అంగారకుడిపై నీటి సరస్సు: మరి అక్కడ జీవం ఉందా? లేదా?

అంగారక గ్రహంపై ఓ నీటి సరస్సును పరిశోధకులు గుర్తించారు. అంగారకుడి దక్షిణ ధృవంలోని మంచు పొరల కింద, ఈ సరస్సు ఉంది. ఇది 20కి.మీ. మేర విస్తరించినట్లు భావిస్తున్నారు.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ)కి చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్ ఈ నీటి జాడను కనుగొంది.

గతంలో జరిగిన పరిశోధనలు అంగారకుడిపై కొన్ని ‘తడి ప్రాంతాల’ను గుర్తించాయి. కానీ ద్రవరూపంలో, నీరు ఓ సరస్సులా ఏర్పడిన ప్రాంతాన్ని కనుగొనడం ఇదే ప్రథమం.

గతంలో నాసా రోవర్ చిత్రించిన ఫోటోల్లో కూడా అంగారకుడిపై నీటి జాడ కనిపించింది. అంగారకుడిపై వాతావరణం చల్లగా ఉండడంతో.. నీటి ఉపరితలం ఘనీభవించింది. ఆ మంచు పొరల కింద నీరు ద్రవ రూపంలో ఉంది.

ఇలాంటి నీటి జాడ కోసం చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఆ పరిశోధనలన్నీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. తాజా ఆవిష్కరణ.. ఇతర గ్రహాలపై జీవం గురించి సాగుతున్న అధ్యయనాలకు మరింత తోడ్పాటునిస్తుంది.

ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఇటాలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్‌ ప్రొఫెసర్ రోబర్టో ఓరోసే మాట్లాడుతూ.. ''ఇది ద్రవ రూపంలో ఉన్న నీటి సరస్సు అని తేలింది. అయితే ఇది మరీ అంత పెద్ద సరస్సు కాకపోవచ్చు'' అన్నారు.

ఎలా కనుగొన్నారు?

అంగారకుడి ఉపరితలం పైకి, లోపలి పొరలలోకి మార్సిస్ రాడార్ కొన్ని తరంగాలు/సంకేతాలను పంపింది. ఉపరితలాన్ని తాకి తిరిగి వెనక్కు వచ్చే తరంగాలను మార్సిస్ విశ్లేషిస్తుంది.

ఆ విశ్లేషణల్లో భాగంగా కనిపించిన తెల్లటి మచ్చలు అంగారకుడి దక్షిణ ధృవాన్ని సూచించాయి. అక్కడే.. నీరు, మంచు, దుమ్ము కలగలసిన ప్రాంతం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మంచు పొరలకు 1.5 కి.మీ. కింద ఏదో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

''ఆ ప్రాంతం లోతులకు వెళ్లి వెనక్కు వచ్చిన తరంగాలు, సాధారణంగా అంగారకుడి ఉపరితలాన్ని తాకి వచ్చిన తరంగాల కంటే బలంగా ఉన్నాయి. అక్కడే.. నీటి జాడ ఉన్నట్లు కనుగొన్నాం'' అని ప్రొఫెసర్ ఓరోసే అన్నారు.

అంగారకుడిపై జీవం ఉన్నట్లేనా?ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం!

''అంగారకుడి ఉపరితలం.. జీవం ఉండటానికి అనువైన ప్రాంతం కాదన్న విషయం మనకు తెలుసు. కానీ.. తాజా అధ్యయనంతో, అంగారకుడి లోపలి పొరల్లో జీవం ఉందా? అనే విషయంపై పరిశోధనలు జరగాల్సి ఉంది'' అని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డా.మనీష్ పటేల్ అన్నారు.

''అంగారకుడి లోపలి పొరల్లో మనకు హాని కలిగించే రేడియేషన్ నుంచి రక్షణ లభిస్తుంది. వాతావరణంలో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు మనకు తగినంత మోతాదులో ఉంటాయి. అన్నిటికీ మించి, ఈ ప్రాంతం.. జీవం మనుగడకు అవసరమయ్యే నీరు ఇక్కడ కనిపించింది.''

ఆస్ట్రోబయాలజీలో నీటి కోసం అన్వేషించడం కీలకాంశం. భూమి వెలుపల జీవం మనుగడ కోసం సాగే అధ్యయనం ఇది.

''అంగారకుడిపై జీవం కోసం సాగుతున్న మా అన్వేషణ ఇంకా పూర్తవ్వలేదు. అయితే.. అంగారకుడిపై ఏ ప్రాంతంలో పరిశోధనలు చేయాలో తాజా అధ్యయనం వివరించింది. ఈ ప్రాంతం.. మా పరిశోధనలకు ఓ భాండాగారం లాంటిది.’’ అని మనేష్ పటేల్ అన్నారు.

పరిశోధనల్లో బయటపడ్డ ఆ నీటి ఉష్టోగ్రత, దాని గుణం జీవరాశికి అణుగుణంగా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అంగారకుడిపై ఉన్న చల్లటి వాతావరణంలో నీరు ద్రవ రూపంలో ఉండాలంటే (పరిశోధకుల అంచనా ప్రకారం -10 నుంచి -30 సెల్సియస్) అందులో చాలా రకాల లవణాలు ఉండాలి.

''అలాంటి వాతావరణంలో నీరు చాలా చల్లగా, కటిక ఉప్పుగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలోని నీరు జీవం ఉద్భవం, మనుగడకు పెనుసవాలే!'' అని ఇంగ్లండ్‌కు చెందిన డా. క్లైర్ కజిన్స్ అన్నారు.

తర్వాత ఏమిటి?

తాజా ఆవిష్కరణ ద్వారా.. అంగారకుడిపై జీవం ఉండేదా? భవిష్యత్తులో ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? అన్నిటికన్నా ముందు ఆ సరస్సులోని నీటి స్వభావంపై లోతైన పరిశోధనలు జరగాలి.

''అంగారకుడిపై ఇలాంటి ప్రాంతాల కోసం ఇంకా గాలించాలి. ఇప్పుడు బయటపడిన నీటి సరస్సు.. అంగారకుడిపై జరుగుతున్న అధ్యయనాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటార్కిటికా లోపలి పొరల్లోని నీటిపై జరిగిన పరిశోధనల్లాగే.. అంగారకుడి లోపలి పొరల్లో ఉన్న నీటి సరస్సులపై కూడా పరిశోధనలు జరగాలి'' అని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డా.మ్యాట్ బాల్మ్ అన్నారు.

''అంగారకుడి లోపలి పొరల్లో దాగున్న నీటిని పరీక్షించడం అంత సులువు కాదు. ఈ ప్రాజెక్టులో.. మంచు పొరలను 1.5 కి.మీ. లోతుకు తవ్వగలిగే రోబోలు అవసరం అవుతాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పని చేయలేం. టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందాలి'' అని మ్యాట్ బాల్మ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)