You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్: దైవదూషణ ఆరోపణలతో వీళ్లు దేశమే విడిచారు
పాకిస్తాన్ మిలటరీ పాలకులను విమర్శించే మైనారిటీలు, కార్యకర్తలు ఎప్పుడూ కూడా దైవదూషణ అనే ఆరోపణల గురించి ఆందోళన చెందుతుంటారు.
పాకిస్తాన్‌లో దైవదూషణ నేరానికి మరణశిక్ష కూడా విధించొచ్చు. అలాంటి ఆరోపణలతో చాలా మంది మూకదాడుల్లో మరణించారు కూడా.
ఇటీవలే ఆ ఆరోపణల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న ఆసియా బీబీ విడుదలతో దైవదూషణ మరోసారి వార్తల్లోకెక్కింది.
భద్రత కోసం ఆమె, ఆమె నలుగురు పిల్లలూ దేశాన్ని వదిలివెళ్లడం మినహా దారి లేదని ఆమె లాయర్ అభిప్రాయపడ్డారు.
అలాంటి ఆరోపణలతో దేశం వదిలి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న నలుగురు వ్యక్తులను బీబీసీ కలిసింది.
'ఐదుసార్లు ఇల్లు మారాం'
జాన్ (పేరు మార్చాం) పాకిస్తాన్‌లో రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆయన బ్యాంక్ ఉద్యోగి.
ఆయన 13 ఏళ్ల కుమారుడు స్కూలులో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఆయన జీవితం మారిపోయింది.
దశాబ్దం కిందట ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా బ్రిటన్ ఆశ్రయం పొందారు. అయితే బ్రిటన్‌లో కూడా ఆయన కుటుంబానికి కష్టాలు తప్పలేదు.
మొదట్లో వాళ్లు బర్మింగ్‌హామ్ ప్రాంతంలో పాకిస్తానీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించేవారు.
''ఒకరోజు ఒక యువకుడు మా ఇంటి తలుపు తట్టి, మసీదు గోడను ఆనుకుని ఒక నల్లకవర్ ఉంచి మసీదును అవమానించారంటూ నా భార్యపై కేకలు వేశాడు'' అని తెలిపారు.
''స్థానిక ప్రజలు కూడా మమ్మల్ని చులకనగా చూసేవారు. మేం మొత్తం ఐదుసార్లు ఇల్లు మారాం'' అని జాన్ వివరించారు. చివరికి వాళ్లు క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డారు.
పాకిస్తాన్‌లో జరిగిన సంఘటనలతో ఆయన పిల్లలిద్దరూ ఎంత భయపడిపోయారంటే వాళ్లు ఇప్పటికీ పాకిస్తాన్ తిరిగి వెళదామంటే తిరస్కరిస్తారు.
'నువ్వు ఏదో అని ఉంటావు'
అసీమ్ సయీద్ ఒక సున్నీ ముస్లిం. పాకిస్తాన్‌లో అత్యధికులు సున్నీలే. అయితే పాకిస్తాన్ మిలటరీ పాలకులపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో ఆయన వారికి లక్ష్యంగా మారారు.
2017లో ఆయనతో పాటు మరో నలుగురు బ్లాగర్లను 'ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏజెన్సీ'కి చెందిన వారు ఎత్తుకెళ్లారు.
ఆ తర్వాత ఆయన దైవదూషణ చేశాడని ఆరోపణలు చేశారు. అయితే సయీద్ వాటిని తోసిపుచ్చారు.
తాను పాకిస్తాన్ సైన్యాన్ని విమర్శించినందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సయీద్ అన్నారు.
ఏడాది క్రితం బ్రిటన్‌కు వచ్చినప్పటి నుంచి ఆయన బయట కనిపించడానికి ఇష్టపడడం లేదు.
బ్రిటిష్ ముస్లింలలో కూడా చాలా అసహనం ఉంది అంటారాయన. తనపై ఎప్పుడైనా దాడి జరగవచ్చని ఆయన భావిస్తున్నారు.
తన బాల్య స్నేహితులు కూడా 'నువ్వు ఏదో అని ఉంటావు' అనడం తనకు చాలా బాధ కలిగిస్తుందని అసీమ్ అన్నారు.
''పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లడం చాలా ప్రమాదకరం. ఒక దశాబ్దం తర్వాత తిరిగి వెళ్లినా, నన్ను హత్య చేసే అవకాశం ఉంది'' అని అసీమ్ అభిప్రాయపడ్డారు.
దైవదూషణ చట్టం ఉన్నంత వరకు పాకిస్తాన్ మారదని ఆయన అన్నారు.
'నేనెప్పుడూ పాకిస్తాన్ తిరిగి వెళ్ళను'
అహ్మదీలు మొహమ్మద్ తుది ప్రవక్త కాదని అంటారు.
తాహిర్ మహ్దీ ఒక అహ్మదీ ముస్లిం. పాకిస్తాన్‌లో ఆయన ఒక పత్రికను ప్రచురించేవారు.
1970లలో అహ్మదీలు ముస్లింలు కాదని ప్రకటించారు. అప్పటి నుంచి వారిపై దాడులు మొదలయ్యాయి.
తాహిర్ దైవదూషణకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురిస్తున్నారనే నెపంతో జైలు శిక్ష విధించారు. ఆయన రెండున్నర ఏళ్లు జైలులో ఉన్నారు.
దైవదూషణ ఆరోపణలతో జైలులో ఉన్న వాళ్ల పట్ల అధికారులు చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని, కనీసం భార్యాపిల్లలతో కూడా మాట్లాడనివ్వరని ఆయన తెలిపారు.
ఆసియా బీబీకి న్యాయం జరిగిందన్న ఆయన, తమ అహ్మదీల భవిష్యత్తుపై మాత్రం నిరాశను వ్యక్తం చేశారు.
తాను ఎన్నడూ పాకిస్తాన్ తిరిగి వెళ్లేది లేదని తాహిర్ స్పష్టం చేశారు.
'జీవితమే మారిపోయింది'
జహీదా తండ్రి డాక్టర్ హమీదుల్లా రహంతుల్లా పాకిస్తాన్‌లో ఒక ప్రముఖ డెంటిస్ట్.
అయితే ఆయన అహ్మదీ కావడంతో ఛాందసవాదులు ఆయనపై పగబట్టారు. ఆయన ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించడం కూడా వాళ్ల కోపానికి కారణమైంది. ఆయనపై రెండుసార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి.
చివరికి 11 ఏళ్ల క్రితం ఒక రంజాన్ రోజున ఆయనను కిడ్నాప్ చేశారు.
''మా నాన్నను సున్నీ ఇస్లాంలోకి మారాలని హింసించారు. దానికి ఆయన నిరాకరించడంతో కాల్చి చంపారు'' అని జహీదా తెలిపారు.
అప్పటికే ఆమె సోదరుడు బ్రిటన్‌లో నివసిస్తున్నారు. తండ్రి మరణాంతరం ఆమె కుటుంబం బ్రిటన్‌కు తరలివచ్చింది.
అయితే బ్రిటన్ వచ్చాక ఆమె కుటుంబం ఆర్థికంగా, మానసికంగా చాలా కష్టాలు ఎదుర్కొంది.
ఆసియా బీబీ కేసులో తీర్పు చీకట్లో చిరుదీపంలా కనిపిస్తోందని ఆమె అన్నారు.
అయితే.. ''ఏమో, ఎవరు చూశారు? ఛాందసవాదుల వత్తిడితో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నా ఆశ్చర్యం లేదు'' అంటారామె.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)