You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాహుల్ గాంధీని గల్ఫ్ మీడియా ‘పప్పూ’ అని పిలిచిందా?: Fact Check
దుబాయిలోని ఒక వార్తా పత్రిక.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని అవమానించినట్లు కొన్ని పోస్టులు పలు మితవాద సోషల్ మీడియా పేజీల్లో వైరల్ అవుతున్నాయి.
రాహుల్‌గాంధీ ఇటీవలి దుబాయి పర్యటనలో భారత దేశానికి ''తలవంపులు తెచ్చారు'' అన్నది ఆ పోస్టుల సారాంశం.
తమ వాదనను సమర్థించుకుంటూ ఆ పేజీలు గల్ఫ్ న్యూస్ దినపత్రిక మొదటి పేజీలను షేర్ చేస్తున్నాయి. ''పప్పు లేబుల్'' అనే శీర్షికతో రాహుల్ గాంధీ చిత్రాన్ని ఆ పేజీలు చూపుతున్నాయి.
రాహుల్‌ని ఎద్దేవా చేయటానికి ఆయన కేరికేచర్‌తో పాటు ''పప్పు'' అనే పదాన్ని గల్ఫ్ న్యూస్ పత్రిక తన కథనంలో ఉపయోగించిందని ఆ పేజీలు చెబుతున్నాయి.
తెలివిగా మడత పెట్టిన ఆ పత్రిక మొదటి పేజీలతో పాటు కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:
''విదేశాల్లో స్వదేశాన్ని అవమానించే వారికి ఈ తరహా గౌరవం దక్కుతుంది. గల్ఫ్ న్యూస్ అనే వార్తాపత్రిక ఒక కథనంలో రాహుల్‌గాంధీని 'పప్పు' అని అభివర్ణించింది.''
''భారతదేశాన్ని 65 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు విదేశీ గడ్డ మీద మాట్లాడుతూ భారతదేశంలో అవినీతి, పేదరికం పాతుకుపోయాయని చెప్పినపుడు.. 65 ఏళ్లలో వాళ్లు ఏం చేశారనేది ఆలోచించాలి.''
గతంలో రాహుల్‌గాంధీని ఎగతాళి చేయటానికి పలువురు బీజేపీ నాయకులు ''పప్పు'' అనే పదం ఉపయోగించారు.
ఆ వార్తాపత్రిక నిజంగా రాహుల్‌గాంధీని అవమానించిందా? అంటే, వాస్తవం వేరేలా ఉంది.
''పప్పు ముద్ర రాహుల్‌ని ఎలా మార్చింది'' అన్నది ఆ పత్రిక రాసిన పూర్తి శీర్షిక. ఆ శీర్షికతో పాటు ప్రచురించిన రేఖా చిత్రం (కేరికేచర్) నిజానికి రాహుల్ గాంధీ సంతకం చేసి ఆమోదించిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.
మరి, ఆ శీర్షికలో ''పప్పు'' అనే పదాన్ని వాడాలని ఆ పత్రిక ఎందుకు ఎంచుకుంది?
''పప్పు ముద్ర'' గురించి తనను అడిగిన ఒక ప్రశ్నకు ప్రతిస్పందనగా రాహుల్ చెప్పిన మాట అది.
రాహుల్ ఇచ్చిన సమాధానం ఇదీ:
''నాకు లభించిన అత్యుత్తమ బహుమతి 2014. మరెక్కడా నేర్చుకోలేనంతగా దాని నుంచి నేను నేర్చుకున్నాను. నా ప్రత్యర్థులు నా జీవితాన్ని ఎంత ఎక్కువ కష్టమయంగా చేస్తే.. ఎంత ఎక్కువ కఠినంగా చేస్తే.. అది నాకు అంత మంచిది. దీని (పప్పు ముద్ర) వల్ల నేను కలతచెందను. నా ప్రత్యర్థుల విమర్శలను నేను అభినందిస్తాను. వాటి నుంచి నేర్చుకుంటాను.''
అంటే.. రాహుల్‌ని అవమానించటానికి ఆ పత్రిక ఆ పదాన్ని ఉపయోగించలేదని స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీని తమ పత్రిక అవమానించిందన్న వాదనలు బూటకమని వివరణ ఇస్తూ కూడా ఆ పత్రిక ఒక కథనం పోస్ట్ చేసింది.
రాహుల్ గాంధీ గత వారంలో దుబాయి పర్యటనలో ప్రవాస భారతీయులను కలిశారు. ఒక స్టేడియంలో వారితో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన విదేశీ పర్యటనల సందర్భంగా ప్రవాస భారతీయుల సమావేశాల్లో ప్రసంగించినట్లే రాహుల్ కూడా ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- Fact Check: రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ఇబ్బంది పెట్టిందా?
- FACT CHECK: ఆస్ట్రేలియా బీరు సీసాలపై హిందూ దేవుళ్ళ బొమ్మలు
- PUBG: ఈ ఆటకు ఎందుకంత క్రేజ్? ఎలా ఆడతారు? ఇందులో గెలుపు ఓటములు ఏమిటి?
- వర్జినిటీ కోల్పోవడానికి సరైన వయసంటూ ఒకటి ఉంటుందా
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఒక్క వంటపాత్ర లేకుండానే నోరూరించే బిర్యానీ రెడీ
- జనాభా 80 లక్షలు... మాట్లాడే భాషలు 800
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)