పాకిస్తాన్‌: హిందూ సమాజాన్ని 'కించపరిచిన' మంత్రి ఫయాజుల్ హసన్ చోహాన్‌పై వేటు

హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర సమాచార, సాంస్కృతికశాఖ మంత్రి ఫయాజుల్ హసన్ చోహాన్ పదవికి రాజీనామా చేశారు.

ఫయాజుల్ హసన్‌ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ)కి చెందిన నాయకుడు. ఫయాజుల్ హసన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించినట్లు పీటీఐ మంగళవారం ట్విటర్‌లో పేర్కొంది.

హిందూ సమాజం గురించి కించపరిచే వ్యాఖ్యల నేపథ్యంలో ఫయాజుల్ హసన్‌ను తమ పార్టీ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వం పదవి నుంచి తొలగించిందని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ ట్విటర్‌లో తెలిపింది.

''ఇతరుల మతవిశ్వాసాలను దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడరాదు. పరమత సహనం పునాదులపైనే పాకిస్తాన్ నిర్మితమైంది'' అని పీటీఐ చెప్పింది.

ఫయాజుల్ హసన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ అధికార ప్రతినిధి షాబాజ్ గిల్ ధ్రువీకరించారు.

ఫయాజుల్ హసన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఆయన వ్యాఖ్యలతో పంజాబ్ ప్రభుత్వానికి సంబంధం లేదని షాబాజ్ గిల్ ఒక వీడియో సందేశంలో చెప్పారు.

హిందూ సమాజానికి ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దూర్ సంఘీభావం ప్రకటించారని, మైనారిటీల (పాకిస్తాన్‌లో హిందువులు మైనారిటీలు) మనసును గాయపరిచే ఎలాంటి ప్రకటనలు చేసినా, పనులకు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)