రవేశించాలని ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో ప్రవాహం తీవ్రంగా ఉండడంతో నదిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

రెండో కేసు ఆరేళ్ల ఒక సిక్కు బాలికది. ఆ పాప మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో తీవ్రమైన వేడికి ఎడారిలో చనిపోయింది.

ప్రతి ఏటా ఇలాంటి చాలా కేసులు వెలుగుచూస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ పాలన కఠినంగా ఉండడంతో ఈ సమస్య మరింత పెరిగిందని చెబుతున్నారు.

అమెరికాలో ఇలాంటి ఎన్నో కేసులు చూసిన వకీల్ గురుపాల్ సింగ్ "ఇలాంటి దాదాపు 12 కేసులు నా దగ్గరకొచ్చాయి. వాటిలో ప్రతి నెలా మరో ఇద్దరు-నలుగురు ఇలా వస్తుంటారనేది నేను చూశాను. ఆ సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. ఇమిగ్రేషన్ జడ్జి బాండ్స్ ఇవ్వకూడదని ట్రంప్ పాలనలో అటార్నీ జనరల్ ద్వారా కొత్త చట్టం రూపొందించారు" అన్నారు.

ఈ చట్టం వల్ల జైలుకెళ్లే కేసులు పెరిగిపోయాయి. అధ్యక్షుడు ట్రంప్ చాలా కొత్త జడ్జిలను నియమించారు. వారిలో ఎక్కువమందికి ఇలాంటి కేసుల గురించి తెలీదు, వీటిలో ఎలాంటి అనుభవం లేదు. వాటికి సంబంధించిన చట్టాల గురించి కూడా వారికి తెలీదు. వలసదారులను ఇబ్బంది పెట్టడానికే ట్రంప్ వారిని నియమించినట్టు అనిపిస్తోంది.

నిర్వాసితులు, శరణార్థులు, వలసదారులు వీరందరినీ సాధారణంగా ఒక సమస్యలా చూస్తుంటారు. కానీ చాలా మంది నిపుణులు దీనిని సమస్యగా కాకుండా ఒక పరిష్కారంగా చూడాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా కార్మిక వ్యవస్థ గురించి గట్టిగా చెప్పింది వీరే. పన్నులు చెల్లించి ఆర్థిక వ్యవస్థ చక్రాన్ని తిప్పింది వీళ్లే. సాంస్కృతిక వైవిధ్యంతో సమాజాన్ని శుద్ధి చేసింది కూడా వీళ్లే.

కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో యుద్ధం, సంఘర్షణల వాతావరణం ఎప్పుడూ ఉంటుంది. అది అక్కడినుంచి వలసవెళ్లాలనుకునేవారి కష్టాలను మరింత పెంచింది. తీవ్రవాదం వ్యాప్తి వారిని అనుమానితులుగా మార్చేసింది.

యూరప్, అమెరికా ఎన్నికల రాజకీయాల నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. ఆ ప్రభావం తరచూ తలపై ఏ నీడా లేకుండా, ఇప్పటికీ ఆశ్రయం కోసం అలమటిస్తూ, సరిహద్దులు దాటేందుకు అష్టకష్టాలు పడుతున్నవారిపై పడుతుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)