You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్: ప్రజల విరాళాలతో 1.20 లక్షల కోట్ల సాగునీటి ప్రాజెక్టు సాధ్యమేనా?
పాకిస్తాన్ తక్షణం తగిన చర్యలు తీసుకోకుంటే 2025 నాటికి చుక్క నీరు లభించదని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. మరోవైపు గిల్గిత్ ప్రాంతంలో సింధూ నదిపై దాదాపు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలతో రెండు భారీ నీటి ప్రాజెక్టులను కట్టేందుకు సిద్ధమవుతోంది పాకిస్తాన్. అయితే గిల్గిత్ చుట్టూ వివాదాలు ఉన్నందున నిధులిచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి విరాళాలు సేకరించి డ్యాంలను పూర్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. దీనిపై బీబీసీ ప్రతినిధి కిర్మానీ అందిస్తున్న కథనం.
పాకిస్తాన్‌లోని ఉత్తర భాగంలో రెండు భారీ నీటి ప్రాజెక్టులు కట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కలను సాకారం చేయడం కోసం ప్రజలు విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ పిలుపు మేరకు... విద్యార్థులు, ఆటగాళ్లు, సైన్యం ఇలా అన్ని వర్గాల వారూ విరాళాలు ఇస్తున్నారు.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు.
‘‘2025 నాటికి ప్రాజెక్టులు కట్టకపోతే దేశంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు’’ అని ఆయన అన్నారు.
బ్రిటిష్ వ్యాపారి యాసిర్ అలీ వంటి, విదేశాల్లో ఉండే పాకిస్తాన్ సంతతి ప్రజలు కూడా విరాళాలు ఇస్తున్నారు. వచ్చిన లాభాల్లో కోటి రూపాయలకు పైగా ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.
‘‘గత కొన్నేళ్లుగా మా దేశం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఇంత వరకూ పెద్ద డ్యాంలు కట్టలేదు. విరాళం ఇవ్వడమంటే మనవంతు దేశానికి ఏమైనా మేలు చేయడమే’’ అని యాసిర్ అలీ తెలిపారు.
నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని అతి పెద్ద డ్యాంలలో ఇవీ భాగమవుతాయి. ఇందుకు దాదాపు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇప్పటి వరకు 350 కోట్లు వచ్చాయి.
తరముకొస్తున్న నీటి సమస్యపై పోరాడుతున్న ఇమ్రాన్ ఖాన్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంత భారీ ప్రాజెక్టును విరాళాలతో కట్టడమనేది అసాధ్యమని చాలా మంది విమర్శకులు అంటున్నారు.
ఇప్పుడున్న వేగం చూస్తే ఈ డ్యాముల కోసం పూర్తి నిధులు సేకరించడానికి యాభై ఏళ్లకు పైనే పడుతుంది. అయితే మంత్రి ఫవాద్ ఛౌదరి మాత్రం ఇమ్రాన్ ఖాన్ త్వరలోనే వీటిని పూర్తి చేస్తారని అంటున్నారు.
‘‘అసాధ్యాలను సుసాధ్యం చేయగలనని ఇమ్రాన్ గతంలో నిరూపించారు. ఆయన నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన కచ్చితంగా చెప్పింది చేస్తారు’’ అని ఫవాద్ ఛౌదరి అన్నారు.
ఈ ప్రాజెక్టులకు ప్రజాదరణతో పాటు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అయితే, నిధుల సమీకరణలో ఇమ్రాన్ ఖాన్ ఎంత వరకు విజయవంతం అవుతారో వేచి చూడాలి.
ఇవి కూడా చూడండి:
- ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ
- 'బాబ్రీ' తర్వాత పాకిస్తాన్లో కూల్చిన మందిరాలివే!
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- #fallingstarschallenge: ఈ చైనీయుల ఫొటోల్లో నిజమెంత?
- అయోధ్య వాసులకు రామ మందిరం అంటే ఆసక్తి ఎందుకుండదు?
- చైనా, జపాన్ల మధ్య ఆకస్మిక స్నేహబంధం
- పాకిస్తాన్ చరిత్ర: జిత్తులమారి జియా ఉల్-హక్ ఖురాన్ సాక్షిగా భుట్టోను మోసం చేసిన వైనం
- అమిత్ షా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)