You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమిత్ షా సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు?
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుప్రీంకోర్టుకు ఒక సలహా ఇస్తున్నారు. కోర్టులు ప్రాక్టికల్‌గా ఉండాలని, ఆచరణ సాధ్యమైన తీర్పులే ఇవ్వాలని ఆయన అంటున్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు శబరిమల కేసులో 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేరళలోని కన్నూరులో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో ఆయన ఈ సూచన చేశారు.
కన్నూరులో కొన్ని దశాబ్దాలుగా ఆరెస్సెస్-బీజెపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూ అనేక మంది మరణించారు.
శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జరిగిన నిరనసలు, ఘర్షణల్లో సుమారు 2,500 మందికి పైగా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేశారు.
భక్తుల వెంటే బీజేపీ
బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ అమిత్ షా, ''కోర్టులు ఇలాంటి ఆచరణసాధ్యం కాని తీర్పులు ఇవ్వకూడదు. అయిదు కోట్ల మంది భక్తుల మనోభావాలను మీరు ఎలా దెబ్బ తీస్తారు? హిందువులు ఎన్నడూ మహిళల పట్ల వివక్ష చూపరు. అన్ని హిందువుల పండుగలను భార్యలు తమ భర్తలతో కలిసి జరుపుకుంటారు.’’
‘‘హిందువుల ఉండే ప్రాంతాలను బట్టి వాళ్ల విశ్వాసాలు, నమ్మకాలు మారుతుంటాయి. మహిళలు కూడా వెళ్లే ఆలయాలు చాలా ఉన్నాయి'' అని అమిత్ షా అన్నారు.
కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులను అవమానపరుస్తోందని అమిత్ షా ఆరోపించారు. ప్రభుత్వం అయ్యప్ప భక్తులను జైళ్లలో పెడుతోందని అన్నారు.
బీజేపీ భక్తుల వైపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగంపైనే దాడి: విజయన్
మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన సుప్రీంకోర్టు, రాజ్యాంగంపైనే దాడి చేస్తున్నారని విజయన్ ట్వీట్ చేశారు.
బీజేపీకి భారతీయ రాజ్యాంగంపై విశ్వాసం లేదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు ఆరెస్సెస్, సంఘ్ పరివార్ యొక్క అసలు రూపాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపారు.
''అమిత్ షా వ్యాఖ్యలను బట్టి మనుస్మృతిలో పేర్కొన్న వివక్ష ఆయనలో ఎంత బలంగా నాటుకుపోయిందో తెలుస్తోంది. మన సమాజం ఇలాంటి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలి'' అని విజయన్ అన్నారు.
ఎల్డీఎఫ్ ప్రభుత్వం బీజేపీ దయతో ఏర్పడింది కాదని, తమ ప్రభుత్వాన్ని కేరళ ప్రజలు ఎన్నుకొన్నారని గుర్తించాలని విజయన్ వ్యాఖ్యానించారు.
షా కోర్టులను బెదిరిస్తున్నారా?
అయితే పాలక్కాడ్‌కు చెందిన సీపీఎం ఎంపీ ఎంబీ రాజేశ్, అమిత్ షా వ్యాఖ్యలను మరో కోణం నుంచి చూస్తున్నారు.
''నిజానికి అమిత్ షా సుప్రీంకోర్టుకు సూచనలు ఇవ్వడం కాదు.. ఆయన దేశపు అత్యున్నత న్యాయస్థానాన్ని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగార్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి'' అని రాజేశ్ అన్నారు.
మరోవైపు శనివారం తిరువనంతపురంలో.. కోర్టు తీర్పును ఆహ్వానించిన స్వామి సందీపానంద గిరి ఆశ్రమంపై దాడి జరిగింది. ఈ దాడిలో దుండగులు రెండు కార్లు, ఒక స్కూటర్‌ను అగ్నికి ఆహుతి చేశారు.
ఆశ్రమాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి విజయన్.. మతతత్వ శక్తులు రాష్ట్రంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించబోమన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)