నవురు: శరణార్థి శిబిరాల్లో పిల్లల ఆత్మహత్యాయత్నాలు

ఫొటో సోర్స్, World Vision Australia
- రచయిత, వర్జీనియా హారిసన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నవురులోని శరణార్థి శిబారాలలో పిల్లల ఆత్మహత్యాయత్నాలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఆస్ట్రేలియా తమ దేశానికి వచ్చే శరణార్థులను ఈ ద్వీపంలోని శిబిరాలకు తరలిస్తోంది.
చాలా ఏళ్లుగా నవురులోని శరణార్థి శిబిరాలు మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.
ఇటీవల మీడియాలో వెలువడుతున్న వార్తలను బట్టి అక్కడ పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
''అక్కడ కేవలం 8-10 ఏళ్ల వయసు పిల్లల్లో కూడా ఆత్మహత్యకు పాల్పడాలన్న ధోరణి కనిపిస్తోంది'' అని ఆ ద్వీపంలోని శరణార్థి శిబిరాలలోని కుటుంబాలు, పిల్లలతో కలిసి పని చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌కు చెందిన సైకియాట్రి ఫ్రొఫెసర్ లౌజీ న్యూమ్యాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా తమ దేశానికి పడవల ద్వారా చేరుకోవడానికి ప్రయత్నించే శరణార్థులందరినీ మధ్యలోనే అడ్డుకుంటోంది. వారందరినీ నవురు, పపువా న్యూ గినియాలో ప్రైవేట్ సంస్థలు నిర్వహించే 'ప్రాసెసింగ్ సెంటర్'లకు పంపుతోంది.
శరణార్థి కేంద్రాలలోని ఇరాన్, ఇరాక్, లెబనాన్, రోహింజ్యా శరణార్థులకు చెందిన పిల్లలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ శరణార్థులతో కలిసి పని చేస్తున్న సంస్థల ప్రతినిధులు చెప్పేదాన్ని బట్టి అక్కడ చాలా మంది పిల్లలు నిర్బంధ జీవితాన్ని గడుపుతున్నారు.
పేదరికంతో పాటు వాళ్లు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల కారణంగా వాళ్ల మానసిక పరిస్థితి సరిగా ఉండడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక శరణార్థి కేంద్రంలో సలహాదారుగా ఉన్న నటాషా బ్లూషర్.. తమ కేంద్రంలోని సుమారు 15 మంది పిల్లలు మళ్లీ మళ్లీ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడమో లేదా తమను తాము తీవ్రంగా గాయపర్చుకోవడమో చేస్తున్నారని తెలిపారు. ఇది ఒక సంక్షోభ స్థాయికి చేరిందని ఆమె అన్నారు.
ఇలాంటి కేంద్రాలలో ఉండే సుమారు 30 మంది పిల్లలు 'ట్రమాటిక్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్'తో బాధపడుతున్నారు.
వీళ్లు క్రమక్రమంగా జీవితంపై ఆసక్తి కోల్పోతారు. తిండీనీళ్లపై ఆసక్తి కోల్పోవడంతో మరణానికి దగ్గరవుతారు.

ఫొటో సోర్స్, World Vision Australia
'ట్రమాటిక్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్' అంటే ఏమిటి?
- దీనిలో మొదట పిల్లలు ఆటలు లాంటి వాటికి దూరంగా ఉంటారు. ఆ తర్వాత తిండి, నీళ్లు కూడా తీసుకోవడానికి నిరాకరిస్తారు.
- క్రమంగా ఇలాంటి పిల్లల ప్రతిస్పందనలు తగ్గిపోతాయి. శరీరం వాళ్లకు సహకరించడం మానేస్తుంది.
- ఈ దశలో వాళ్లకు కొన్ని నెలల పాటు చికిత్స అవసరం.
- స్వీడన్‌లోని శరణార్థుల పిల్లల్లో ఇలాంటి దశను గుర్తించారు.
ఈ పరిస్థితుల్లో పిల్లల పరిస్థితి క్రమక్రమంగా దిగజారుతుంది. దీని వల్ల వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
ఇలాంటి పిల్లలకు సలహాదారుగా పని చేస్తున్న డాక్టర్ బారీ ఫాటర్‌ఫోడ్.. తమ సంస్థ 'డాక్టర్స్ ఫర్ రెఫ్యూజీస్'కు నవురు సందర్శించేందుకు అనుమతించలేదని తెలిపారు.
అయితే అలాంటి మానసిక సమస్యలు కలిగిన సుమారు 60 మంది పిల్లలను తమ వద్దకు పంపారని తెలిపారు.
పిల్లల్లో రోజూ ఎవరో ఒకరు ఆత్మహత్యాయత్నం చేస్తుంటారని ఆమె తెలిపారు. అంతే కాకుండా ఆ శిబిరాలలో లైంగిక, భౌతిక హింస సర్వసాధారణమని, ఆ శరణార్థి కేంద్రాల నుంచి పిల్లలు బయటపడే అవకాశం లేదని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా ప్రధానిపై విమర్శలు
ఈ విధానానికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. శరణార్థుల విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన విధానాల వల్లే ఆస్ట్రేలియాకు శరణార్థుల సంఖ్య తగ్గిపోయిందనేది ఆయన మద్దతుదారుల వాదన.
పిల్లల ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, మానవ హక్కుల సంస్థలు నవురు శరణార్థి క్యాంపులలో ఉంటున్న పిల్లలను వేరే చోటికి తరలించాలని కోరుతున్నాయి.
అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఒక ప్రకటనలో, నవురు ప్రభుత్వం పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని కోరినట్లు వెల్లడించింది. అవసరమైతే పిల్లలను ఇతర దేశాలలో చికిత్సకు తరలిస్తున్నామని తెలిపింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








