You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూకేలో ప్రజలకు ఎలాంటి గుర్తింపు కార్డులూ ఉండవు... ఎందుకు?
దేశంలో ఆధార్ పైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డు ఉండాలని కొందరు అంటున్నారు. కానీ యూకేలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఎవ్వరికీ ఎలాంటి గుర్తింపు కార్డులూ ఉండవు.
‘మీ గుర్తింపు కార్డును చూపించండి’ అన్న ప్రశ్న ఏ పౌరుడికీ అధికారుల నుంచి ఎదురవదు.
సాధారణంగా గుర్తింపు కార్డులను ప్రవేశ పెట్టిన అన్ని దేశాలూ... అవి ప్రజలు తామెవరో నిరూపించుకోవడానికి సులువుగా ఉపయోగపడతాయని చెబుతాయి. కానీ, 2005లో యూకే ప్రభుత్వం పౌరులకు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టాలని ప్రయత్నించినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. దాంతో, ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
అసలు ఇంతకీ గుర్తింపు కార్డుల విధానాన్ని యూకే ఎందుకు అనుసరించట్లేదు? దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
పౌరుల హక్కులు
గుర్తింపు కార్డులను యూకేలో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగంగా భావిస్తారు.
ఈ గుర్తింపు కార్డుల ప్రతిపాదనను 2010లో యూకేలో రద్దు చేసే సమయంలో, నాటి హోమ్ సెక్రటరీ థెరిసా మే మాట్లాడుతూ... చట్టబద్ధంగా జీవించే పౌరులపైన ప్రభుత్వ నియంత్రణను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది అని చెప్పారు.
గుర్తింపు కార్డుల కారణంగా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య ఉన్న బంధం కూడా దెబ్బతింటుందని అక్కడి పౌరులు భావిస్తారు.
‘ఎవరైనా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగొచ్చు. దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. అదే గుర్తింపు కార్డులుంటే, ఏ పోలీసు అధికారైనా ఆపి ఆ గుర్తింపు కార్డులను చూపించమని అడగొచ్చు. బ్రిటన్ ప్రజలకు ఆ పరిస్థితి కల్పించడం మంచిది కాదు’, అని అక్కడి పార్లమెంటు సభ్యుడు జాకబ్ రీస్-మాగ్ చెప్పారు.
వ్యక్తిగత గోప్యతకు భంగం
గుర్తింపు కార్డు ఉంటే నైట్ క్లబ్‌లో ప్రవేశానికి, మద్యం కొనడానికి, టాటూ వేయించుకోవడానికి... ఇలా రకరకాల సందర్భాల్లో అవి పనికొస్తాయని కొందరు అంటారు. కానీ, ఆ కార్డుల వల్ల వ్యక్తిగత సమాచారం ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని, దానివల్ల భద్రతకే ప్రమాదమని పౌరు హక్కుల కార్యకర్తలు చెబుతారు.
కార్డుల వల్ల నిజంగా ఉపయోగాలుంటే ఫర్వాలేదు. కానీ, అవి ప్రజలను తమ జాతి, సామాజిక స్థితిగతుల ఆధారంగా వేరు చేసేవైతే, వాటితో ఎలాంటి ఉపయోగం లేదని వాళ్లంటారు.
‘నల్లజాతీయులు, ఆసియన్లు ఇప్పటికే ఈ గుర్తింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు ఇల్లు అద్దెకు ఇచ్చేముందు గుర్తింపు కార్డులను అడుగుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు’ అని గార్డియన్ పత్రికా విలేఖరి కాన్రడ్ ల్యాండిన్ చెబుతారు.
డేటా చోరీ
తమ గుర్తింపును ఇతరులు దొంగిలించకుండా ఉండటానికి ఈ కార్డులు ఉపయోగపడతాయని ఇలాంటి కార్డులకు అనుకూలంగా మాట్లాడేవారు చెబుతారు.
బ్యాంకు ఖాతాలు తెరవడానికి, క్రెడిట్ కార్డులకు, డబ్బు చెల్లింపులు చేయడానికి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేస్తే, మోసాలు తగ్గుతాయని వారు వాదిస్తారు. కానీ, అదే సమయంలో ఆ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా చోరీ చేసి దుర్వినియోగం చేసే ప్రమాదమూ ఉందన్నది ఇంకొందరి అభిప్రాయం.
తమ వ్యక్తిగత సమాచారాన్నంతా ప్రభుత్వ డేటాబేస్‌కు అందించడానికి కూడా మెజారిటీ ప్రజలు సిద్ధంగా లేరు.
అపనమ్మకం
ఒకవేళ బయోమెట్రిక్స్, వ్యక్తిగత సమాచారం, మెడికల్ రికార్డులు, క్రెడిట్ హిస్టరీ తదితర వ్యక్తిగత సమాచారమంతా ఒక దగ్గర చేరితే పరిస్థితి ఏంటి?
ఎన్ని ప్రభుత్వ, కాంట్రాక్ట్ సంస్థలకు పౌరుల సామాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది?
మన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు చూశారో తెలుసుకునే వీలుంటుందా?
ఆ సమాచారాన్ని ఎవరైనా, వేరెక్కడైనా భద్రపరిచారా?
సమాచార భద్రత విషయంలో ప్రస్తుత బ్రిటిష్ చట్టాలు ఎంత పటిష్ఠంగా ఉన్నాయి?... గుర్తింపు కార్డులకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ ప్రశ్నలన్నీ చర్చకు వస్తాయి.
అధికారులు తమ వ్యక్తిగత సమచారాన్ని గోప్యంగా ఉంచడంలో విఫలమవుతారనే భావన కూడా ప్రజల్లో నెలకొంది.
గుర్తింపు కార్డులకు మద్దతు తెలిపేవారంతా వాటి వల్ల అక్రమ వలసలు, టెర్రిరిజం, సంక్షేమ పథకాల్లో మోసం లాంటి అంశాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. కానీ, అలాంటి గుర్తింపు కార్డులు ఉన్న స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో కూడా ఈ సమస్యలకు పరిష్కారం దొరకలేదని కొందరు గుర్తు చేస్తారు.
ఆ రెండు దేశాల్లోనూ భారీ స్థాయిలో అక్రమ వలసలు జరిగాయి. టెర్రిరిజం ఛాయలూ కనిపిస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాల్లో అక్రమాలూ జరుగుతూనే ఉన్నాయి.
కాబట్టి, ఇతర దేశాల్లో వ్యవస్థ ఎలా ఉన్నా, బ్రిటన్ వాసులు మాత్రం వ్యక్తిగత గుర్తింపు కార్డులకు ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)