#లబ్‌డబ్బు: అంతరిక్షంలో భారత్‌ను పాకిస్తాన్ ఎదుర్కోగలదా?

వీడియో క్యాప్షన్, అంతరిక్షంలో భారత్ vs పాకిస్తాన్

ఇస్రో స్వదేశీ మిషన్‌లో భాగంగా భారత్ 2022లో అంతరిక్షంలోకి తమ పౌరులను పంపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గత ఆగస్ట్‌లో ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ కూడా సరిగ్గా అలాంటి ప్రకటనే చేసింది.

2022లో చైనా మద్దతుతో తమ దేశ పౌరులను అంతరిక్షంలోకి పంపిస్తానంది పాక్ ప్రభుత్వం.

సైనిక శక్తి నుంచి క్రీడా మైదానాల వరకూ ప్రతి చోటా నేనంటే నేనని పోటీ పడే భారత్, పాకిస్తాన్‌లు.. ఇప్పుడు అంతరిక్ష రంగంలో కూడా సవాళ్లు విసురుకుంటున్నాయి. ఇంతకూ.. అంతరిక్షంలో భారత్, పాకిస్తాన్‌ల ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం.

ఇప్పటి వరకూ తమ స్వశక్తిపై అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించడంలో విజయం సాధించిన దేశాల్లో అమెరికా, రష్యాల తర్వాతి స్థానంలో నిలిచింది చైనా ఒక్కటే. చైనా మొట్టమొదటిసారి 2003లో తమ పౌరుణ్ని అంతరిక్షంలోకి పంపించింది.

ఇప్పుడు 2022 నాటికి ఇందులో ముందడుగు వేయాలన్న సవాలు ఇస్రో ముందుంది. మరోవైపు, పాకిస్తాన్‌కు చెందిన అంతరిక్ష ఏజెన్సీ సుపార్కో ముందు కూడా ఇదే సవాలు ఉంది.

అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటి వరకూ చేపట్టిన మిషన్స్ చూద్దాం.

వాస్తవానికి 1984లోనే మొట్టమొదటి భారతీయ యాత్రికుడు అంతరిక్షంలోకి ప్రయాణించాడు. ఆనాడు రష్యా మద్దతుతో గగనసీమల్ని దాటిన రాకేశ్ శర్మ ఈ చరిత్ర సృష్టించారు.

2008లో భారత్, యాత్రికులు లేని లూనర్ మిషన్‌ను చేపట్టింది. ఇది చంద్రుడిపైకి భారత్ తలపెట్టిన మొట్టమొదటి ప్రయాణం. భారత అంతరిక్షయాన చరిత్రలో దీన్ని బ్రేక్ త్రూగా చెప్పుకోవచ్చు.

మంగళ్‌యాన్ 2014 - భారత్ చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇది. దీని బడ్జెట్ చాలా తక్కువ. దాంతో ఈ మార్స్ మిషన్ అత్యంత చవకైందిగా నమోదైంది.

ఇలాంటి మిషన్ల ద్వారా మన గ్రహం, అంతరిక్షంల గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం, కనుక్కోవడం ఒక్కటే కాదు.. రక్షణ అవసరాలు కూడా నెరవేరుతాయి. సైనిక ఆధిక్యతను చాటిచెప్పడం కూడా వీటికి లక్ష్యంగా ఉంటుంది.

అందుకే ఈ మిషన్లపై భారీగా ఖర్చు చేస్తాయి ప్రభుత్వాలు. కాబట్టి మీ కోసం ఎవరైనా కావాలంటే చంద్రుణ్ని కిందికి దింపుతాననీ లేదా చుక్కల్ని కోసుకొస్తాననీ ఎడాపెడా హామీలు ఇస్తే అదంత సులభం ఏమీ కాదన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి.

పాకిస్తాన్ 2022లో చైనా సహాయంతో తొలిసారిగా తన దేశ పౌరుణ్ని అంతరిక్షంలోకి పంపించనుంది. అంతరిక్ష రంగానికి సంబంధించి పాకిస్తాన్ చాలా కాలంగా ఇలాంటి కలలు కంటోంది.

1961లోనే పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ ఏర్పాటైంది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు 1969లో భారత్‌లో ఇస్రో ఏర్పాటైంది.

ఆసియా ఖండంలో జపాన్, ఇజ్రాయెల్‌ల తర్వాత అంతరిక్షంలోకి విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన మూడో దేశం పాకిస్తాన్. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన పదవ దేశంగా నిలిచింది పాక్.

అంటే, భారత్ తన తొలి రాకెట్‌ను ప్రయోగించడానికి సరిగ్గా ఒక సంవత్సరం ముందుగానే పాకిస్తాన్ ఈ ఘనత సాధించిందన్నమాట. అయితే 1980, 90 దశకాల్లో సుపార్కో బడ్జెట్‌లో కోతలు ప్రారంభమయ్యాయి.

2018-19 సంవత్సరంలో ఇస్రో బడ్జెట్ 10 వేల 783 కోట్ల రూపాయలు. ఇదే సంవత్సరంలో పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ సుపార్కో బడ్జెట్ కేవలం 470 కోట్ల పాకిస్తానీ రూపాయలు మాత్రమే.

2017 గణాంకాల ప్రకారం భారత జీడీపీ 2,597 బిలియన్ డాలర్లు కాగా, పాకిస్తాన్ జీడీపీ 304 బిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ ఆర్థికవ్యవస్థలో దాదాపు అర శాతం అన్నమాట.

ప్రారంభంలో బాగానే జోష్ చూపినప్పటికీ 1980, 90 దశకాల నాటికల్లా సుపార్కో బడ్జెట్ క్రమంగా తగ్గిపోసాగింది. అంతరిక్ష రంగంలో పరిశోధనలు పాక్ పాలకుల ప్రాథమ్యాల్లో లేకుండా పోయాయి.

మరోవైపు, నేటి తరుణంలో ప్రపంచంలోని టాప్ స్పేస్ కార్యక్రమాల్లో ఇస్రో చెప్పుకోదగ్గ స్థానంలో నిలిచింది.

భారత్ ఇప్పుడు కేవలం సొంత ఉపగ్రహలే కాకుండా ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది.

ఫిబ్రవరి 2017 ఒకేసారి 104 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో, భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)