ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోందిలా..

మానస వయసు 15 ఏళ్లే. కానీ ఆమె సాధించిన విజయం చూసి కోట్లాది మంది ఆమెను అభినందిస్తున్నారు. పుట్టింది అమెరికాలోని ఒహాయాలో అయినా మానస తెలుగమ్మాయే.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు మానస కనిపెట్టిన ఒక పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

చౌకగా, సులువుగా విద్యుత్ తయారు చేయడం వీలవుతుంది. చీకట్లను తరిమేసే అవకాశం కలుగుతుంది.

ఆ పరికరం పేరు హార్వెస్ట్. కనిపెట్టింది అమెరికాలో ఉండే తెలుగు అమ్మాయి మానస.

గాలి కదలికల నుంచి, వాన ఒత్తిడి నుంచి, సూర్యుడి వేడి నుంచి విద్యుత్తును పండిస్తుందీ పరికరం.

‘హార్వెస్ట్’ పరికరాన్ని తయారు చేయటానికి 300 రూపాయలు చాలు.

ప్రపంచంలో ఇప్పటికీ విద్యుత్తు అందని కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగు నింపటానికి తోడ్పడాలన్నదే తన ఆవిష్కరణ లక్ష్యమని చెప్తోంది మానస.

హార్వెస్ట్ పరికరం తయారు చేయాలని ఎందుకు అనిపించింది?

అమెరికాలోని ఒహాయాలో తన తల్లిదండ్రులతో కలిసి నివసించే మానస.. ఏటా సెలవుల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తమ బంధువుల ఇంటికి వస్తుంటుంది.

‘‘అలా ఒకసారి వెళ్లినపుడు మా ఊర్లో కరెంటు లేక దీపం వెలుతురులో చదువుకుంటున్న పిల్లల్ని చూశాను. అప్పుడే అనిపించింది ఈ పరిస్థితిని మార్చటానికి నేను ఏదో ఒకటి చేయాలి’’ అని ఆమె బీబీసీకి చెప్పింది.

అనుకోవటమే కాదు.. అమెరికా రాగానే పరిశోధనలతో కృషి మొదలుపెట్టింది.

‘‘ఏదైనా యాంత్రిక ఒత్తిడికి గురైనపుడు విద్యుదావేశాన్ని ఉత్పత్తి చేసే పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నా దృష్టిని ఆకర్షించింది. దీనిద్వారా.. అతి తక్కువ ఖర్చుతోనే పర్యావరణ హితమైన విద్యుత్‌ను సులభంగా ఉత్పత్తి చేయవచ్చునన్న ఆలోచన వచ్చింది’’ అని మానస బీబీసీకి వివరించింది.

అలా ఒక పరికరాన్ని రూపొందించింది.

మరోవైపు.. మొక్కలు పని చేసే తీరు కూడా ఆమెకు స్ఫూర్తినిచ్చింది. సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెళ్ల తరహాలో కొన్ని ఆకులను (సోలార్ లీవ్స్) తయారు చేసి అదే పరికరానికి అమర్చింది.

అదే ‘హార్వెస్ట్’. మానస రెండేళ్ల కిందట తయారు చేసిన ఈ ‘హార్వెస్ట్’ ఆమెకు 2016లో ‘అమెరికా టాప్ యంగ్ సైటింస్ట్’ అవార్డును తెచ్చిపెట్టింది. దానితోపాటే 25,000 డాలర్ల నగదు బహుమతి కూడా లభించింది.

'హార్వెస్ట్‌'ను ప్రజలకు అందుబాటులోకి తేవడం అసలైన సవాల్

‘‘ఈ ‘హార్వెస్ట్’ నా ఆలోచనల్లో పుట్టుకొచ్చిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానమేమీ కాదు. ప్రత్యక్ష యాంత్రిక ఒత్తిడితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌ విధానాన్ని.. పరోక్షంగా ప్రపంచమంతా విస్తారంగా లభ్యమయ్యే గాలి వంటి యాంత్రిక ఒత్తిడికి ఎందుకు అన్వయించకూడదన్న ఆలోచన వచ్చింది. అప్పుడే నేను గాలికి ఈ పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌ను అన్వయిస్తూ పరిశోధనలు మొదలుపెట్టాను’’ అని మానస చెప్పింది.

ఈ వ్యవస్థను పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ అనుకూల విద్యుత్ శక్తి ఉత్పత్తిని సమీకృతం చేయటానికి సోలార్ ప్యానెళ్లుగా ఉపయోగించవచ్చు.

ఈ పరికరం వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయటానికి అనువైనదిగా రూపొందించి, ప్రజలకు అందుబాటులోకి తేవటం ఇప్పుడు ఆమె ముందున్న సవాలు.

‘‘ఒక్క సోలార్ ప్యానెళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ పరికరాలను ఉపయోగించటం వల్ల విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. వీటి వినియోగం పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది’’ అని మానస పేర్కొంది.

‘‘ఇందుకు అవసరమైన నిధులు సమీకరించటం.. పరికరాలను అభివృద్ధి చేయటం.. అది ప్రజలకు చేర్చగల ఒక మంచి భాగస్వామ్య సంస్థను గుర్తించటం.. దీని మీద కృషి చేయాల్సి ఉంది’’ అని ఆమె చెప్పింది.

ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతు మంది ఇంకా విద్యుత్‌ వెలుగులకు దూరంగా ఉన్నారు. ఈ హార్వెస్ట్ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా.. ప్రత్యేకించి తృతీయ ప్రపంచ దేశాల్లో హరిత విద్యుత్‌ను అతి తక్కువ ఖర్చుతో తేలికగా ప్రజలకు అందించేందుకు కృషి చేయటం మానస లక్ష్యం.

మన ఆలోచనను మనం విశ్వసించటం.. దానికోసం ప్రయత్నించటం ముఖ్యం

మొదట్లో ఈ హార్వెస్ట్ చాలా తక్కువ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేసేది. ‘‘నేను దీని మీద ఆశలు వదులుకునేదాన్ని. కానీ నేను నిరాశపడలేదు. ఎందుకంటే ఆచరణాత్మకమైనది, ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా తయారు చేయాలన్న పట్టుదల నాలో ఉంది. దీంతో పని కొనసాగించాను’’ అంటుందామె.

ఔత్సాహిక పరిశోధకులకు మానస ఇచ్చే సలహా ఏమిటంటే.. ‘‘ఫైట్ చేయండి.’’

‘‘కొన్నిసార్లు మనం చాలా సమస్యలు ఎదుర్కొంటాం. మన మీద మనకు నమ్మకం లేకపోవచ్చు. మన ఆవిష్కరణలను ఇతరులు విశ్వసించకపోవచ్చు. కానీ.. మన ఆలోచనను మనం విశ్వసించటం.. దానికోసం కనీసం ప్రయత్నించటం చాలా ముఖ్యమైన విషయం’’ అని చెప్తుంది.

‘‘అవసరమైన పరికరాలతో ఒక నమూనాను తయారు చేయటమో.. ఆ ఆలోచనకు సంబంధించిన డిజైన్‌ను కాగితాల మీద పెట్టటమో.. చేయాలి. ప్రయత్నం చేసి చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మనం ఏదైనా సాధించి మార్పు తేగలమా అన్నది తెలియదు’’ అని సూచిస్తోంది మానస.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)