You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డోనల్డ్ ట్రంప్ - కిమ్: రెండో సమావేశం ఫిబ్రవరి నెలాఖర్లో
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్‌తో రెండోసారి ఫిబ్రవరి నెలాఖరులో సమావేశం కాబోతున్నారని వైట్ హౌస్ తెలిపింది.
ఉత్తర కొరియా ఉన్నతాధికారి కిమ్ యాంగ్-చోల్‌ను వైట్ హౌస్‌లో ట్రంప్ కలుసుకున్న తరువాత ఈ ప్రకటన వెలువడింది.
ఆయన కిమ్ జోంగ్-ఉన్ లేఖను ట్రంప్‌కు అందజేయడానికి వచ్చారు.
గత ఏడాది జూన్ నెలలో ఇరు నేతల తొలి చరిత్రాత్మక సమావేశం తరువాత అణు నిరాయుధీకరణ విషయంలో చెప్పుకోదగిన పురోగతి ఏమీ కనిపించలేదు. రెండోసారి ఈ నేతలు ఎక్కడ సమావేశం అవుతారన్నది ఇంకా వెల్లడి కాలేదు.
బహుశా, ఈసారి వారి సమావేశానికి వియత్నాం వేదిక కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
కిమ్ యాంగ్ చోల్ అమెరికా పర్యటనతో మళ్ళీ అణు దౌత్యంలో చాలా నెలల తరువాత కదలిక వచ్చిందని బీబీసీ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి బార్బరా ప్లెట్ అషర్ అన్నారు.
అయితే, కిమ్ జోంగ్-ఉన్ పంపిన లేఖలో ఏముందన్నది తెలియలేదు. కానీ, అది తప్పకుండా తదుపరి సమావేశానికి సంబంధించిన ప్రయత్నమేనని బార్బరా తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తాను చర్చల పట్ల సుముఖంగా ఉన్నానని అన్నారు.
వైట్ హౌస్ మీటింగ్ తరువాత ట్రంప్ మీడియా కార్యదర్శి సారా సాండర్స్ మాట్లాడుతూ, "అణు నిరాయుధీకరణ చర్చలు ముందడుగు వేస్తున్నాయి. అయినప్పటికీ, ఉత్తర కొరియా మీద అమెరికా ఆంక్షలను కొనసాగిస్తుంది. ఆ దేశం మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటుంది" అని అన్నారు.
గత సమావేశం తరువాత ఇప్పటిదాకా ఏం జరిగింది?
సింగపూర్ సమావేశం తరువాత చెప్పుకోదగిన అంగీకారాలేమీ జరగలేదు. అణు నిరాయుధీకరణ విషయంలో పురోగతి కూడా దాదాపు లేదనే చెప్పాలి.
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అణు నిరాయుధీకరణ చర్చలు ఆ తరువాత స్తంభించిపోయాయి. ఉత్తర కొరియాలోని అణ్వస్త్ర తయారీ కేంద్రాల వివరాలేవీ వెల్లడి కాలేదు. అమెరికా విధించిన ఆంక్షలు కూడా అలాగే ధృఢంగా కొనసాగుతున్నాయి.
అదే సమయంలో, ఉత్తర కొరియా - చైనా సంబంధాలు బలపడినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కిమ్ పలుసార్లు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌ను కలవడానికి బీజింగ్ వెళ్ళి వచ్చారు.
సింగపూర్ సమావేశంలో కుదిరిన ఒప్పందాలేమిటి?
ఆ చరిత్రాత్మక సమావేశంలో ఏదైనా జరిగిందీ అంటే, అదంతా కాగితం మీదే జరిగింది. రెండు దేశాలు అణు నిరాయుధీకరణ దిశగా చర్యలు తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు ఓ అస్పష్ట పత్రంపై సంతకం చేశాయి.
అసలు నిరాయుధీకరణ అంటే ఏం చేయాలి, దానికి కాల వ్యవధి ఏమిటి, ఆ ప్రక్రియ ఏ విధంగా కొనసాగాలనే వివరాలేవీ ఇప్పటికీ ఎవరూ స్పష్టం చేయలేదు.
ఆ తరువాత ఇప్పుడు మళ్ళీ ఇరు నేతల సమావేశం జరగబోతోంది. ఈ సారైనా స్పష్టమైన విధి విధానాలతో కూడిన ఒప్పందాలు ఉంటాయని చాలా మంది ఆశిస్తున్నారు. అటు ఉత్తర కొరియా కానీ, ఇటు అమెరికా కానీ మరోసారి ఓ అస్పష్ట ఒప్పందాన్ని 'విజయం' అని అభివర్ణించుకునే అవకాశాలు అంతగా లేవనే అనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఆ మహిళలే ఉత్తర కొరియా 'రహస్య ఆయుధాలు'!
- అసలు ఎవరీ కిమ్?ఉత్తర కొరియా పాలకుడెలా అయ్యారు?
- "సౌదీ అరేబియా నుంచి నేను ఎందుకు పారిపోయానంటే..."
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- 'ఫుడ్ అనేది ఒక పోర్న్ అయితే... నేను పోర్న్ స్టార్‌ని'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)