ఆఫ్గానిస్తాన్‌: విద్యార్థినుల పీరియడ్స్ కష్టాలు

వీడియో క్యాప్షన్, మాట్లాడితే తప్పులేదు

ఆఫ్గానిస్తాన్‌ పాఠశాలల్లో అమ్మాయిలు చదువులో వెనుకబడుతున్నారు. అందుకు ప్రధాన కారణం వారు పీరియడ్స్ సమయంలో స్కూలుకు రాలేకపోవడమే.

పాఠశాలల్లో మూడింట ఒక వంతు అమ్మాయిలు నెలసరి సమయంలో బడికి రాలేకపోవడంతో వారి భవిష్యత్తు దెబ్బతింటోందని టీచర్లే కాదు యూనిసెఫ్ ప్రతినిధులు కూడా చెబుతున్నారు. పీరియడ్స్ అంటే ఇక్కడి అమ్మాయిలకు చాలా కష్టకాలం. అదొక మానసిక వ్యథ కూడా. అయితే, కాబుల్‌లో కొన్ని చోట్ల పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అంటున్నారు బీబీసీ పష్తో ప్రతినిధి షఫికా.

కాబూల్‌లోని ఒక పాఠశాల బయాలజీ క్లాస్‌లో నెలసరి పీరియడ్స్‌ను ఒక పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఇక్కడున్న చాలా మంది బాలికలకు ఇదొక కొత్త సబ్జెక్ట్. ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైన పాఠ్యాంశం. ఆసక్తితో పాటు దడపుట్టించే అంశం. యూనిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా పీరియడ్స్ గురించి బోధిస్తున్నారు. సామాజిక రుగ్మతను అధిగమించి అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ఈ పాఠాలు బోధిస్తున్న టీచర్ మసూదా దీనివల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయంటున్నారు.

‘‘ఆరు, ఆ పై తరగతులకు చెందిన బాలికలకు నెలసరి గురించి చెప్తాను. మొదట్లో అమ్మాయిలు చాలా సిగ్గుపడేవారు. అస్సలు ప్రశ్నలు అడిగేవారు కాదు. కానీ వారి జీవితంలో క్రమంతప్పకుండా దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా వివరించాను. వాళ్ల నెలసరి గురించి ఇంటి దగ్గర అమ్మలతోను, ఇక్కడ నాతోనూ మాట్లాడేవిధంగా ప్రోత్సహిస్తున్నాను’’ అని మసూదా చెప్పారు.

అయితే, ఇది అందరికీ సాధ్యం కాదు. సంప్రదాయ ఆఫ్గాన్ సమాజంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా చర్చించరు. తల్లి కూతుళ్ల మధ్య కూడా ఆ సంభాషణ ఉండదు. యూనివర్సిటీలో చదువుకుంటున్న నర్గీస్ అదొక బాధకరమైన అనుభవమంటున్నారు.

‘‘నాకు మొదటి సారి నెలసరి వచ్చినప్పుడు పదకొండేళ్లనుకుంటా. నేను స్కూల్లో ఉన్నాను. క్లాస్‌లో ఒక బెంచ్‌పై ముగ్గురు కూర్చునేవారు. నేను నిల్చునప్పుడు నా ప్యాంట్‌లో ఏదో తడిగా అనిపించింది. చూసుకుంటే ఎర్రగా ఉంది. ఏం జరిగిందో తెలీదు. ఓ కాగితాన్ని తీసుకొని తుడిచాను. చాలా సిగ్గుగా అనిపించింది. ఆ తర్వాత పాఠంపై అస్సలు ఏకాగ్రత కుదరలేదు’’ అని నర్గీస్ చెప్పారు.

ఆఫ్గానిస్తాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఇక్కడ చర్చించేది పరిశుభ్రత గురించి మాత్రమే కాదు. దీని చుట్టూ ఉన్న ఇతర అపోహలను దూరం చేయాలని కూడా యూనిసెఫ్ భావిస్తోంది. ఆఫ్గాన్‌లోని కొంతమంది అమ్మాయిలు మాంసం, అన్నం, కూరగాయలు, పుల్లని పదార్థాలు తినకూడదని భావిస్తారు. మరికొంతమంది చల్లని నీళ్లు తాగరు. తడిగా ఉన్న నేలపై కూర్చోరు, స్నానం చేయరు. అయితే, పరిస్థితులు మెరుగవుతున్నాయని విద్యా శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ టొరపెకె మొమంద్‌ నమ్మకంగా చెబుతున్నారు.

‘‘పీరియడ్స్ సమయంలో స్నానం కూడా చేయకూడదని చాలా మంది బాలికలకు మూఢనమ్మకాలుంటాయి. వీటి ఫలితంగా 30 శాతం అమ్మాయిలు నెలలో చాలా రోజులు పాఠశాలకు హాజరు కారు. అందుకని ఈ అంశాన్ని బోధనాంశంగా కొన్ని పాఠశాలల్లో చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, టీచర్లు విద్యార్థినులతో వీటి గురించి మాట్లాడుతున్నారు’’ అని మొమంద్ వివరించారు.

ఇప్పటి వరకు ఆఫ్గానిస్తాన్‌లోని కొన్ని పెద్ద పట్టణాల్లోని పాఠశాలలే దీని వల్ల ప్రయోజనం పొందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో నెలసరి ఇప్పటికీ ఇది ఒక సామాజిక రుగ్మతగా మిగిలిపోయింది. యూనిసెఫ్ సహకారంతో పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)