డోనల్డ్ ట్రంప్‌కు సెనేట్‌లో చుక్కెదురు: సౌదీకి అమెరికా సైనిక సాయం ఆపేయాలని తీర్మానం

యెమెన్ యుద్ధంలో సౌదీ అరేబియాకి అమెరికా అందిస్తున్న సైనిక సాయాన్ని ఉపసంహరించాలంటూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించింది. జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్యోదంతంలో సౌదీ యువరాజు పాత్రను నిందిస్తూ సెనేట్ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో ఒక సభ.. 1973 యుద్ధ అధికారాల చట్టం కింద సైనిక సంఘర్షణ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించటానికి అంగీకరించటం ఇదే తొలిసారి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహ రిపబ్లికన్ సభ్యులు కొంరు కూడా ఆయనను ధిక్కరించి డెమొక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. తీర్మానం 56 - 41 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.

అయితే, ఈ తీర్మానం ప్రధానంగా సంకేతాత్మకమేనని, చట్టంగా మారే అవకాశం లేదని పరిశీలకులు పరిగణిస్తున్నారు.

సెనేట్‌లో ఏం జరిగింది?

యెమెన్‌లో యుద్ధ చర్యల్లో పాలుపంచుకుంటున్న అమెరికా బలగాలను ఉపసంహరించాలని ఈ ‘యుద్ధ అధికారాల తీర్మానం’ అధ్యక్షుడికి పిలుపునిస్తోంది. అయితే, ఇస్లామిక్ అతివాదులతో పోరాడుతున్న సైనికులను మినహాయించింది. కానీ, ఈ తీర్మానానికి అధ్యక్షుడు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.

అనంతరం వాషింగ్టన్ పోస్ట్ పత్రిక జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ అక్టోబర్ నెలలో హత్యకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను నిందిస్తూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ హత్యకు కారకులైన వారిని బాధ్యులను చేయాలంటూ సౌదీ రాజ్యాన్ని డిమాండ్ చేసింది.

సౌదీ యుద్ధ విమానాలకు ఇంధనం అందించటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా గత నెలలో నిర్ణయించింది. గురువారం సెనేట్‌లో ఆమోదించిన తీర్మానం ఒకవేళ చట్టంగా మారినట్లయితే.. ఇంధనం నింపే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోతుంది.

సెనెటర్లు ఏమన్నారు?

రిపబ్లికన్ సెనెటర్ మైక్ లీతో కలిసి ఈ తీర్మానాన్ని బలపరచిన స్వతంత్ర సెనెటర్ బెర్నీ సాండర్స్.. సెనేట్ దీనిని ఆమోదించటాన్ని కీర్తించారు.

‘‘సౌదీ అరేబియా నిరంకుశ ప్రభుత్వ సైనిక దురాక్రమణల్లో మనం భాగస్వాములం కాబోమని నేడు మనం ఆ ప్రభుత్వానికి చెప్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇది ‘‘భూమి మీద అత్యంత దారుణమైన మానవ విపత్తులో అమెరికా భాగస్వామిగా కొనసాగబోదని ప్రపంచానికి ఇస్తున్న సంకేతం’’ అని అభివర్ణించారు.

‘‘సౌదీ యువరాజు కోర్టు జ్యూరీ ముందు నిలుచుంటే.. ఆయనను 30 నిమిషాల్లో దోషిగా నిర్ధారిస్తారని నా అభిప్రాయం’’ అని రిపబ్లికన్ సెనెటర్ బాబ్ కార్కర్ ఎంఎస్ఎన్‌బీసీ చానల్‌తో చెప్పారు.

యధాతథ స్థితి ఇక ఏమాంత్రం అంగీకారం కాదు

సౌదీ అరేబియా సంబంధాల్లో యధాతథ స్థితి ఇక ఏమాత్రం ఆమోదనీయం కాదని ఈ రెండు తీర్మానాలూ బలమైన సందేశం పంపుతున్నాయని బీబీసీ విదేశాంగ శాఖ ప్రతినిధి బార్బరా ప్లెట్ పేర్కొన్నారు.

బార్బరా విశ్లేషణ ప్రకారం.. సౌదీతో వ్యూహాత్మక సంబంధాలకు సెనెటర్లు విలువనిస్తున్నారు. అయితే.. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వం పట్ల.. ప్రత్యేకించి యెమెన్‌లో అతడి జోక్యంతో జరుగుతున్న ప్రాణ నష్టం పట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

అయితే, ఈ తరహా తీర్మానం ఈ ఏడాది ఆరంభంలో ఆమోదం పొందలేకపోయినప్పటికీ.. జమాల్ ఖషోగ్జీ హత్యోదంతంతో పరిస్థితి మారిపోయింది.

ఖషోగ్జీ హత్య యువరాజు ఆదేశాల మేరకే జరిగి ఉండవచ్చునని సీఐఏ నిర్ధారణకు వచ్చినా కూడా.. అమెరికా ప్రభుత్వం ఆయనకు అండగా నిలబడటంతో సెనెటర్లలో నిరసన నెలకొంది.

ప్రస్తుత ప్రభుత్వ విధానాల్లో విలువలు - ప్రయోజనాల మధ్య సంతులనం లేదన్న అభిప్రాయం సెనేట్‌ సభ్యుల్లో చాలా మందిలో నెలకొందని రిపబ్లికన్ సెనెటర్ బాబ్ కార్కర్ ఇటీవల పేర్కొనటాన్ని బార్బరా ప్రస్తావించారు.

ఈ తీర్మానం చట్టంగా మారుతుందా?

సెనేట్ తీర్మానాన్ని వీటో చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినబూనారు. పైగా ఈ తీర్మానం ప్రతినిధుల సభలో ఆమోదం పొందే అవకాశమూ లేదు. దీనిపై బుధవారం ఓటింగ్ జరగాల్సి ఉన్నా ప్రతినిధుల సభ దానిని అడ్డుకుంది.

అయితే.. మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన డెమెక్రాట్ సభ్యులతో వచ్చే జనవరిలో ప్రతినిధుల సభ డెమొక్రాట్ల నియంత్రణలోకి వస్తుందని.. అప్పుడు ఈ తీర్మానం ఆమోదం పొందుతుందని తాను భావిస్తున్నానని సెనెటర్ బెర్నీ సాండర్స్ పేర్కొన్నారు.

యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సౌదీ సారథ్యంలోని సంకీర్ణం చేస్తున్న యుద్ధానికి అమెరికా అందిస్తున్న సాయాన్ని ఈ తీర్మానం కత్తిరిస్తుందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.

సౌదీ అరేబియా తను ఉపయోగించే ఆయుధాల్లో సింహ భాగం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల నుంచి కొనుగోలు చేస్తోంది.

సౌదీ రాజ్యంతో అమెరికా ఆర్థిక సంబంధాలు ముఖ్యమని శ్వేతసౌధం అధికారులు ఉద్ఘాటిస్తున్నారు. ట్రంప్ సలహాదారుడు, అల్లుడు జారెడ్ కుష్నర్.. సౌదీ యువరాజుతో తన సంబంధాలను కొనసాగిస్తున్నారని అమెరికా మీడియా చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)