You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సభావేదికపైనే ముద్దు.. వివాదంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఓ మహిళకు బహిరంగంగా ముద్దుపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ నెల 3న దక్షిణ కొరియా రాజధాని నగరం సోల్‌లో ప్రవాస ఫిలిప్పీన్ శ్రామికుల సదస్సు జరిగింది. దానికి రోడ్రిగో కూడా హాజరయ్యారు.
అక్కడ సభికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, వేదిక పైకి ఓ మహిళను పిలిచి ముద్దివ్వాలంటూ సైగ చేసి ఆ వెంటనే, అక్కడే అందరి ముందూ ఆమెకు ముద్దుపెట్టారు.
అదిచూసి అక్కడున్న వారంతా కేరింతలు కొట్టారు.
కానీ, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "దేశాధ్యక్షుడి ప్రవర్తన అందరూ అసహ్యించుకునేలా" ఉందని ఫిలిప్పీన్స్ మహిళా హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలేం జరిగింది?
పుస్తకాలు తీసుకునేందుకు వేదిక మీదకు రావాలని ఇద్దరు మహిళలను రోడ్రిగో పిలిచారు.
ఒక మహిళను ఆయన కౌగిలించుకున్నారు, తర్వాత ఆమె అతని చెంప మీద ముద్దుపెట్టి వెళ్లిపోయారు.
తర్వాత రెండో మహిళను లిప్ కిస్ ఇవ్వాలని రోడ్రిగో సైగ చేశారు. సభలో అందరూ కేరింతలు కొడుతున్నారు. ఆమె సిగ్గుపడుతూ నవ్వుతుండగా.. ఆయన ఘాటైన ముద్దిచ్చారు.
దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయన తీరును మహిళా హక్కుల సంఘం గాబ్రియెలా ఖండించింది. విధాన పరమైన సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే రోడ్రిగో ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించింది.
దేశాధ్యక్షుడి ప్రవర్తన అనైతికమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
"అధికార బలంతో ఆ పేద అమ్మాయిని బలవంతంగా ముద్దుకు అంగీకరించేలా చేశారని" ట్విటర్‌లో షార్మనే క్వింటో ఆరోపించారు.
అయితే, ఆ ముద్దులో ఎలాంటి 'దురుద్దేశం లేదని' ఆ మహిళ అన్నారని ఫిలిప్పీన్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తారన్న ఆరోపణలు గతంలోనూ వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)